close

తాజా వార్తలు

Updated : 07/04/2021 10:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీరు మర్చిపోలేని ఐపీఎల్‌ యుద్ధాలివి!

ప్రతి క్రికెట్‌ అభిమాని ఇప్పటివరకు ఎన్నో మ్యాచులు చూసి ఉండొచ్చు. వాటన్నింటిలో ఏం జరిగిందో గుర్తుంచుకోవడం చాలా కష్టమైన పని. కానీ కొన్ని మ్యాచులు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా సాగుతాయి. ఐపీఎల్‌లో కూడా ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచులు జరిగాయి. వీటిలో కొన్నింటి గురించి క్రికెట్‌ ప్రేమికులు ఇప్పటికీ చర్చించుకుంటారు. ఆ మ్యాచుల్లో జరిగిన మలుపులు, అద్భుతాలు ఒక రేంజ్‌లో ఉంటాయ్‌ మరి! అలాంటి టాప్ 5 మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం రండి!   

14.2 ఓవర్లకే 188‌

2014 చివరి లీగ్ మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్  20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే రాయల్స్‌ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో ఛేదించాలి. ఇది సాధ్యం కాని పక్షంలో రన్‌రేట్‌ ఎక్కువగా ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. లక్ష్యఛేదనకు దిగిన ముంబయి బ్యాట్స్‌మెన్‌.. వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడారు. ఈ క్రమంలో ముంబయి 9.2 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న అంబటి రాయుడు, కోరె అండర్సన్‌ రాజస్థాన్‌ బౌలర్లను ఊచకోత కోశారు. ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించారు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ముంబయి 14.2 ఓవర్లకు 188 పరుగులు చేసింది.

ముంబయి ప్లే  ఆఫ్స్‌కి చేరుకోవాలంటే ఒక బంతికి రెండు పరుగులు కావాలి. క్రీజులో ఉన్న రాయుడు ఈ బంతిని ఆడి ఒక పరుగు పూర్తి చేసి రెండో దాని కోసం పరుగెత్తుతూ రనౌట్‌ అయ్యాడు. దీంతో రెండు జట్ల స్కోర్ సమం అయింది. తర్వాత బంతి(14.4)ని బౌండరీకి తరలిస్తే ముంబయి ప్లే ఆఫ్స్‌కి వెళ్తుంది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన ఆదిత్య తారె.. బ్యాట్‌పైకి నేరుగా వచ్చిన బంతిని సిక్సర్‌గా మలచడంతో రోహిత్‌ సేన ప్లే ఆఫ్స్‌కి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబయి బ్యాట్స్‌మన్‌ కోరె అండర్సన్‌ 44 బంతుల్లో 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

 మంత్రించిన మనీశ్‌

2014 ఐపీఎల్‌ ఫైనల్‌. పంజాబ్‌, కోల్‌కతా జట్లు తుది సమరంలో హోరాహోరీగా తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 199/4 పరుగులు సాధించింది. పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా (115; 55 బంతుల్లో 10×4, 6×8) పరుగులతో అజేయంగా నిలవగా..  మనన్‌ వోహ్ర 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు.

లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఆ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రాబిన్‌ ఊతప్ప(5) త్వరగా ఔటయ్యాడు. మనీశ్‌ పాండే (94; 50 బంతుల్లో 4×7, 6×6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి పెవిలియన్‌ చేరాడు. మూడు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది కోల్‌కతా. చివర్లో పియూష్ చావ్లా ఓ సిక్స్‌, ఫోర్‌ బాదడంతో కోల్‌కతా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌ని ముద్దాడింది.

బిస్లా.. భళా

ఓ వైపు.. వరుసగా రెండుసార్లు (2010, 2011) విజేతగా నిలిచి మూడో టైటిల్‌పై కన్నేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌. మరో వైపు.. తొలిసారి ఫైనల్‌ చేరిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌. ఈ రెండు జట్లు 2012 ఐపీఎల్‌ తుది సమరంలో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై.. 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. మైకేల్‌ హస్సీ 54, మురళీ విజయ్‌ 42, సురేశ్‌ రైనా 73తో రెచ్చిపోయారు.

ఛేదనకు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. మొదటి ఓవర్లోనే మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ రనౌటయ్యాడు. కోల్‌కతా బ్యాట్స్‌మన్‌ మన్వీందర్‌ బిస్లా  చెన్నై బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 48 బంతుల్లో 89 పరుగులు చేసి వెనుదిరిగాడు. జాక్వెస్‌ కలిస్‌ సైతం 49 బంతుల్లో 69తో రెచ్చిపోవడంతో కోల్‌కతా విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్‌లోని మూడు, నాలుగో బంతిని మనోజ్ తివారీ బౌండరీకి తరలించడంతో కోల్‌కతా మొదటిసారి ఛాంపియన్‌గా అవతరించింది. 

స్లింగా.. మలింగా

లీగ్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్ల జాబితాలో మొదటి వరుసలో ఉండే చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతుంటాయి. అప్పటికే చెరో మూడు సార్లు ట్రోఫీలు అందుకున్న ఈ జట్లు 2019లో నాలుగోసారి టైటిల్‌ కోసం వేటాడాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌.. చెన్నై బౌలర్ల ధాటికి ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులే చేసింది. ఆఖర్లో కీరన్‌ పొలార్డ్ 25 బంతుల్లో 41 పరుగులతో ఆదుకోవడం గమనార్హం.

ఛేదనకు దిగిన చెన్నై బ్యాట్స్‌మెన్‌లో షేన్‌ వాట్సన్‌ (80; 59 బంతుల్లో 4×8, 6×4) రాణించగా.. డుప్లెసిస్‌ (26; 13 బంతుల్లో 4×3, 6×1) ఫర్వాలేదనిపించాడు. చెన్నై విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమైన దశలో  కెప్టెన్ రోహిత్‌ శర్మ.. అనుభవజ్ఞుడైన లసిత్‌ మలింగకు బంతినందించాడు. ఈ ఓవర్‌లో మొదటి మూడు బంతులకు 4 పరుగులు రాగా.. నాలుగో బంతిని ఆడిన వాట్సన్‌ రెండో పరుగు తీసే క్రమంలో రనౌటయ్యాడు. ఐదో బంతిని ఎదుర్కొన్న శార్దూల్‌ ఠాకూర్‌ 2 పరుగులు చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమవ్వగా.. మలింగ, శార్దూల్‌ను ఎల్బీడబ్యూగా వెనక్కి పంపాడు.  దీంతో ముంబయి ఇండియన్స్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి నాలుగోసారి ఛాంపియన్‌గా అవతరించింది.

ఒక మ్యాచ్‌.. 2 సూపర్లు

2020లో దుబాయ్‌ వేదికగా ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన పోరులో ఇప్పటివరకు చూడని విధంగా ఒకే మ్యాచులో రెండు సూపర్‌ ఓవర్లు జరిగాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన రోహిత్ సేన 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన పంజాబ్‌ కూడా 176 చేయడంతో మ్యాచ్‌ టై అయింది.

సూపర్‌ ఓవర్లో మొదట పంజాబ్‌ జట్టే బ్యాటింగ్ చేసింది. జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్‌.. రెండు వికెట్లు కోల్పోయి కేవలం 5 పరుగులే చేసింది. బిగ్‌ హిట్టర్స్‌ ఉన్న ముంబయి ఇండియన్స్ ఈ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదిస్తుందని అంతా భావించారు. కానీ పంజాబ్‌ బౌలర్‌ మహ్మద్‌ షమి వైవిధ్యమైన బంతులతో  రోహిత్‌శర్మ, డికాక్‌ను పరుగులు చేయనివ్వలేదు. చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా క్రీజులో ఉన్న డికాక్‌ సింగిల్ తీసి.. రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కేఎల్ రాహుల్‌ అద్భుతంగా కీపింగ్‌ చేయడంతో డికాక్‌ రనౌటయ్యాడు. దీంతో మ్యాచ్‌ మళ్లీ టై అయింది.  తర్వాత  నిర్వహించిన మరో సూపర్‌ ఓవర్‌లో ముంబయి 11 పరుగులు చేయగా క్రిస్‌ గేల్‌ సిక్స్‌, మయాంక్‌ అగర్వాల్‌ ఫోర్‌ బాదడంతో పంజాబ్‌ చిరస్మరణీయ విజయం అందుకుంది.

 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని