close
చీడపీడలను అరికట్టే జీవ రసాయనాలు!

చీడపీడల కారణంగా రైతులు 30-35 శాతం పంట దిగుబడులను నష్టపోతున్నారని పీలేరు వ్యవసాయ అదనపు సంచాలకులు మజీద్‌ అహ్మద్‌ (సెల్‌ : 88866 12511) తెలిపారు. వీటి నివారణకు రైతులు ఎక్కువగా రసాయన మందులనే వాడుతున్నారు. స్వల్పకాలంలో ఈ మందులు ఫలితాన్నిచ్చినా.. దీర్ఘకాలంలో పురుగులు ఈ మందులకు లొంగడం లేదు. ఫలితంగా పర్యావరణ కాలుష్యంతోపాటు, దిగుబడుల నాణ్యత క్షీణిస్తోంది. ఈ సమస్యకు మేలైన ప్రత్యామ్నాయంగా జీవనియంత్రణ పద్ధతులను ఆచరించవచ్చు. వాటి వివరాలు..

- న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ (చిత్తూరు జిల్లా)

వైరస్‌ ఆధారితంగా పనిచేసేవి..

మనుషుల్లో మాదిరే పురుగులకూ వైరస్‌ వ్యాధులను కలిగిస్తుంది. ఎన్‌పీవీ (న్యూక్లియర్‌ పాలి హైడ్రోసిల్‌ వైరస్‌), సీవి (సైబో ప్లాస్మిక్‌ వైరస్‌), జీవీ (గ్రాన్యులోసిస్‌ వైరస్‌) వీటిలో ప్రధానమైనవి.


ఎన్‌పీవీ వైరస్‌ ద్రావకం

దీన్ని పంలపై పిచికారీ చేసి, చీడపురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. పత్తిలో శనగపచ్చ పురుగు, పొగాకులో లద్దెపురుగుల నివారణకు.. ఈ ద్రావకాన్ని 100 ఎల్‌ఈ (లార్వల్‌ ఇక్వివాలెంట్‌) మోతాదులో లీటరు నీటికి ఒక మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఆముదంలో నామాల పురుగు, వేరుసెనగలో ఎర్రగొంగళి పురుగు, ఇతర పంటల్లో శనగపచ్చ పురుగు నివారణకు.. ఈ ద్రావకాన్ని ఎకరాకు 200 ఎల్‌ఈ మోతాదులో పిచికారీ చేయాలి.


బ్యాక్టీరియా ఆధారిత జీవ రసాయనాలు

ఇవి పొడి, ద్రవ రూపంలో లభిస్తాయి. వీటిని ‘బీటీ’ మందులు అంటారు. వీటిలోని బ్యాక్టీరియా శనగపచ్చ పురుగు, పొగాకులద్దె పురుగు, నామాల పురుగుల లార్వాలను ఆశించి రోగగ్రస్తం చేస్తుంది. తద్వారా అవి నశిస్తాయి. ఇవి మార్కెట్లో.. డైపెల్‌, డెల్ఫిన్‌, బయోబిట్‌, బయోఆస్ప్‌, అగ్రీహాల్ట్‌ పేర్లతో లభిస్తున్నాయి. లీటరు నీటికి ఒక గ్రాము లేదా మి.లీ. మందు కలిపి పైరుపై పిచికారీ చేయాలి.


కీటకనాశని శిలీంధ్రాలు

బవేరియా బాసియానా, మెటారైజియం ఎనైసోప్లి, వర్టిసిల్లియం లెకాని.. అనే మూడు రకాల శిలీంద్రాలు మార్కెట్లో వివిధ పేర్లతో పొడి రూపంలో లభిస్తున్నాయి. వీటిని పైర్లపై పిచికారీ చేసినప్పుడు.. చీడ పురుగులను ఆశించి బూజులా ఏర్పడి నిర్వీర్యం చేస్తాయి. లీటరు నీటికి 5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. బవేరియా బాసియానా అకులను తినే (వరిలో సుడిదోమ, అకుముడత పురుగు, మిర్చిలో శనగపచ్చ పురుగు, పొగాకులో లద్దెపురుగు) పురుగుల నివారణకు, మెటారైజియం ఎనైసోప్లి నేలలో ఉండే వేరు పురుగుల అదుపునకు, వర్టిసిల్లియం లెకాని రసంపీల్చే పురుగులను (ఉదా: ద్రాక్ష, మామిడిలో పిండి పురుగుల నివారణకు) అరికట్టేందుకు వినియోగిస్తారు. ఇవి మార్కెట్లో భీమ, బిబిసి, విశ్వ, అభయ్‌, వర్టికేర్‌, స్పైడర్‌, రేనర్‌ వంటి పేర్లతో దొరుకుతాయి.


కీటకనాశక నులి పురుగులు (నెమటోడ్స్‌)

హెటిరోరాబ్టైటిస్‌, స్టీనర్‌నీమా ప్రజాతికి చెందిన నులి పురుగులు చీడపురుగులను అరికడతాయి.
వాడకంలో జాగ్రత్తలు : ఉత్పత్తిలో నాణ్యతాపరంగా, పర్యావరణ పరంగా రసాయనిక పురుగుల మందు కంటే శ్రేష్టమైనప్పటికీ, వీటికి నిల్వ ఉండే సామర్థ్యం తక్కువ. ఒక్క వైరస్‌ ద్రావకం తప్పా మిగిలిన జీవరసాయనాలన్నీ కనిష్ఠంగా ఆరు నెలల నుంచి గరిష్ఠంగా ఏడాది కంటే ఎక్కువ నిల్వ ఉండవు. కొనేటప్పుడు నిల్వ తేదీలను గమనించాలి. జీవరసాయనాలను మందుల చట్టంలోకి తెచ్చారు. నకిలీలపై వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.


తెగుళ్లను నివారించేవి..

* పంటల్లో తెగుళ్ల నివారణకు ట్రైకోడర్మా జాతికి చెందిన శిలీంధ్రాలు, సూడోమోనాస్‌ ఫ్లోరెసెన్స్‌ అనే బ్యాక్టీరియా అందుబాటులో ఉన్నాయి.  
* ట్రైకోడర్మాను.. కంది, పత్తి, వేరుసెనగ, అపరాలు, శనగలో ఎండుతెగులు అదుపునకు, చీనీ, బత్తాయి తోటల్లో వేరుకుళ్లు నివారణకు వాడతారు. పొగాకు, మిరప, టమాటలో నారుకుళ్లు నివారణకు వినియోగిస్తారు.  
* ట్రైకోడర్మాను సేంద్రియ ఎరువులో కలిపి మగ్గబెట్టి వాడాలి. 90 కిలోల బాగా మాగిన పశువుల ఎరువుకు 10 కిలోల వేపపిండి + కిలో ట్రైకోడర్మా పొడి కలపాలి. ఈ ఎరువుపై గోనెసంచులు కప్పి నీడలో ఉంచాలి. తేమ ఉండేలా రోజు నీరు చిలకరిస్తుండాలి. 15 రోజులపాటు వృద్ధి చేసిన ఈ మిశ్రమాన్ని ఎకరా చేలో వెదజల్లాలి. తెగుళ్లు ఆశించడానికి కనీసం 15 రోజుల ముందు జీవశిలీంధ్రనాశనిని నేలలో వేయాలి.
* 4-5 కిలోల ట్రైకోడర్మాను వంద కిలోల పశువుల ఎరువులో కలిపి వృద్ధి చేసి, దుక్కి దున్నేటప్పుడు నాగలి సాలులో వేయాలి. ఇది నేలలో ఉండి పంటలకు హానిచేసే శిలీంధ్రాలను అరికడుతుంది. ఫలితంగా పైర్లపై తెగుళ్ల బెడద తగ్గుతుంది.  
* విత్తేముందు కిలో విత్తనానికి 8-10 గ్రా. ట్రైకోడర్మా కలిపి విత్తనశుద్ధి చేసి విత్తితే.. పైర్లకు తెగుళ్ల నుంచి రక్షణ లభిస్తుంది.  
* వరిలో అగ్గితెగులు, కాండంకుళ్లు తెగుళ్ల నివారణకు.. ‘సూడోమోనాస్‌ ఫ్లోరెసెన్స్‌’ అనే బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాన్ని లీటరు నీటికి 5 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.