close
తీగజాతి కూరగాయల్లో సస్యరక్షణ

రైతులు ప్రస్తుతం దోస, పుచ్చ, కాకర, బీర వంటి తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ పంటల్లో.. వివిధ రకాల చీడపీడలు ఆశించే ప్రమాదం ఉంది. వీటి నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలను ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు డాక్టర్‌     వి.చైతన్య, డాక్టర్‌ జే.హేమంత్‌కుమార్‌, కె.రవి కుమార్‌, శ్రీరంజిత తెలిపారు.
రసంపీల్చే పురుగులు : తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ, దీపపు పురుగులు మొక్కల ఆకుల నుంచి రసాన్ని పీల్చి నష్టం కలిగిస్తాయి. తామర పురుగులు మొవ్వు కుళ్లును, పేనుబంక, మొజాయిక్‌ వైరస్‌ తెగులును వ్యాప్తి చేస్తాయి.
నివారణ చర్యలు
* పంటను నాటే ముందు పొలం చుట్టూ సజ్జ, మొక్కజొన్న, జొన్న లాంటి ఎత్తు పెరిగే మొక్కలను దగ్గర దగ్గరగా నాటాలి.
* విత్తనాలు మొలకెత్తిన పది రోజులకు ఎకరానికి 30 చొప్పున పసుపు, నీలం రంగు జిగురు పట్టించిన అట్టలను లేదా రేకులను పంటకు అడుగు ఎత్తులో కర్రకు వేలాడదీయాలి.
* పది లీటర్ల నీటికి 20 మిల్లీలీటర్లు డైమిథోయేట్‌ లేదా ఫిప్రోనిల్‌ లేదా 4 గ్రాములు ఎసిటామిప్రిడ్‌ లేదా 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 15 గ్రాములు డయాఫెన్‌థయురాన్‌ కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే.. పది రోజుల వ్యవధిలో మందులను మార్చి మరోసారి పిచికారీ చేయాలి.
ఎర్ర నల్లి
ఇవి ఆకుల అడుగున చేరి రసం పీల్చటం వల్ల ఆకులు ముడతపడి పసుపు రంగుకు మారి ఎండుతాయి. నివారణకు.. లీటరు నీటికి డైకోఫాల్‌ 5 మి.లీ. లేదా స్పైరోమెసిఫిన్‌ 1 మి.లీ. లేదా డయాఫెన్‌థయురాన్‌ 1.25 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
పండు ఈగ : ఈ ఈగలు పెట్టిన గుడ్ల నుంచి వెలువడిన సన్నని పిల్ల పురుగులు రంధ్రాలు చేసుకుని కాయ లోపలికి పోయి కండను తింటాయి. ఫలితంగా కాయల్లోని కండ కుళ్లిపోతుంది. నివారణకు.. విషపు ఎరలను వాడాలి. 10 లీటర్ల నీటిలో మలాథియాన్‌ 100 మి.లీ., 100 గ్రా. చక్కెర లేదా బెల్లం కలిపిన ద్రావణాన్ని మట్టి మూకుళ్ళలో పోసి ఎకరాకు 10-12 చోట్ల పెట్టాలి. ఈ మందు ద్రావణం తల్లి ఈగలను ఆకర్షిస్తుంది. ఈ ద్రావణానికి పులిసిన కల్లు మడ్డి కలిపితే, ఈగలు ఇంకా ఎక్కువగా ఆకర్షితమై, విష పదార్థాన్ని తిని చనిపోతాయి.

పాముపొడ పురుగు : దీన్నే రైతులు పాముపొడ తెగులు అంటారు. సన్నని గొంగళి పురుగు ఆకు పొరల్లోకి చొచ్చుకుపోయి పత్రహరితాన్ని తిని నష్టపరుస్తుంది. నివారణకు.. లీటరు నీటికి 2 మి.లీ. ప్రొఫినోఫాస్‌ కలిపి చీడ ప్రారంభ దశలోనే పిచికారీ చేయాలి. తీగ పెరుగుదల దశ నుంచి పూత వచ్చే వరకు లీటరు నీటికి 50 మి.లీ. వేప గింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
తెగుళ్లు
బూజు తెగులు : ఆకుల అడుగున బూజు మాదిరిగా ఏర్పడుతుంది. తెగులు ఉధృతికి ఆకుల అడుగున ఊదారంగు మచ్చలు, పైన పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు.. లీటరు నీటికి 2 గ్రా. మెటలాక్సిల్‌ + మాంకోజెబ్‌ లేదా 1 గ్రా. డైమిథోమార్ఫ్‌ కలిపి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు : ఆకులు, తొడిమలు, తీగలు, కాయలపై శిలీంధ్రం ఆశించి తెల్లని బూడిద లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఫలితంగా ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. నివారణకు.. లీటరు నీటికి ఒక మి.లీ. కెరాథేన్‌ లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్‌ కలిపి పిచికారీ చేయాలి.
ఆకుమచ్చ తెగులు : ఆకులపై సన్నని గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఉధృతి ఎక్కువైతే ఇవి పెద్దగా మారి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు వల్ల కాయలకూ నష్టం వాటిల్లుతుంది. నివారణకు.. లీటరు నీటికి కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. లేదా కార్బండజిమ్‌ 1 గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.