close
టమాటలో సస్యరక్షణ

టమాటలో చీడపీడల నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను ఖమ్మంజిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు డాక్టర్‌ వి.చైతన్య, డాక్టర్‌ జే.హేమంత్‌కుమార్‌, డాక్టర్‌ కె.రవికుమార్‌ తెలిపారు.

- న్యూస్‌టుడే, ఖమ్మం (వ్యవసాయం)


పాముపొడ/ఆకుమచ్చ తెగులు

పిల్ల పురుగులు ఆకులపై సొరంగాలు చేసి, పత్రహరితాన్ని గీకడం వల్ల ఆకులపై చారలు (పాముపొడ) వంటి మచ్చలు ఏర్పడతాయి. నివారణకు... పసుపురంగు డబ్బాలకు ఆముదం లేదా గ్రీజు పూసిన ఎరలను పొలంలో అక్కడక్కడ ఉంచి, ఈ పురుగు ఉధృతిని గమనించవచ్చు.
* లీటరు నీటికి 50 మి.లీ. (5 శాతం) చొప్పున వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి లీటరు నీటికి ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.


కాయతొలిచే శనగపచ్చ పురుగు

ఈ పురుగు టమాటను అధికంగా ఆశిస్తుంది. వీటి పిల్ల పురుగులు లేతాకులను తింటాయి. పెద్ద లార్వాలు పూత, కాయలను తింటాయి. ఇవి కాయలకు రంధ్రాలు చేసి తలను లోపలికి ఉంచి, మిగతా శరీరాన్ని బయటే ఉంచి కాయ లోపలి గుజ్జును తింటాయి. కాయలపై కనిపించే గుండ్రటి రంధ్రాలను బట్టి ఈ పురుగు ఉనికిని గుర్తించాలి. 


నివారణకు....

* ఎర పంటగా బంతిని.. ప్రతి 16 వరుసల టమాటకు రెండు వరుసలు చొప్పున నాటాలి.
* 40 రోజుల వయసున్న బంతినారు, 25 రోజుల టమాట నారును ఒకేసారి నాటితే.. రెండు పంటలు ఒకేసారి పుష్పిస్తాయి. శనగపచ్చ పురుగుల తల్లి పుôుగులు బంతి పూలకు ఆకర్షితమై, వాటిపైనే గుడ్లు పెడతాయి. బంతిపై ఈ పురుగుల గుడ్లను లేదా లార్వాల ఉనికిని గమనిస్తే.. వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
* ఎదిగిన లార్వాలను, పురుగాశించిన కాయలను ఎప్పటికప్పుడు గమనించి నాశనం చేయాలి.
* పొలంలో లింగాకర్షక బుట్టలను ఎకరానికి నాలుగు చొప్పున పెట్టాలి.
* ఈ పురుగులను తినే పక్షులను ఆకర్షించేందుకు ఆంగ్ల ‘టి’ ఆకారపు పంగల కర్రలను ఎకరాకు 15-20 వరకు ఏర్పాటు చేయాలి.
* పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే.. 10 లీటర్ల నీటికి థయోడికార్బ్‌ 10 గ్రా. లేదా స్పైనోశాడ్‌ 3 మి.లీ లేదా ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ 4 గ్రా. లేదా ఫ్లూబెండమైడ్‌ 3 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.


పొగాకు లద్దెపురుగు

వీటి పిల్ల పురుగులు ఆకులను గీకి తిని జల్లెడలా మారుస్తాయి. ఎదిగిన దశలో.. ఆకులను పూర్తిగా తొలిచి మొక్కలను మోడులా చేస్తాయి. కాయలకు రంధ్రాలు చేసి నష్టం కలిగిస్తాయి. నివారణకు..
* ఎర పంటగా ఆముదం మొక్కలను పొలంలో అక్కడక్కడ విత్తాలి. పురుగు గుడ్లు, లార్వాలు, జల్లెడాకులను సేకరించి నాశనం చేయాలి.
* లింగాకర్షక బుట్టలను ఎకరాకు నాలుగు చొప్పున చేలో అమర్చి, ఎప్పటికప్పుడు  పురుగు ఉధృతిని గమనించాలి.
* ఎదిగిన లార్వాలను విషపు ఎరలను పెట్టి నివారించాలి. ఇందుకోసం.. 5 కిలోల తవుడు + 500 గ్రా. బెల్లం + 250 గ్రా., థయోడికార్బ్‌ + లీటరు నీరు కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి పొలంలో మొక్కల మొదళ్ల దగ్గర చల్లాలి.
* అవసరాన్ని బట్టి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే.. 10 లీటర్ల నీటికి నోవాల్యురాన్‌ 15 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్‌ 3 మి.లీ. లేదా క్లోరాంత్రనిలిప్రోల్‌ 3 మి.లీ., కలిపి మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.


రసం పీల్చే పురుగులు

తెల్లదోమ : ఇవి రసం పీల్చటం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. ఆకుముడతకు కారణమయ్యే వైరస్‌ తెగులును వ్యాప్తి చేస్తాయి.
పచ్చదోమ : వీటి పిల్ల, పెద్ద పురుగులు ఆకుల అడుగు నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు వడలి ఎండిపోతాయి. నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్‌ లేదా మెటాసిస్టాక్స్‌ లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
తామర పురుగులు : ఇవి రసం పీల్చటంవల్ల ఆకులు ముడుచుకుని ఎండిపోతాయి. ఇవి టమాటలో ‘మచ్చల ఎండు తెగులు’ (వైరస్‌ వ్యాధి)ను వ్యాప్తి చేస్తాయి. ఫలితంగా ఆకులు, కాండంపై మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఎండలో మెరుస్తాయి. నివారణకు.. లీటరు నీటికి.. వేపనూనె (10 వేలు పీపీఎం మోతాదు) 3 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ. ఎసిఫేట్‌ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
ఎర్ర నల్లి : వాతావరణం వేడిగా, పొడిగా ఉన్నప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు గూళ్లు కట్టుకుని రసాన్ని పీల్చి నష్టం కలిగిస్తాయి. నివారణకు... లీటరు నీటికి- నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రా. లేదా స్పైరోమెసిఫిన్‌ 1.25 గ్రా. లేదా ఫెన్‌పైరాక్సియేట్‌ 1 మి.లీ. చొప్పున మందులను మార్చి మార్చి పిచికారీ చేయాలి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.