close
వరిలో ముందే వస్తున్న..  పిలకలు, కంకులు!

రైతుల్లో కలవరం
 ప్రత్యేక వాతావరణ పరిస్థితులే కారణం
  అప్రమత్తంగా ఉండాలంటున్న శాస్త్రవేత్తలు
- న్యూస్‌టుడే, ఖమ్మం (వ్యవసాయం)

వరిలో ముందే పిలకలు రావటం, ఈనటం, కంకులు రావటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వరిలో తెగుళ్లు ఆశిస్తున్నాయని రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.వెంకటరమణ తెలిపారు. నివారణ చర్యలను సూచించారు.
ముందే పిలకలు, కంకులు
ఆర్‌.ఎన్‌.ఆర్‌-15048, హెచ్‌.ఎం.టి. సోన, ఎం.టి.యూ-1010, కే.ఎన్‌.ఎం.118, ఎం.టి.యూ-1156, పూజ వంటి స్వల్పకాలిక రకాల్లో నాట్లు వేసిన 20-30 రోజులకే తల్లి కర్రలు ఈనుతున్నాయి. నవంబరు 15 కన్నా ముందు నార్లు పోసిన కొన్ని ప్రాంతాల్లో.. వరిలో పక్క పిలకలు కూడా ఈని చిన్న కంకులు కనిపిస్తున్నాయి. నవంబరు 15 కన్నా ముందు నార్లు పోయటం, ముదురునారు నాటడం, నాట్లు వేసిన తొలిదశలో నత్రజని ఎరువులు వాడకపోవటం..  దీనికి కారణంగా భావిస్తున్నారు. ఈ సమస్య ఉన్న పొలాల్లో.. ఎకరాకు 15 కిలోల యూరియాను వారం వ్యవధిలో 2, 3 దఫాలుగా చేలో బురద పదును ఉంచి పైపాటుగా చల్లాలి.
సల్ఫైడ్‌ దుష్ప్రభావం..
వరిలో జింకులోపం, చౌడు, మురుగునీరు వల్ల ‘సల్ఫైడ్‌’ సమస్య కనిపిస్తోంది. వేర్లు నల్లబడి, పిలకలు చనిపోతాయి. నివారణకు.. మురుగునీటిని బయటకు పంపాలి. ఎకరాకు 400 గ్రా. జింక్‌సల్ఫేట్‌ను వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అంతరకృషి చేసి, 2 గ్రా. కార్బండజిమ్‌ + మాంకోజెబ్‌ మిశ్రమాన్ని ప్రతి కిలో యూరియాకు కలిపి పైపాటుగా వేయాలి.
చీడపీడలు
ప్రస్తుతం వరిలో అగ్గితెగులు, కాండం తొలిచే పురుగు, వరి ఈగ ఆశించి ఎక్కువ నష్టం కలిగిస్తోందని వ్యవసాయశాఖ గుర్తించింది.
అగ్గితెగులు: దీన్ని ఆకుమచ్చ ఏర్పడే దశలోనే నివారించాలి. లేదంటే ఇది తర్వాత దశలో మెడవిరుపుకు కారణమై అధిక నష్టం కలిగిస్తుంది.
* ప్రస్తుత వాతావరణం వరిలో అగ్గి తెగులు వ్యాప్తికి అనుకూలంగా ఉంది. కాబట్టి రైతులు నత్రజని ఎరువులను వరికి కొన్ని రోజులు వేయటం ఆపాలి. తెగులు వ్యాప్తి లేని ప్రాంతాల్లో.. సాధారణ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు.. సిఫారసు చేసిన నత్రజని ఎరువును విభజించి, ఎక్కువ దఫాలుగా (3-4 సార్లు) వేయాలి.
* నాటిన పొలంలో, పొలం గట్లపైన తుంగ, గరిక, ఒడిపిలి వంటి గడ్డిజాతి కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
* మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు వీలుగా పొటాష్‌ ఎరువును మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ రూపంలో ఎకరాకు 10-15 కిలోలు చొప్పున రెండు దఫాలుగా.. దమ్ములో ఒకసారి, చిరుపొట్ట దశలో మరోసారి వేయాలి.
* నివారణకు.. లీటరు నీటికి 2.5 గ్రా. ట్రైసైక్లోజోల్‌ + మాంకోజెబ్‌ మిశ్రమ మందును లేదా 1.5 మి.లీ. ఐసోప్రోథయోలేన్‌ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్‌.. వీటిలో ఏదైనా ఒక మందును అవసరాన్ని బట్టి 7-10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
కాండం తొలిచే పురుగు : చిరుపొట్ట దశలో ఉన్న వరిలో కాండం తొలిచే పురుగు నివారణకు తప్పనిసరిగా ఎకరాకు 200 లీటర్ల నీటిలో కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ (50 శాతం ఎస్‌.పి.) 400 గ్రా. లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 60 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.
వరి ఈగ : పూత దశలో వరి ఈగ ఆశిస్తే.. గింజలు పాలు పోసుకోవు. తాలుగా మారతాయి. కాండం తొలిచే పురుగు నివారణకు సిఫారసు చేసిన మందులతోనే వరి ఈగను కూడా నివారించవచ్చు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.