సీఎస్కేలో రైనా లేకపోతే.. ధోనీపై భారం
close

తాజా వార్తలు

Published : 04/09/2020 18:04 IST

సీఎస్కేలో రైనా లేకపోతే.. ధోనీపై భారం

టాప్‌ సిక్స్‌ బ్యాట్స్‌మన్‌పై ఆకాశ్‌ చోప్రా 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది ఐపీఎల్‌లో టీమ్‌ఇండియా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోతారని మాజీ టెస్టు ఓపెనర్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన అతడు.. వరుసగా రిషభ్‌పంత్, రోహిత్‌శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, మహేంద్రసింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌లపై స్పందించాడు. ఒక్కొక్కరి గురించి  తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నాడు.


* రిషభ్‌పంత్‌

ఈ ఏడాది పంత్‌కు కలిసొస్తుందని అనుకుంటున్నా. అతడికి ఈ ఐపీఎల్‌ ఎంతో ముఖ్యం. అతడు స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని పలు ఇన్నింగ్స్‌ల్లో పరుగులు చేయగలడు. అవి మర్చిపోలేనివిగా ఉంటాయి. ఈసారి దిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పైకి తీసుకొస్తుందని భావిస్తున్నా.


* రోహిత్‌శర్మ

ముంబయి ఇండియన్స్‌ సారథి కచ్చితంగా పరుగులు చేయగలడు. కానీ, టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడో లేదో అనే విషయాన్ని మాత్రం చెప్పలేను. ఒక ఆటగాడిగా అతడిని ఇష్టపడినా ఒక సీజన్‌లో 600-700 పరుగులు చేయాలని ఆశిస్తున్నా. అయితే, రోహిత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎప్పుడూ ఓ సమస్య ఉంటుంది. అతడు ఓపెనింగ్‌ చేస్తాడా లేదా అనేది తెలియదు. ముంబయి కెప్టెన్‌ ఒకవేళ ఓపెనింగ్‌ చేస్తే ఎక్కువ పరుగులు చేస్తాడు. లోయర్‌ ఆర్డర్‌లో వస్తే భారీ ఇన్నింగ్స్‌ ఆడలేడు. 


* శ్రేయస్‌ అయ్యర్‌

శ్రేయస్‌కు ఈ ఐపీఎల్‌ సీజన్‌ అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా. అతడికి కలిసొచ్చే అంశాలు ఏవైనా ఉన్నాయంటే తన ఫిట్‌నెస్‌, పరుగులు చేయాలనే కసి. అలాగే లాక్‌డౌన్‌ కన్నా ముందు ఈ బ్యాట్స్‌మన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. దిల్లీ అతడిని కెప్టెన్‌గా చేసినప్పటి నుంచి జట్టు కూడా మంచిగా రాణిస్తోంది. అలాగే స్పిన్‌ బౌలింగ్‌లో బాగా ఆడాతాడు.


* మహేంద్రసింగ్‌ ధోనీ

ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ చెలరేగిపోతాడు. ఏడాది కాలంగా అతడు క్రికెట్‌ ఆడలేదు. అలాగే గతనెల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దాంతో చెన్నైను గెలిపించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరోవైపు సురేశ్‌ రైనా వైదొలగడంతో ఆ భారం మహీపై పడుతుంది. ధోనీ వీలైతే నాలుగో స్థానంలో అయినా బ్యాటింగ్‌కు దిగుతాడు. ఒకవేళ అలానే జరిగితే ఈ సీజన్‌ మరింత బాగా సాగుతుంది.


* విరాట్‌ కోహ్లీ

కోహ్లీ లాంటి ఆటగాడిని పరుగులకు, క్రికెట్‌కు దూరంగా ఉంచలేం. అయితే, యూఏఈలో రాణించడం అంత తేలిక కాదు. అక్కడి పరిస్థితుల కారణంగా చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకోసం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. కోహ్లీ ఈ విషయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటాడు. ఆర్సీబీ కెప్టెన్‌ టాప్‌ ఆర్డర్‌లో ఆడతాడు. కాబట్టి అధికంగా పరుగులు చేసే అవకాశం ఉంది. 


* కేఎల్‌ రాహుల్‌

రాహుల్‌ ఇప్పుడున్న ఫామ్‌ను బట్టి మంచి స్థితిలో ఉన్నాడు. కెప్టెన్‌గా మారడంతో అదనపు బాధ్యతలు పెరిగాయి. అతడి ఆలోచనా దృక్పథంతో ఈ సీజన్‌లో మరింత రెచ్చిపోగలడు. భారత బ్యాట్స్‌మెన్‌లో అతడే నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌గా రాణించే అవకాశం ఉంది. తద్వారా ఆరెంజ్‌ క్యాప్‌ కూడా సొంతం చేసుకోగలడని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని