close
రైతు స్థాయిలో విత్తనోత్పత్తి!

సంకర రకాలతో పాటు సూటి రకాల్లోనూ చాలామంది రైతులు ప్రతి పంటకూ విత్తనాన్ని కొనుగోలు చేస్తుంటారు. సూటి రకాల సాగుకు- రైతులు తమ సొంత విత్తనాన్ని ఉపయోగించటం ప్రయోజనకరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటల్లో రైతు విత్తన తయారీ వివరాలను పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ డి.పద్మజ వివరించారు.

- న్యూస్‌టుడే, జగిత్యాల (వ్యవసాయం)


పెసర, మినుము

ఈ పంటల్లో విత్తనోత్పత్తి చేసే పొలంలో.. అంతకు ముందు, అదే పంటకు సంబంధించి వేరే వంగడాన్ని సాగుచేసి ఉండకూడదు. పొలంలో గింజలు రాలి తదుపరి పంటల్లో మొలకెత్తుతాయి కాబట్టి ఒకే రకమైన వంగడాన్ని వేస్తే కల్తీకి అవకాశం ఉండదు. పరపరాగ సంపర్కం వల్ల కల్తీలు కాకుండా ఉండేందుకు.. పెసర, మినుము వంగడాల మధ్య కనీసం 5 మీటర్ల దూరం ఉండాలి లేదా పంట అంచు నుంచి 5 మీటర్లు వదిలి, లోపలి వైపు విత్తనాలను సేకరించాలి. పైరు పూత దశలో ఒకసారి, గింజ వృద్ధిచెందే దశలో మరోసారి బెరుకులను గుర్తించి ఏరేయాలి. పైరు కోసేటప్పుడు, నూర్పిడి, నిల్వ, విక్రయ సమయంలో ఇతర రకాల విత్తనాలతో కలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గింజల్లో 13 శాతం తేమ తగ్గేవరకు ఆరబెట్టి నిల్వ చేయాలి.


వరి

వరిని అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నందున, ఈ పంటలో విత్తనోత్పత్తికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఇతర పంటల్లోనూ విత్తన లభ్యత సవాలుగా మారుతున్నందున రైతులు తమ విత్తనాన్ని తామే తయారు చేసుకోవచ్చు. వరి స్వపరాగ సంపర్క మొక్క కాబట్టి ధ్రువీకరించిన విత్తనాలను తీసుకుని విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. రైతు విత్తనంగా తమ అవసరాలు తీర్చుకోవటంతో పాటు ఇతర సంస్థలు, తోటి రైతులకు కూడా ఈ విత్తనాలను విక్రయించవచ్చు. విత్తనాల్లో జన్యు స్వచ్ఛతను కాపాడుకుంటూ.. సూటిరకం వరి విత్తనాలను చాలా పంటల వరకు వాడుకోవచ్చు. అంతకు ముందు అదేరకం విత్తనాలను వేసిన పొలంలోనే విత్తనోత్పత్తి చేపట్టాలి. వేరే పొలం చుట్టూ కనీసం 3 మీటర్ల దూరం ఉండాలి. పొలాలు ఆనుకుని ఉన్నప్పుడు కొంతదూరం వదిలిన తరువాత లోపలి మడుల నుంచి విత్తన గింజలను పొందవచ్చు. పైరు దుబ్బుచేసే సమయంలో రకాల ఎత్తు, ఆకుల రంగు, దుబ్బుచేసే గుణం తదితర భౌతిక లక్షణాలను బట్టి తేడాగా కనిపించిన బెరుకు కర్రలను వేర్లతో సహా పూర్తిగా తీసివేయాలి. తదుపరి పూత దశలో మడుల్లో తిరుగుతూ ముందుగా పూతకు వచ్చినవి, ఆలస్యంగా పూతకు వచ్చేవి, పోటాకు అమరికలో వ్యత్యాసాలున్న మొక్కలను పూర్తిగా తీసివేయాలి. పైరులో గింజ గట్టిపడే దశలో వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం తదితర లక్షణాల్లో తేడాలున్నవాటిని గుర్తించి తీసేయాలి. ఇటీవల పంటకోత యంత్రాలతో (హార్వెస్టర్లు) పొలాలు కోస్తున్నందున నూర్పిడి సమయంలో యాంత్రిక కల్తీ జరగకుండా చూడాలి. విత్తన పంటను కూలీలతో కోయించి, విడిగా నూర్పిడి చేసుకోవటమే అత్యుత్తమం. విత్తన గింజల్లో తేమ 13 శాతం వరకు తగ్గేలా ఆరబెట్టి కొత్త సంచుల్లో నిల్వచేయాలి.


నువ్వులు

నువ్వు సాగు విస్తీర్ణం ఇటీవల గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఈ పంటలో మేలైన విత్తనానికి తీవ్ర కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు.. వ్యవసాయ పరిశోధన స్థానాలు, సంస్థల నుంచి నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి, రైతులు తామే విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. సొంత విత్తనాలతో ఖర్చు తగ్గుతుంది. నమ్మకమైన పంట చేతికి వస్తుంది. కల్తీలు, మోసాల సమస్య ఉండదు. నువ్వు స్వపరాగ సంపర్క పంట అయినప్పటికీ.. 5 శాతం మొక్కల్లో పరపరాగ సంపర్కం జరిగే అవకాశముంటుంది. మూల విత్తనం, ధ్రువీకరణ విత్తనాలను సాగు చేస్తున్నప్పుడు.. ఒక రకానికి మరో రకానికి మధ్య దాదాపు 100 మీటర్ల వరకు ఎడం ఉండాలి. పూతకు ముందు, పూత దశలో, పంటకోసే ముందు కేళీలను తీసేయాలి. మొక్క ఎత్తు, పెరిగే విధానం, ఆకుల రంగు, నూగు, పూత రంగు, విత్తన పరిమాణం, గింజల రంగు తదితర లక్షణాలను బట్టి కేళీ మొక్కలను తీసేస్తే.. విత్తనాల్లో జన్యుస్వచ్ఛతను కాపాడుకోవచ్చు. చీడపీడలు ఆశించిన మొక్కలను కూడా సకాలంలో తీసేయాలి.


సోయాచిక్కుడు

దీన్ని ఖరీఫ్‌లో ఎక్కువగా పండిస్తారు. గింజలను ఎక్కువ రోజులు నిల్వచేస్తే మొలకశాతం తగ్గుతుంది. కాబట్టి ఖరీఫ్‌ విత్తనాల కోసం.. రబీ/వేసంగిలో సోయాను పలువురు రైతులు సాగుచేస్తారు. విత్తనోత్పత్తి పంటలో పైరు పూత, కాత దశల్లో నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి. పంటలో మూడు దశల్లో కల్తీలను ఏరేయాలి. మొలకదశ, పూత దశ, గింజ వృద్ధిచెందే దశల్లో పైరును పరిశీలించి కల్తీలను ఏరేయాలి. పంట పక్వానికి వచ్చిన తరువాతే మొక్కలను భూమికి సమాంతరంగా కోసి ఒకటి, రెండు రోజులు ఆరనిచ్చిన తరువాత నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ తగ్గేవరకు ఆరబెట్టి నిల్వచేసి, తదుపరి పంటకు విత్తనంగా వాడుకోవచ్చు.
రైతు సంఘాలు, గ్రామ, రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేసేటప్పుడు.. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలను పాటించాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.