close
పాడి పశువుల్లో.. పొదుగువాపు వ్యాధి

 న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

అధిక పాల దిగుబడులనిచ్చే పశువుల్లో పొదుగువాపు వ్యాధి సాధారణంగా వస్తుంది. పొదుగులోకి సూక్ష్మజీవులు ప్రవేశించడం వల్ల పొదుగువాపు వస్తుంది. ముఖ్యంగా సంకరజాతి ఆవుల్లో, అధిక పాల దిగుబడినిచ్చే గేదెల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పశువు ఈనిన రెండు నెలల్లో ఇది కనిపిస్తుంది. ఫలితంగా పాల దిగుబడి తగ్గిపోతుంది. సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే, దీర్ఘకాలిక వ్యాధిగా మారి పొదుగు పూర్తిగా పాడవుతుంది. దీంతో పశుపోషకులు ఆర్థికంగా చాలా నష్టపోతారు. పొదుగు వాపును గుర్తించిన వెంటనే పాడి రైతులు స్పందించి వైద్యం చేయించాలని కడప పశువైద్యాధికారి డాక్టర్‌ గానుగుపెంట రాంబాబు (చరవాణి: 96184 99184) సూచించారు.  
మూడు దశల్లో వ్యాప్తి
ఈ వ్యాధి మూడు దశలుగా వ్యాప్తి చెందుతుంది. తొలుత వ్యాధి లక్షణాలు అంతగా కనిపించవు. దీన్ని ‘సబ్‌ క్లినికల్‌’ దశ అంటారు. వ్యాధి లక్షణాలు కనిపించే దశను ‘క్లినికల్‌’ అంటారు. తదుపరి దశలో వ్యాధి ‘దీర్ఘకాలికం (క్రానిక్‌)’ అవుతుంది. ఈ మూడు దశల్లో తొలిదశ ప్రమాదకరమైంది. ఈ దశలోనే వ్యాధిని గుర్తించి, చికిత్స మొదలుపెట్టాలి. రెండో దశలో వ్యాధి నిర్ధరణ, చికిత్స వల్ల కొంత మేర ప్రయోజనం ఉంటుంది. ఈ దశలో పాలు విరుగుతాయి. పాలలో తెల్లటి ముక్కలు కనిపిస్తాయి. పాలు నీరులా మారుతాయి. పొదుగుల్లో వాపు, నొప్పి ఉంటుంది. మూడో దశలో పొదుగు గట్టిగా, రాయిలా మారుతుంది. ఈ దశలో చికిత్స చేయడం చాలా కష్టం.
సులువైన పరీక్ష
ఈ వ్యాధిని మొదటి దశలో గుర్తించేందుకు ఒక సులువైన పద్ధతి ఉంది. దీన్ని రైతులే చేయవచ్చు. ముందుగా సర్ఫ్‌ పొడి 5-6 చెంచాలు తీసుకొని అర లీటరు నీటిలో కలపాలి. ఈ నీటిని ఒక ప్లాస్టిక్‌ సీసాలో పోసి నీడ ప్రదేశంలో 3 నెలల వరకు నిల్వ చేయవచ్చు. పాడి పశువు నాలుగు చనుకట్ల నుంచి పాలను విడివిడిగా సేకరించాలి. ఒక చిన్న ప్లాస్టిక్‌ గ్లాసులో 10 మి.లీ. పాలకు, 10 మి.లీ. సర్ఫ్‌ నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని 10 సెకన్ల పాటు నెమ్మదిగా కలపాలి. పొదుగువాపు వ్యాధి ఉంటే.. ఈ మిశ్రమం ముద్దలా మారుతుంది. వ్యాధి లేకుంటే.. ద్రావణంలో ఏ మార్పు రాదు. ఈ పరీక్షను పాడి పశువులకు కనీసం వారానికోసారి చేస్తుండాలి.
పశువుల పాకలో..
పాకలను ఎత్తయిన, నీరు నిల్వని ప్రదేశంలో నిర్మించాలి. నేలపై రబ్బరు షీట్లను వేయాలి. దోమలు, ఈగలు రాకుండా క్రిమి సంహారక మందులను పిచికారి చేయాలి. నేల పొడిగా ఉంటే పాలు తీసే ముందు కొద్దిగా నీరు చల్లాలి.  
పాలు తీసే వ్యక్తి: అంటు వ్యాధులు, చర్మ వ్యాధులతో బాధపడేవారు పాలు పితకొద్దు. చేతి గోర్లను పెంచకూడదు. చేతులు శుభ్రంగా కడిగి, పాలు తీయాలి. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకొని మరో పశువు పాలు తీయాలి. లేదంటే మొదటి పశువుకుండే అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపిస్తాయి.

వ్యాధి నివారణ
* కొట్టాలను పొడిగా, పరిశుభ్రంగా ఉంచాలి. పాలు పితికే ముందు పొదుగును గోరు వెచ్చని నీటితో కడిగి, శుభ్రమైన గుడ్డతో తుడవాలి. పాలు పితికే వ్యక్తి చేతికి గోళ్లు పెరగనివ్వకూడదు. పొదుగులో పాలు మిగలకుండా పూర్తిగా పిండాలి.  
* గర్భకోశ వ్యాధిపీడిత పశువులు, ఈనిన పశువుల మానం నుంచి కారే స్రావాలు పొదుగుకు తగలకుండా శుభ్రపరచాలి.  
* పాలు పితికిన తర్వాత పొదుగును యాంటిసెప్టిక్‌ లోషన్‌తో కడగాలి. వ్యాధి అనుమానిత పశువుల పాలను చివర్లో పితకాలి. పాలు పితికిన తర్వాత, పితికిన వ్యక్తి చేతులను కూడా యాంటిసెప్టిక్‌ లోషన్‌తో శుభ్రం చేసుకోవాలి.
* పొదుగు వాపు వ్యాధికి గురై వట్టిపోయిన పశువులకు.. పశువైద్యుల సూచనపై ‘డ్రై తెరపి’ చేయించాలి. ఇందులో పశువుల పొదుగులోకి దీర్ఘకాలం పనిచేసే యాంటీబయోటిక్‌లను ప్రవేశపెడతారు.  
* అంటువ్యాధులతో బాధపడే పశువులను మంద నుంచి వేరు చేసి చికిత్సను అందించాలి.  
* డొక్కలకు పొదుగుకు మధ్య ఉండే వెంట్రుకలను పొడవు పెరగకుండా కత్తిరించాలి.
* పాలు తీసిన తర్వాత పొదుగును యాంటీసెప్టిక్‌ ద్రావణం (ఉదా: కోర్సలిస్‌ ద్రావణం లీటరు నీటికి 2 మి.లీ. కలపాలి)తో కడగాలి. చేతులను కూడా కడగాలి.  
* పాలు పితికిన అరగంట వరకు పశువును నేలపై పడుకోనివ్వరాదు. ఈ సమయం వరకు చను రంధ్రాలు తెరుచుకునే ఉంటాయి. ఒకవేళ పశువు పడుకుంటే.. ఆ రంధ్రాల నుంచి నేలపై ఉన్న బ్యాక్టీరియా పొదుగులోకి చేరి పొదుగు వాపు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. పశువులకు ఆ సమయంలో గ్రాసం లేదా దాణా పెట్టాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.