close
జీడిమామిడిలో పోషక లోపాలు

న్యూస్‌టుడే, బాపట్ల

జీడిమామిడిలో పోషక లోపాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను బాపట్ల జీడిమామిడి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ ఉమామహేశ్వరరావు (ఫోన్‌: 94404 79511) వివరించారు.

నత్రజని: ఈ లోపం వల్ల ఆకుల పరిమాణం తగ్గుతుంది. ఆకులు పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఆకుల తొడిమలు ఎరుపు రంగులోకి మారి పెరుగుదల మందగిస్తుంది. లోప సవరణకు.. లీటరు నీటికి 20-40 గ్రా. యూరియా కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. ఒక్కో చెట్టుకు సుమారు కిలో చొప్పున యూరియా వేయాలి.

భాస్వరం: ఆకులు ముదురాకు పచ్చగా ఉండి క్రమంగా పసుపు, గోధుమ రంగులోకి మారతాయి. కింది ఆకులు వడలి, రాలిపోతాయి. మొక్కల పెరుగుదల ఉండదు. నివారణకు ఒక్కో ఎదిగిన చెట్టుకు సుమారు రెండు కిలోల చొప్పున సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ వేయాలి.

పొటాషియం: కింది ఆకులు కొన నుంచి ఎండటం మొదలవుతుంది. ఆకులు అంచుల వెంబడి పసుపు వర్ణంలోకి మారతాయి. ఈ లోపం ఉధృతంగా ఉంటే.. ఆకంతా పసుపు వర్ణంలోకి మారి అంచులు నిర్జీవమవుతాయి. తొలిదశ మొక్కల్లో ఈ లోప సవరణకు.. లీటరు నీటికి 20 గ్రా. పొటాషియం నైట్రేట్ కలిపి 15 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారీ చేయాలి. ఒక్కో చెట్టుకు 100 గ్రా. చొప్పున మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలి.


సూక్ష్మపోషక లోపాలు

జింక్‌: ముదురాకుల చివర్లు పాలిపోతాయి. ఆకులపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. సవరణకు లీటరు నీటికి 2 గ్రా. జింకుసల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి.

మెగ్నీషియం: కింది ఆకులు పసుపు రంగులోకి మారతాయి. మొక్కలు నాటిన తొలి నెలలో ఈ లోప లక్షణాలు మొదలవుతాయి. త్వరగా చెట్టు పైభాగానికి లోప లక్షణాలు వ్యాప్తి చెందుతాయి. రెండు నుంచి రెండున్నర నెలల్లో మొక్క చనిపోతుంది. ఈ మొక్కల్లో.. పక్క కొమ్మలు రావడం తగ్గుతుంది. సవరణకు లీటరు నీటిలో 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి.

కాల్షియం: ఈ లోపం మొక్కల ప్రాథమిక దశలోనే కనిపిస్తుంది. లేతాకులు మొదట పసుపు రంగులోకి మారి ఆకులు చిన్నవిగా, దగ్గరగా ఉంటాయి. పైఆకుల ఈనెల మధ్యభాగం లోనికి ముడుచుకొని ఉంటుంది. ఈ లోపం వల్ల పక్క కొమ్మల వ్యాప్తి తగ్గుతుంది.

గంధకం: ఈ లోపం ఉంటే.. మొక్క నాటిన మొదటి నెలలో లేతాకులు.. కొన భాగం నుంచి పత్రహరితాన్ని కోల్పోతాయి. తర్వాత ఆకు కొన నెమ్మదిగా ఆకుపచ్చ రంగు నుంచి ఎరుపుతో కూడిన పసుపు రంగుకు, మిగిలిన ఆకులు పసుపు రంగుకు మారతాయి. మొక్కలపై కాల్షియం, గంధకం లోప సవరణకు.. లీటరు నీటికి 10-20 గ్రా. కాల్షియం క్లోరైడ్‌ కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల జిప్సం వేయాలి.

మాలిబ్డినం: ఈ లోపం వల్ల ఆకులపై పసుపు, ఆకుపచ్చ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు మాత్రం ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కొన్ని లేతాకులు ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. సవరణకు లీటరు నీటికి సోడియం మాలిబ్డేట్ 2 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.


ఇనుము: ఆకుల్లో ఈనెలు ఆకుపచ్చగా ఉండి, మిగిలిన భాగమంతా లేతాకుపచ్చ లేదా పసుపు రంగుకు మారుతుంది. చౌడు భూముల్లో ఈ లోపం అధికంగా ఉంటుంది. లోపం తీవ్రమైనప్పుడు ఆకు మొత్తం పసుపు రంగుకు మారుతుంది. సవరణకు లీటరు నీటిలో 5 గ్రా. ఫెర్రస్‌ సల్ఫేట్ + 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.