close
మామిడిలో కాయల సంరక్షణ!

ప్రస్తుతం మామిడి తోటలు కాతదశలో ఉన్నాయి. ఈ దశ రైతులకు ఆర్థికంగా చాలా కీలకమైనది. ఈ సమయంలో రసంపీల్చు పురుగులు, కాయ తొలిచే పురుగులు ఆశిస్తాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యల వివరాలు..
రసంపీల్చే పురుగులు
తేనెమంచు పురుగులు: ఇవి పూమొగ్గ దశలో, పిందె, కాయ దశలో ఆశిస్తాయి. ఇవి కాయల నుంచి రసాన్ని పీల్చి, తేనె వంటి పదార్థాన్ని విడుదల చేయడం వల్ల కాయలపై నల్లని శిలీంద్రం (మసి/మంగు తెగులు) ఏర్పడుతుంది. ఫలితంగా కాయలు నాణ్యత కోల్పోతాయి. కుళ్లిపోయే ప్రమాదముంటుంది. నివారణకు.. 10 లీటర్ల నీటికి.. ఇమిడాక్లోప్రిడ్‌ 5 మి.లీ. లేదా థయోమిథాక్సామ్‌ 3 గ్రా. కలిపి పిచికారి చేయాలి.
తామర పురుగులు: ఇవి కాయల చర్మాన్ని గోకి రసం పీలుస్తాయి. దీంతో కాయలపై రాతిమంగు ఏర్పడి కాయలు నాణ్యత కోల్పోతాయి. మార్కెట్లో ధర రాదు. నివారణకు.. లీటరు నీటికి ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.
పిండి పురుగు : శరీరంపై తెల్లని పిండి వంటి పదార్థం కలిగిన చిన్న పురుగులు గుంపులుగా చేరి కాడలు, కాయల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో వాటి పెరుగుదల తగ్గిపోతుంది. కాయలు రాలిపోతాయి. ఇవి కాయలపై తేనె వంటి జిగురును విసర్జిస్తాయి. ఈ జిగురుపై మసి తెగులు ఏర్పడుతుంది. ఫలితంగా కాయలు నాణ్యత కోల్పోతాయి. పరిమాణం, ఆకారం మారిపోయి మార్కెట్లో ధర రాదు. నివారణకు.. చెట్ల మొదళ్లలోని మట్టిని (పాదులను) తిరగతిప్పాలి. గ్రీజు పూసిన పాలిథీన్‌ కవరును కాండం చుట్టూ చుట్టి, పిల్ల పురుగులు చెట్టుపైకి రాకుండా అదుపు చేయవచ్చు.
కాయ తొలుచు పురుగు: ఇది పంటపై 2, 3 దఫాలుగా ఆశించి నష్టం కలిగిస్తుంది. కాయదశలో ఆశించినప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది. తల్లి రెక్కల పురుగు కాయలపై గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు.. కాయ కొన భాగంలో రంధ్రం చేసి, లోపలికి ప్రవేశించి విత్తనాన్ని తిని పెరుగుతాయి. దీంతో కాయల కొన భాగంలో సొన కారడం, నల్లగా మారటం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. తరువాత కాయలు కుళ్లి రాలిపోతాయి. ఒక్కో కాయలో 4-6 పిల్ల పురుగులు ఉంటాయి. ఈ పురుగుల శరీరంపై గులాబి, తెలుపు రంగు చారలుంటాయి. ఎండు కొమ్మల్లో ఈ పురుగులు నిద్రావస్థ దశను గడుపుతాయి.


టెంకె పురుగు: ఈ పురుగులు నీలం, తోతాపురి రకాలను ఎక్కువగా ఆశిస్తాయి. మామిడి కాయ గోళి సైజులో ఉన్నప్పుడు వీటి తల్లి పురుగులు కాయలపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు కాయలను తొలిచి టెంకను చేరి, టెంకలోని గింజను తింటూ పెరుగుతాయి. కాయల్లోనే ఈ పురుగు జీవితదశలను పూర్తి చేసుకుని, కాయకు రంధ్రం చేసి తల్లి పురుగులు బయటకు వస్తాయి. ఈ పురుగాశించిన కాయలు మార్కెట్లో ధర పలకవు.
పండుఈగ : కాయలు పక్వానికి వచ్చి, పండు చేతికందే దశలో ఈ పురుగాశించి నష్టం కలిగిస్తుంది. తల్లి ఈగలు ఎరుపు, గోధుమ రంగులో పసుపుపచ్చని చారలు కలిగి ఉంటాయి. ఇవి ఎదుగుతున్న కాయలమీద గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు కాయల్లోకి చేరి, గుజ్జును తిని పండ్లు కుళ్లి, రాలిపోయేలా చేస్తాయి. కాయలపైనున్న రంధ్రాల నుంచి ద్రవం కారుతుంది. నివారణకు.. రాలిన పండ్లను ఏరి కాల్చేయాలి. చెట్ల పాదులను శుభ్రంచేసి దున్నాలి. పురుగులను ఆకర్షించే మిథైల్‌ యూజినాల్‌ లీటరు నీటికి 2 మి.లీ. + మలాథియాన్‌ 2 మి.లీ. లేదా కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు 3 గ్రా. కలిపిన ద్రావణాన్ని పళ్లాల్లో పోసి తోటలో అక్కడక్కడ పెట్టాలి. ఈ ద్రావణానికి తల్లి పురుగులు ఆకర్షితమై, అందులో పడి చనిపోతాయి. పండు ఈగ ఎరలను ఎకరాకు 5 చొప్పున నేలపై 5-6 అడుగుల ఎత్తులో కొమ్మలకు వేలాడదీయాలి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి.

 

నివారణకు..
రాలిన కాయలను ఏరి కాల్చేయాలి. పంట తరువాత ఎండు కొమ్మలను తీసి కాల్చేయాలి. తద్వారా నిద్రావస్ధలో ఉన్న గొంగళి పురుగులు నశిస్తాయి. లీటరు నీటికి వేప గింజల కషాయం 50 మి.లీ. లేదా వేపనూనె 5 మి.లీ. కలిపి పిచికారి చేసి తొలిదశ పురుగులను అదుపు చేయవచ్చు. పురుగులు ఉధృతంగా ఉంటే.. క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. + సైపర్‌మెత్రిన్‌ 1 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. + డైక్లోరోవాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

- డాక్టర్‌ ఎస్‌.దయాకర్‌ (సెల్‌ : 94403 36752)
ఎ.ఎన్‌.వి.చందన, వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.