* ఇటీవల కాలంలో ఐపీఓల గురించి చాలామంది మాట్లాడుకోవడం చూస్తున్నాం. కంపెనీలు తమకు కావాల్సిన మూలధన సమీకరణ కోసం మొదటిసారిగా స్టాక్ మార్కెట్లో నమోదు కావడాన్నే ఐపీఓ అంటుంటాం. దీనికోసం ఒక నిర్ణీత వ్యవధినిచ్చి, మదుపరులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తాయి. ఇక మీరు ఐపీఓకి దరఖాస్తు చేసుకోవాలంటే.. ముందుగా డీమ్యాట్ ఖాతా ప్రారంభించాల్సి ఉంటుంది. దీనికోసం స్టాక్ బ్రోకర్‌ను సంప్రదించండి. ఈ ఖాతాను ప్రారంభించిన తర్వాత, నిర్ణీత తేదీల్లో మీ నెట్ బ్యాంకింగ్ నుంచి ఆయా ఐపీఓలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది. ఒకసారి మీరు ఐపీఓకి దరఖాస్తు చేశాక, అందుకు అనుగుణంగా నిర్ణయించిన మొత్తం మీ ఖాతాలో బ్లాక్ అవుతుంది. ఐపీఓలో షేర్లు మీకు వస్తే.. ఆ మొత్తాన్ని తీసేసుకుంటారు. లేకపోతే వెంటనే మీ డబ్బు మీరు వాడుకునేందుకు వీలవుతుంది. ఐపీఓకి అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తే.. లాటరీ విధానంలో మదుపరులను ఎంపిక చేస్తారు. కాబట్టి, ఇలాంటి సందర్భాల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ షేర్ల కేటాయింపు జరగకపోవచ్చు.
* నా వయసు 33 ఏళ్లు. ఇప్పటి వరకూ యూనిట్ ఆధారిత పాలసీకి ప్రీమియం చెల్లిస్తున్నాను. దీనికి బదులుగా టర్మ్ పాలసీ తీసుకుంటే బాగుంటుందని విన్నాను. ఇటీవలే ఈ పాలసీని తీసుకున్నాను. ఇప్పటి వరకూ పన్ను మినహాయింపు కోసం యులిప్‌ను వాడుకున్నాను. ఇప్పుడు బీమా ప్రీమియం తగ్గిపోయింది. నాకున్న ప్రత్యామ్నాయాలేమిటి?
- సత్య
* మీరు టర్మ్ పాలసీ తీసుకోవడం మంచిదే. ఇక ఆదాయపు పన్ను ఆదా కోసం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్ఎస్ఎస్) ఎంచుకోవచ్చు. ఇవి దీర్ఘకాలంలో మంచి రాబడిని సంపాదించేందుకు ఉపయోగపడతాయి. స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు కనిపించవచ్చు. వాటిని పట్టించుకోనక్కర్లేదు. ఇందులో కనీసం మూడేళ్లపాటు మదుపు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరకు వచ్చాం.. కాబట్టి, మీరు అనుకుంటున్న మొత్తాన్ని ఒకేసారి మదుపు చేయండి. ఏప్రిల్ నుంచి క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయొచ్చు. ఇక ఫండ్ల విషయానికి వస్తే.. డీఎస్పీ ట్యాక్స్ సేవర్ ఫండ్, మిరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లను పరిశీలించవచ్చు.