మ‌రిన్నీ స్థిరాస్తి వివ‌రాల‌కు..

భూముల ధరలు పెరిగినా.. తగ్గని దూకుడు

భూములు, స్థలాల ధరలు ఏడాదికి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెట్టింపయ్యాయి. మార్కెట్‌ వర్గాలు సైతం ఊహించని విధంగా పెరిగాయి. అయినా అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే భారీగా వృద్ధి నమోదవడం చూస్తుంటే మార్కెట్‌ ఎక్కడా ఆగేలా సంకేతాలు కనబడటం లేదు. పెట్టుబడి కోసం స్థలాలు, సొంతింటి కోసం ఇల్లు తీసుకునేవారు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లో తీసుకోవడం మేలని.. కొత్తగా ప్రారంభించే వాటిలో ధరలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

స్థిరాస్తి మార్కెట్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, యాదాద్రి చుట్టుపక్కలనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికాలంగా దూకుడు కనబడింది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం, వరసగా ఐదో ఏడాది మెర్సర్‌ సంస్థ రేటింగ్‌లో నగరానికి దేశంలోనే మొదటి స్థానం దక్కడంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్నారు. ఐటీ, ఐటీ ఆధారిత, ఇతర పరిశ్రమలు రాజధాని నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఏర్పాటుకు చర్యలు చేపట్టడం, ఇప్పటికే పలు పరిశ్రమలు వేలకోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధిపై అంచనాలతో అక్కడ స్థిరాస్తి వ్యాపారం కూడా జోరందుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన మొదలు ఆయా జిల్లాల్లో కొత్తగా చేపడుతున్న ప్రాజెక్ట్‌లు రియల్‌రంగానికి ఊతమిస్తున్నాయి. పాతికశాతం పైగా పెరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఇందుకు నిదర్శనం. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.5177 కోట్ల నుంచి రూ.6612.75 కోట్లకు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో మార్చిలోనే 12 శాతం నమోదవడం మార్కెట్‌ సెంటిమెంట్‌కు బలం చేకూరుస్తోంది.
నలువైపులా..
రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ అవుటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ నిర్మాణాలు పెరిగాయి. ఓఆర్‌ఆర్‌ బయట స్థలాల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఔషధ నగరి, ప్రాంతీయ వలయ రహదారి ప్రణాళికలు మార్కెట్‌ను సానుకూల దిశగా తీసుకెళుతున్నాయని స్థిరాస్తి వర్గాలు చెబుతున్నాయి. నగరంలోనూ నిర్మాణాల పరంగా వేగం పెరగింది. దక్షిణం వైపు వృద్ధి నమోదు చేసింది. బుద్వేల్‌ ప్రాంతంలో ఐటీ టవర్లు వస్తాయని ప్రకటించడంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. అయినా జోరు ఆగలేదు. ఇందుకు తగ్గట్టుగానే డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తున్నారు.
హైదరాబాద్‌ పశ్చిమం ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్టులో ఇటీవల పలు సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. కొత్తగా వచ్చేవారు ఇక్కడే కావాలంటున్నారు. ఐటీ సంస్థలన్నీ ఇక్కడ కేంద్రీకృతం అయి ఉండటంతో పెద్ద సంస్థలు తమ ప్రీమియం ప్రాజెక్ట్‌లను ఇక్కడే చేపట్టాయి. ఇప్పటికీ ఇక్కడ చేపట్టే ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ అధికంగా ఉంది. ప్రకటించేదే ఆలస్యం హాట్‌ కేకుల్లా బుకింగ్‌ అవుతున్నాయి. హైటెక్‌సిటీ వరకు మెట్రో రావడంతో చుట్టు పక్కల దూరంగానైనా కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.
ఎల్‌బీనగర్‌ వైపు మౌలిక ప్రాజెక్ట్‌లు ప్రకటించాలని నిర్మాణ రంగం కోరుతోంది. ఈ చుట్టుపక్కల పెద్ద ప్రాజెక్ట్‌లేవీ లేకపోవడం కొంత లోటుగా ఉంది. అయినా వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం, స్థలాల కొనుగోళ్లలో ఎక్కడా వెనుకబడలేదు.
సంగారెడ్డిలో చాలా ప్రాంతాలు నగరంలో భాగమే. ఇక్కడ లేఅవుట్లు భారీగా వెలిశాయి. జాతీయ రహదారి, ఐటీ కారిడార్‌కు చేరువ, ఓఆర్‌ఆర్‌ అనుసంధానం, ఐఐటీ, ఇతర విద్యాసంస్థలు ఉండటంతో క్రమంగా నివాసయోగ్య ప్రాంతంగా విస్తరిస్తుంది.
లుక్‌ఈస్ట్‌ పాలసీలో ఉప్పల్‌ మార్గంలోనూ సానుకూలత ఏర్పడింది. నగరానికి ధీటుగా జిల్లాల్లోనూ రియల్‌ పరుగులు పెడుతోంది. యాదగిరిగుట్ట క్షేత్రం అభివృద్ధికి సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టడం, వరంగల్‌-హైదరాబాద్‌ను పారిశ్రామ కారిడార్‌గా చేస్తుండటంతో ఈ మార్గంలో పెద్ద ఎత్తున స్థిరాస్తి వెంచర్లు ఏర్పాటయ్యాయి. కొత్తవి భారీగా పుట్టుకొస్తున్నాయి. పెట్టుబడి దృష్ట్యా ఎక్కువ మంది ఇక్కడ కొనుగోళ్లకు ఆసక్తిచూపిస్తున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ల ఆదాయం దండిగా వచ్చింది.
నగర శివార్లలో 50 ఎకరాల విస్తీర్ణంలో మినీ నగరాలను నిర్మించేలా టౌన్‌షిప్‌ పాలసీని సర్కారు ప్రకటించింది. ఇక్కడే చుట్టుపక్కల పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్‌, వినోద కేంద్రాలు ఉండేలా చూస్తున్నారు. వీటిని చేపట్టే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది. రాబోయే రోజుల్లో బాహ్య వలయ రహదారి(ఓఆర్‌ఆర్‌) చేరువలో కొత్త ప్రాజెక్ట్‌లను పలు సంస్థలు ప్రకటించబోతున్నాయి.