close
పెసరలో ప్రస్తుత చర్యలు

వైరా కేవీకే శాస్త్రవేత్తల సూచనలు
న్యూస్‌టుడే, ఖమ్మం (వ్యవసాయం)

పెసర ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. ఈ సమయంలో పంటను ఆశించే ప్రధాన చీడపీడలు వాటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జే.హేమంత్‌కుమార్‌, శాస్త్రవేత్తలు డాక్టర్‌ పి.శ్రీరంజిత, డాక్టర్‌ కె.రవికుమార్‌ తెలిపారు.
పొగాకు లద్దె పురుగు
ఈ పురుగు ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తిని, ఆకులకు రంధ్రాలు చేస్తుంది. దీంతో ఆకులు జల్లెడలా మారతాయి. ఇది ఆకులతోపాటు పువ్వులను, పిందెలను కూడా తింటుంది. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ, పగలు మొక్కల మొదళ్ల వద్ద, భూమి నెర్రెల్లో చేరి పంటను ఆశించి నాశనం చేస్తాయి. నివారణకు.. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా నొవాల్యురాన్‌ 1 మి.లీ. లేదా థయోడికార్బ్‌         1 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
మారుకా మచ్చల పురుగు
ఈ పురుగు మొగ్గ, పూత దశలో ఆశించి ఎక్కువ నష్టం కలిగిస్తుంది. పూత దశలో పూలను, కాత దశలో కాయలను దగ్గరకు చేర్చి గూడులా చేసి, పూత భాగాలను, గింజలను తినటం వల్ల పంటకు ఎక్కువ నష్టం జరుగుతుంది. నివారణకు.. పురుగు ఉధృతంగా ఉంటే.. 10 లీటర్ల నీటికి స్పైనోశాడ్‌ 3 మి.లీ. లేదా ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ 4 గ్రా. లేదా ఫ్లూబెండమైడ్‌ 2 మి.లీ లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 3 మి.లీ. వీటిలో ఏదో ఒక మందు కలిపి పైరుపై పిచికారీ చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.
పల్లాకు తెగులు
ఇది వైరస్‌ తెగులు. తెల్లదోమల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. ఈ తెగులాశించిన ఆకులపై లేత పసుపు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత నిండు పసుపు రంగుకు మారతాయి. ఆ తర్వాత కాయలపై కూడా మచ్చలు ఏర్పడతాయి. ఫలితంగా గింజ కట్టదు. తెగులాశించిన మొక్కలు ఆలస్యంగా మొగ్గ తొడిగి పూత, కాత తగ్గిపోతుంది. నివారణకు.. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి కాల్చేయాలి. తెల్లదోమ నివారణకు.. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ట్రైజోఫాస్‌ 1.5 మి.లీ. లేదా 10 లీటర్ల నీటికి ఎసిటామిప్రిడ్‌ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 3 మి.లీ. వీటిలో ఏదో ఒక మందు కలిపి పిచికారీ చేయాలి.
ఆకుముడత (మొవ్వుకుళ్లు) తెగులు
ఇది వైరస్‌ తెగులు. తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. ఈ తెగులాశించిన మొక్కల అంచులు వెనుకకు ముడుచుకుని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకు అడుగు భాగంలోని ఈనెలు రక్తపు రంగులోకి మారుతాయి. ఈ తెగులు లేత దశలో ఉన్న మొక్కలకు వ్యాపిస్తే.. తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చేయడం ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. నివారణకు.. లీటరు నీటికి ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ., లేదా ఫిప్రోనిల్‌ 1.5 మి.లీ. చొప్పున ఏదో ఒక మందు కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.