‘రంగ్‌ దే’ కోహ్లీసేన!

తాజా వార్తలు

Updated : 27/03/2021 17:36 IST

‘రంగ్‌ దే’ కోహ్లీసేన!

హోలీ ముందు ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక వన్డే

పుణె: టీమ్‌ఇండియా 50 ఓవర్ల ఫార్మాట్లో వ్యూహాలను మార్చాల్సిన సమయం వచ్చేసింది. ప్రపంచ విజేత ఇంగ్లాండ్‌తో ఆడేటప్పుడు సంప్రదాయ పద్ధతి అచ్చిరాదని అర్థమైంది. ఆఖరి 15 కాదు తొలి 15 ఓవర్లూ విధ్వంసకరంగా ఆడాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆతిథ్య, పర్యాటక జట్లు చెరో వన్డే గెలవడంతో నిర్ణయాత్మక మూడో పోరుపై ఆసక్తి అమాంతం పెరిగిపోయింది. మరి రంగుల పండుగ వేళ కోహ్లీసేన పరుగుల వేడుక చేసేనా? సిరీస్‌ గెలిచేనా?


ఊచకోత ఆపేదెలా?

337 పరుగుల భారీ లక్ష్యం చూడగానే ఇంగ్లాండ్‌ ఓడిపోవడం ఖాయమే అనిపించింది! అదెంత అపోహో గంట సేపటికే తెలిసొచ్చింది. ఒకవైపు ఫ్లాట్‌ పిచ్‌.. మరో వైపు తేమ.. ఇంకో వైపు ఆంగ్లేయుల దూకుడు.. ఆపై సిక్సర్ల మీద సిక్సర్లు బాదుడు. అంతే! చూస్తుండగానే లక్ష్యం కరిగిపోయింది. ఇంగ్లిష్‌ జట్టు అలవోకగా విజయం సాధించింది.  సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కుల్‌దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్య బౌలింగ్‌ను బెయిర్‌ స్టో, బెన్‌స్టోక్స్‌ ఊచకోత కోస్తుంటే శుక్రవారం రవీంద్ర జడేజా ఉంటే ఎంత బాగుండో అని విరాట్‌ కోహ్లీకి అనిపించక మానదు. ఎందుకంటే ఛేదనలో ఇంగ్లాండ్‌ ఏకంగా 20 సిక్సర్లు బాదేసింది. మరో 39 బంతులు మిగిలుండగానే పని ముగించింది.


మార్పులు ఖాయం

మూడో వన్డేలో టీమ్‌ఇండియా బౌలింగ్‌ విభాగంలో మార్పులు ఖాయం. మొదటి వన్డేలో 64 , రెండో వన్డేలో 84 పరుగులు, 8 సిక్సర్లు ఇచ్చిన కుల్‌దీప్‌పై వేటు పడనుంది. ఫామ్‌లో లేనప్పటికీ యుజ్వేంద్ర చాహల్‌నే నమ్ముకోనుంది. ఇక 6 ఓవర్లలోనే 72 పరుగులు ఇచ్చిన కృనాల్‌దీ అదే పరిస్థితి. వికెట్లు తీయడంతో పాటు పరుగులు చేసే వాషింగ్టన్‌ సుందర్‌పై కోహ్లీ మొగ్గు చూపుతాడు. భువి, ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌ దాడి కొనసాగిస్తారు. అదనపు పేస్, బౌన్స్‌తో వికెట్లు తీస్తూ కృష్ణ ఆశలు రేపుతున్నాడు.  వైవిధ్యం కోసం శార్దూల్‌ బదులు ఎడమచేతి వాటం నటరాజన్‌ లేదా హైదరాబాదీ సిరాజ్‌ను తీసుకోవచ్చు.  పనిభారం పర్యవేక్షణ అంటూ హార్దిక్‌కు బంతినివ్వకపోవడంతో అదనపు బౌలర్ సేవలు అందడం లేదు.


కొత్త వ్యూహం తప్పదు

భారత బ్యాటింగ్‌ లైనప్‌ బాగున్నా వ్యూహం మార్చాల్సిన అవసరం వచ్చింది. ధోనీ హయాంలో మాదిరిగా ఆఖరి 15 ఓవర్లు బాదేస్తే సరిపోదని తేలిపోయింది. తొలి 15 ఓవర్లలో ఓపెనర్లు దంచికొట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ కంఫర్ట్‌ జోన్‌ వదిలేసి ఆడాలి. అదిరే ఆరంభాలు ఇవ్వాలి. వరుసగా అర్ధశతకాలు చేస్తున్న కెప్టెన్‌ కోహ్లీ నుంచి అభిమానులు శతకాలు ఆశిస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌ సూపర్‌ ఫామ్‌లోకి రావడం సంతోషకరం. రిషభ్ పంత్‌ ఆట ముగిసే వరకు క్రీజులో ఉండాలి. హార్దిక్‌ నిలకడగా చెలరేగడం జట్టుకు అవసరం. ఈ సిరీసులో ఇప్పటి వరకు టెయిలెండర్లకు అవకాశం రాలేదు. అవసరమైతే వారూ ఆఖర్లో షాట్లు బాదేందుకు సిద్ధమవ్వాలి.


జోరుమీద ఇంగ్లాండ్‌

తొలి వన్డేలో తేలిపోయిన ఇంగ్లిష్‌ మిడిలార్డర్‌ రెండో వన్డేలో తప్పులను సరిచేసుకుంది. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌ స్టో విధ్వంసకర ఫామ్‌లో ఉన్నారు. తొలి 15 ఓవర్లు దంచికొట్టి పని తేలిక చేస్తున్నారు. బెన్‌స్టోక్స్‌ ఫామ్‌లోకి రావడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మోర్గాన్‌ లేప్పటికీ లియామ్‌ లివింగ్‌స్టన్‌ ఛేదనలో రెచ్చిపోయాడు. అతడికి టీ20 నంబర్‌వన్‌ ఆటగాడు డేవిడ్‌ మలన్‌ జత కలిశాడు. పరుగులు బాకీ పడ్డ జోస్‌ బట్లర్‌ ఈసారి చెలరేగే ప్రమాదం ఉంది. ఇక బౌలింగ్‌ పరంగా ఆంగ్లేయులకు ఇబ్బందేమీ లేదు. స్పిన్‌ను పక్కన పెడితే పేస్‌ విభాగం కట్టు దిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో కోహ్లీసేనను ఇబ్బంది పెడుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని