close
టిష్యూకల్చర్‌ అరటిలో.. నాణ్యత పెంచే చర్యలు!

న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

టిష్యూకల్చరు అరటి సాగులో పాటించాల్సిన మెలకువలను ఉద్యానశాఖ విశ్రాంత సంయుక్త సంచాలకులు వేంపల్లి లక్ష్మిరెడ్డి (చరవాణి: 97011 43333) వివరించారు. గెలలు వేయకముందు చేపట్టే యాజమాన్య పద్ధతులతో మొక్కలు దృఢంగా పెరుగుతాయి. గెలల్లో హస్తాలు, కాయల సంఖ్య, పరిమాణం పెరగడానికి దోహదపడుతుంది. గెల వేసిన తర్వాత చేపట్టే మెలకువలు, గెలలోని కాయల సైజు, నాణ్యత వృద్ధికి తోడ్పడతాయి.
* మంచి గెల, కాయ పరిమాణం, నాణ్యత బాగుండాలంటే మొక్కల్లో కనీసం 12 ఆరోగ్యవంతమైన ఆకులుండాలి. హస్తాలపై ఉండే పుష్ప గుచ్ఛాలను (బ్రాక్టులను) విచ్చుకున్న వెంటనే తొలగించాలి. హస్తాలన్నీ విడిచిన తర్వాత గెల చివరన ఉండే మగ పూల గుచ్ఛాన్ని 10-15 సెం.మీ. కాడను వదిలి కోసేయాలి. దీన్ని అలాగే వదిలేస్తే.. కాయలకు నష్టం కలుగుతుంది. గారను కలిగించే తామర పురుగులకు ఇది స్థావరంగా మారుతుంది. ఆహార పదార్థాల కోసం పోటీ పడటం వల్ల కాయల పరిమాణం తగ్గుతుంది.
* అరటి మొగ్గ నిలువుగా ఉన్నప్పుడు.. పైనుంచి 1/4 ఎత్తులో ఇంజెక్షన్‌ ద్వారా లీటరు నీటికి 0.2 మి.లీ. చొప్పున ఇమిడాక్లోప్రిడ్‌ కలిపిన 2 మి.లీ. మందు ద్రావణాన్ని 30 డిగ్రీల కోణంలో సిరంజితో ఎక్కించాలి. ఈ చర్య ద్వారా కాయలకు సోకే పురుగులను నివారించవచ్చు.
గెల కాడ ద్వారా పోషకాలు
గెల చివర నుంచి పోషకాలను అందిస్తే గెల బరువు 20-25 శాతం పెరుగుతుంది. గెల చివరన ఉన్న హస్తాల్లోని కాయల పరిమాణం బాగా పెరుగుతుంది. ఇందుకోసం.. అరకిలో ఆవుపేడ, 10 గ్రా. యూరియా, 10 గ్రా. పొటాషియం సల్ఫేట్‌, 100 మి.లీ. నీరు బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మందంగా ఉండే పాలిథీన్‌ సంచిలో పోయాలి. గెలలోని ఆఖరి హస్తం విచ్చుకున్న వెంటనే ఆఖరి హస్తానికి 6 అంగుళాల కింద గెల కాడను ఏటవాలుగా కోయాలి. పోషకాల మిశ్రమం ఉన్న పాలిథీన్‌ సంచిని ఏటవాలుగా కోసిన గెల కాడ భాగం మిశ్రమంలో ఉండేలా తొడగాలి. అనంతరం పాలిథీన్‌ సంచి మూతిని గెల కాడకు నైలాన్‌ దారంతో కట్టాలి. ఈ సంచిని గెల కోసే వరకు ఉంచాలి. ఈ మిశ్రమంలో నుంచి నత్రజని, పొటాష్‌, ఖనిజ లవణాలను గెలలోని కాయలు గ్రహించి బాగా వృద్ధి చెందుతాయి. ఆవుపేడ మాత్రమే వాడాలి. ఎందుకంటే ఆవు పేడలో ‘బేసిల్లస్‌ సిబులిస్‌’ అనే బ్యాక్టీరియా ఉన్నందున, కోసిన గెల కాడ భాగం కుళ్లదు.
* ఆఖరి హస్తం విడిచిన 15-20 రోజులకు కాయల చివర ఎండిన ఆడపూల అవశేషాలను తొలగించాలి. లేదంటే కాయలకు మచ్చిక కుళ్లు తెగులు (సిగార్‌ ఎండ్‌రాట్‌) సోకే ప్రమాదం ఉంటుంది.
* గెల తొడిగిన తర్వాత, గెల పైభాగంలో ఏర్పడే ‘పోటాకు’ను వంచి వంగిన గెల కాడపై (తొండంపై) కప్పాలి. దీనివల్ల వంగిన గెల కాడపై ఎండ నేరుగా పడదు. గెల కాడ, కాయలు ఎండకు మాడిపోయే ప్రమాదం ఉండదు.
* ఎండు గెల వంపు (తొండంపై) ఎండకు మాడి (కమిలి) మచ్చ ఏర్పడితే.. వెంటనే లీటరు నీటికి 1 గ్రాము కార్బండిజమ్‌ కలిపి మాడిన భాగంలో పిచికారి చేయాలి. ఇలా చేస్తే మచ్చ విస్తరించదు. ఆఖరి హస్తం విచ్చుకున్న వారం తర్వాత ఒక లీటరు నీటికి 10 గ్రాములు 0-0-50 (సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌) లేదా 13:0:45 కలిపి 2-3 దఫాలుగా గెలకు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే కాయల పరిమాణం బాగా పెరుగుతుంది. దీంతో కాయల నాణ్యత, దిగుబడి పెరుగుతాయి.
పురుగుల సమస్య తగ్గేలా..
* కాయల రంగు, నాణ్యత పెంచేందుకు, పురుగుల సమస్యను తగ్గించేందుకు.. 6 శాతం రంధ్రాలున్న 100 గేజి తెలుపు లేదా నీలి రంగు పాలిథీన్‌ తొడుగులు (కవర్లు) 80 సెం.మీ. వెడల్పు, మీటరు పొడవు కొలతలు ఉన్నవి గెలలకు తొడగాలి. తొడుగుల కింది భాగంలో చివరలను కట్టకుండా వదిలేయాలి.
* కాయల తోలుపై తామర పురుగులు గోకి రసాన్ని పీల్చడంతో కాయలపై గార ఏర్పడుతుంది. వీటి నివారణకు.. 10 లీటర్ల నీటికి 20 మి.లీ. ఫిప్రొనిల్‌ లేదా 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 4 గ్రాములు థయోమిథాక్సామ్‌ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు గెలలపై పిచికారి చేయాలి.
* ఎండ నేరుగా కాయలపై పడి, కాయలు మగ్గకుండా ఉండేందుకు ఎండిన అరటి ఆకులతోగాని గెలపై ఉండే.. ఒకటి, రెండు ఆకుల కాడల్ని మడిచి గెలపై కప్పడంగానీ చేయాలి.
ఊతం ఏర్పాటు : వేసవిలో ఈదురు గాలులు ఎక్కువగా వస్తాయి. ప్రకృతిలో మార్పులు రావడంతో సుడిగాలులతో అరటి చెట్లు పడిపోతాయి. గాలులకు చెట్లు సులభంగా పడిపోకుండా ఉండేందుకు.. గెలలు వేసిన వెంటనే గెలలకు ఊతం ఏర్పాటు చేయాలి. గెలలు గాలికి కదిలినప్పుడు కాయలు రాసుకోకుండా ఏర్పాటు చేయాలి.
* చెట్లు గెలలతో ఉన్నప్పుడు పిలకలను తవ్వి తీయరాదు.
 కోత, రవాణా
* దగ్గరి (స్థానిక) మార్కెట్లకు 90-95 శాతం పక్వదశలో, దూరపు మార్కెట్లకు 75 శాతం పక్వదశలో ఉన్న గెలల్ని కోయాలి.
* గెలలో పైనుంచి రెండో హస్తంలోని మధ్య కాయలు పక్వదశను సూచిస్తాయి. గెలల కోత తర్వాత లారీల్లో నింపే వరకు నీడలో ఉంచాలి.
* ఆరుబయట ఉంచిన కాయలు మాడిపోకుండా పైన అరటి ఆకులను కోసి కప్పాలి. ఇలా చేస్తే కాయలు మన్నికగా ఉంటాయి.
* అరటి కాయలు సున్నితమైనవి. మోస్తరుగా ఎండ తగిలినా కమిలిపోతాయి. నల్లగా మాడిపోతాయి. ఇలా రంగు మారిన వాటిని వినియోగదారులు కొనరు. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి.
* లారీల్లో, సరకు రవాణా ఆటోల్లో రవాణా చేసేటప్పుడు ఒక వరుస గెలలు పరిచిన తర్వాత ఆకులు వేయాలి. లోడు పూర్తయిన తర్వాత పైన పట్ట కప్పి, గాలికి ఎగిరిపోకుండా తాళ్లతో కట్టాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.