close
అల్లం సాగు!

- న్యూస్‌టుడే, జగిత్యాల (వ్యవసాయం)

అల్లంలో మంచి దిగుబడుల సాధనకు నేలలు, వాతావరణ పరిస్థితులతో పాటు మేలైన యాజమాన్యం దోహదం చేస్తుంది. ఈ పంట సాగులో పాటించాల్సిన మెలకువలను జగిత్యాల జిల్లా ఉద్యానశాఖ అధికారి జె.ప్రతాప్‌సింగ్‌ వివరించారు.
* అల్లంను తొలిసారి పండించే రైతులు.. ముందుగా కొద్ది విస్తీర్ణంలో పంట సాగు చేసి, అనుభవాన్ని గడించిన తర్వాత తదుపరి సీజన్లలో పంటను విస్తరించాలి. తమ నేలలు అల్లం సాగుకు అనువైనవని ముందుగా నిర్ధారించుకున్న తర్వాత, తగిన రకాలను సాగుకు సేకరించాలి. అల్లంను ఏప్రిల్‌ 15 నుంచి మే 15 వరకు విత్తుకోవచ్చు. తెలంగాణలో సాగుకు ‘సిద్దిపేట’ రకం అనుకూలం. ఈ రకం విత్తనాన్ని ఇతర రైతుల నుంచి తీసుకోవచ్చు. మారన్‌, రియెడిజనీరో, భైరి, తుని, సుప్రభ, సురుచి, సురభి తదితర రకాలు కూడా సాగుకు అనువైనవే. మేలైన విత్తనం మంచి దిగుబడులను అందిస్తుంది. కాబట్టి తెగుళ్లు సోకని పంట నుంచి దుంపలను విత్తనంగా తీసుకోవాలి.
* తోటల్లో నీరునిలిస్తే.. దుంపలు చెడిపోతాయి కాబట్టి నీరు నిలిచే బరువైన నేలలు, బంకమట్టి నేలల్లో అల్లంను పండించవద్దు. ఎర్రనేలలు, గరపనేలలు, చల్కా భూములు అల్లం సాగుకు అత్యంత అనువైనవి. మే 15 తరువాత అల్లంను విత్తితే.. పంటపై దుంపకుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. దుంపల వరుసల మధ్య మొక్కజొన్న, అలసంద, ఆముదం వంటి పంటలను విత్తి, అల్లానికి నీడ కల్పించాలి. ఆముదంను గట్లమీద పొలం చుట్టూ నాటవచ్చు. అల్లంను దొండ పాదుల్లోనూ, షేడ్‌నెట్‌ల కింద కూడా సాగు చేయవచ్చు. అరటి, బొప్పాయి, నిమ్మ తోటల్లోనూ అంతరపంటగా సాగు చేయవచ్చు. పాక్షికంగా నీడ ఉన్నపుడు అల్లం బాగా పెరుగుతుంది కాబట్టి రైతులు ప్రధానంగా నీడకల్పనకు చర్యలు తీసుకోవాలి.
* నాటేముందు మొలక వచ్చిన దుంపలను సుమారు 25 గ్రా. ఉండేలా ముక్కలుగా చేయాలి. ఎకరాకు 480-720 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. విత్తన దుంపలను నాటే 10 రోజుల ముందు మంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మొలకశాతం పెరుగుతుంది. సరైన మొక్కల సాంద్రతకు మొలకశాతం కీలకం. అల్లంలో విత్తనం ద్వారా తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉంటుంది. విత్తనశుద్ధి చేస్తే.. పంటపై పొలుసు పురుగులు, తెగుళ్ల వ్యాప్తి తగ్గుతుంది. ఇందుకోసం.. లీటరు నీటికి 3 గ్రా. మాంకోజెబ్‌ + 5 మి.లీ. మలాథియాన్‌ చొప్పున కలిపిన ద్రావణంలో దుంపలను అరగంటసేపు నానబెట్టి తీసి నీడలో ఆరనివ్వాలి. తదుపరి మళ్లీ లీటరు నీటికి 4 గ్రా. చొప్పున ట్రైకోడెర్మా విరిడి కలిపిన ద్రావణంలో గంటవరకు ఉంచి తీసి నీడలో ఆరబెట్టిన తరువాత విత్తాలి.
* అల్లంను ఎత్తు మడులపై విత్తాలి. దుక్కిచేసిన తరువాత 1.8×1.2 మీటర్లతో సమతుల మడులను తయారు చేయాలి. నీటిపారుదల, మురుగునీటి పారుదలకు వీలుగా.. ఒకదాని పక్కన ఒకటి 30 సెం.మీ. లోతు, 45 సెం.మీ. లోతుండేలా కాలువలు ఏర్పాటు చేయాలి. వరుసలు, మొక్కల మధ్య 45×15 సెం.మీ. ఎడం ఉండేలా విత్తాలి. తోటలో వర్షపునీరు, సాగునీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు బయటకు పోయే చర్యలు చేపట్టాలి.
నాటిన తొలి రోజుల్లో.. వేసవిలో నాలుగు రోజులకో తడివ్వాలి. వర్షాకాలం చివరలో వారానికోతడి పారించాలి. తోటలో వర్షపునీరు నిల్వకుండా చూడాలి. ఎత్తుమడుల్లో, జంట కాలువల పద్ధతిలో అల్లంను విత్తినప్పుడు బిందుసేద్యం ద్వారా నీరందిస్తే దిగుబడులు పెరుగుతాయి కాబట్టి వరుసల్లో బిందుసేద్య పైపులను అమర్చుకోవాలి.
* ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సూపర్‌ ఫాస్ఫేట్‌ను ఆఖరి దుక్కిలోవేసి కలియదున్నాలి. ఎత్తుమడుల్లో అల్లం నాటేటప్పుడు పచ్చిఆకు, పచ్చిరొట్టతో మల్చింగ్‌ చేయాలి. నాటిన తరువాత 40 రోజులకు 26 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 80 రోజులకు 54 కిలోల యూరియా, 42 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 120 రోజులకు 26 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను పైపాటుగా వేయాలి. ఎరువులు వేసిన ప్రతిసారి మట్టిని ఎగదోయాలి. మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు పలుమార్లు కలుపు తీయాలి. కలుపు తీసిన తరువాత పైపాటు    ఎరువులను వేసి మట్టిని ఎగదోయాలి.
సస్యరక్షణ చర్యలు
* పంట లేతదశలో ఆశించే కాండం తొలుచు పురుగుల నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్‌ 2 మి.లీ. + 1 మి.లీ సాండోవిట్‌ కలిపి మొవ్వు ఆకులపై పిచికారి చేయాలి.
* ఆకులను చుట్టి తినే ఆకుముడత పురుగుల నివారణకు.. లీటరు నీటికి 3 గ్రాముల కార్బరిల్‌ లేదా 2 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ కలిపి పిచికారి చేయాలి.
* దుంపల మొదళ్లలో వేరును కత్తిరించే వేరుపురుగు నివారణకు.. ఎకరాకు 7 కిలోల కార్బోఫ్యూరాన్‌ గుళికలు వేయాలి.
* ఆకుమచ్చ నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లీటరు నీటికి 3 గ్రా. చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఆకుమాడు తెగులును అరికట్టేందుకు.. లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా ప్రొపికొనజోల్‌ను 1 మి.లీ. వంతున కలిపి పిచికారి చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.