close
వరిలో చీడలు!

న్యూస్‌టుడే, నిడదవోలు

వరిలో ప్రస్తుతం ఆకుముడతతో పాటు దోమ వ్యాపించి నష్టం కలిగిస్తోంది. వీటి నివారణ చర్యలను నిడదవోలు మండల వ్యవసాయాధికారి జి.సత్యనారాయణ (చరవాణి : 88866 12964) సూచించారు.
ఆకుముడత
దీనిని ఆకుచుట్టు లేదా నాము లేదా తెల్లతెగులు అని పిలుస్తారు. తొలిదశ గొంగళి పురుగులు ఆకుల అంచులను కలిపి గొట్టంలా చేసి లోపల ఉండి ఆకుపచ్చని పదార్థాన్ని గోకి తింటాయి. దీంతో ఆకులు తెల్లగా మారి ఎండినట్లు కనిపిస్తాయి. ఈ పురుగు వరి పంటను మూడు దశల్లో ఆశించి నష్టపరుస్తుంది. తొలి దశలోనే వీటిని అరికడితే మేలు. వర్షాభావం, బెట్ట పరిస్థితులు, పైరుపై నీడ పడటం వంటివి ఈ పురుగు ఉధృతికి దోహదపడతాయి. ఆలస్యంగా ఊడ్చే పొలాల్లో, నత్రజని ఎక్కువగా వాడిన పొలాల్లో ఈ పురుగు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.

నివారణకు..:

* పైరుపై తాడును లాగితే.. గొంగళి పురుగులు నీటిలో పడి చనిపోతాయి.
* ట్రైకోగ్రామ ఖిలోనిస్‌ గుడ్డు పరాన్నజీవులను ఎకరాకు 20 వేలు చొప్పున మూడుసార్లు వదిలితే.. గుడ్డు దశలోనే పురుగులు నశిస్తాయి.
* లీటరు నీటికి ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 2 గ్రా. లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి లేదా కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌ 4జి గుళికలు ఎకరానికి 8 కిలోలు వేయాలి.
సుడిదోమలు

దీన్నే సుడి తెగులు అంటారు. ఈ దోమకు రెక్కలు ఉండవు. అందువల్ల ఎగరలేదు. 25-30 సెం.గ్రే. ఉష్ణోగ్రతలో బాగా వృద్ధి చెందుతుంది. గోధుమ రంగులో ఉండే తల్లి, పిల్ల పురుగులు వరి దుబ్బుల మొదళ్లపై ఉండి, మొక్క నుంచి రసాన్ని పీలుస్తాయి. దీంతో మొక్కలకు పోషకాలు అందవు. క్రమంగా మొక్కలు పచ్చదనాన్ని కోల్పోయి, సుడులు సుడులుగా ఎండిపోతాయి. పొలంలో అక్కడక్కడా సుడులలో ఆశిస్తుంది. తర్వాత దోమ ఉధృతి పెరిగి పొలమంతా వ్యాపించి పంటను నాశనం చేస్తుంది.

నివారణకు: ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలు తీయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉంటే.. పొలాన్ని 1-2 సార్లు ఆరగట్టాలి. సాలె పురుగులు, మిరిడ్‌ నల్లి వంటి మిత్ర పురుగులను సంరక్షించాలి. అంకురం ఏర్పడే దశలో కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలను ఎకరానికి 10 కిలోలు లేదా బుప్రోఫెజిన్‌ 1.6 మి.లీ. లేదా ఇథోఫెన్‌ప్రాక్స్‌ 2 మి.లీ., లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేలా పిచికారి చేయాలి. ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణం వాడాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.