close
పశువుల్లో నైట్రేట్‌ విష ప్రభావం

న్యూస్‌టుడే, విజయవాడ (సిటీ)

శువుల ఆరోగ్య పరిస్థితులను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ముఖ్యంగా పశువుల్లో నైట్రేట్‌ విష ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని టీఎఫ్‌ఎఎల్‌ ల్యాబ్‌ (వీబీఆర్‌ఐ) వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ కె.లావణ్య (సెల్‌: 83744 45141) తెలిపారు.

పశువుల్లో నైట్రేట్‌ విష ప్రభావం అరుదుగా కనిపిస్తుంది. ఆకుపచ్చని తృణ ధాన్యాలు, స్వీట్‌కార్న్‌ (తీపి మొక్కజొన్న), పొద్దుతిరుగుడు.. వంటి పంటల్లో నైట్రేట్‌ అధికంగా ఉంటుంది. ఈ పొలాల్లో పశువులు మేయడం, ఈ పంటల నుంచి ప్రవహించిన నీటిని తాగడం.. వంటివి పశువుల్లో విషప్రభావానికి కారణమవుతాయి. సాధారణంగా నైట్రేట్‌ పశువుల అరల పొట్టలో (రూమెన్‌)కి చేరిన తర్వాత నైట్రైట్‌గా మారుతుంది. అరల పొట్టలోని సూక్ష్మజీవుల చర్యలతో నైట్రైట్‌ అమోనియాగా తర్వాత మాంసకృత్తులు (ప్రొటీన్స్‌)గా మారుతుంది. కానీ తక్కువ సమయంలో ఎక్కువ నైట్రేట్‌ను పశువు తీసుకున్నప్పుడు.. నైట్రేట్‌ రూమెన్‌లో పేరుకుపోయి, జీర్ణకోశం ద్వారా రక్తంలోకి చేరుతుంది. ఎర్రరక్త కణాల్లోని ఇనుముతో చర్య జరిపి, కణాలకు ఆక్సిజన్‌ అందకుండా చేస్తుంది.

విష ప్రభావ లక్షణాలు
* నైట్రేట్‌ విషానికి గురైన పశువుల్లో గంట వ్యవధిలోనే లక్షణాలు కనిపిస్తాయి. పశువు శరీర ఉష్ణోగ్రతలు తగ్గటం, పొట్ట నొప్పి, కడుపుబ్బరం, పశువు కంగారుగా ఉండటం, విరోచనాలు, కండరాల్లో అసంకల్పిత ప్రకంపనలు, నోటి వెంట చొంగ కారడం, నోరు నీలంగా మారడం, నోటితో శ్వాస తీసుకోవడం, తరచూ మూత్ర విసర్జన.. వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పశువు హఠాత్తుగా పడిపోయి, కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది.
* నైట్రేట్‌ విష ప్రభావానికి గురైన పశువుల్లో కొన్ని 10 నుంచి 14 రోజుల వ్యవధిలో ఈసుకుపోతాయి. బలహీనంగా ఉన్న పశువులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పశుగ్రాసంలో ఒక శాతం కంటే ఎక్కువ నైట్రేట్‌ ఉన్నప్పుడు పశువులు విష ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. నీటిలో నైట్రేట్‌తో పాటు ఈ-కోలై బ్యాక్టీరియా ఉన్నప్పుడు విషప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.


వ్యాధి నిర్ధారణ : నైట్రేట్‌ ఎరువులు వినియోగించిన పొలంలో ఉన్న గడ్డి తిన్న పశువుల్లో విష ప్రభావ లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించి నిర్ధారించుకోవాలి. పశువుల్లో విష ప్రభావం అధికంగా ఉంటే పశువు రక్తం చాక్లెట్‌ రంగులోకి మారుతుంది.

చికిత్స : ఒక శాతం మిథిలిన్‌బ్లూ ఐ.వి. ఇంజక్షన్‌ను పశువు కిలో శరీర బరువుకు 4 నుంచి 22 గ్రా. వరకు ఇవ్వవచ్చు. 20 నుంచి 30 నిమిషాల తర్వాత బూస్టర్‌ డోసు ఇవ్వాలి.


నివారణ చర్యలు
* నైట్రేటు ఎరువులు వినియోగించిన బీళ్ళలో పశువులను మేపకూడదు. ఎక్కువ నైట్రేట్‌ కలిగిన పచ్చికను సైలేజిగా (మాగుడు గడ్డిగా) మార్చడం ద్వారా మేతలో నైట్రేట్‌ శాతాన్ని తగ్గించవచ్చు. పశువులు నైట్రేట్‌ ఎరువులు తినకుండా చూడాలి.
* మొక్కల కాండం కింది భాగంలో నైట్రేట్‌ అధిక శాతంలో ఉంటుంది. కాబట్టి మేత కోసేటప్పుడు కాండం పైభాగం, ఆకులు వచ్చేలా కోయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.