కోహ్లీకి క్షమాపణలు చెప్పా: రహానె
close

తాజా వార్తలు

Published : 25/12/2020 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీకి క్షమాపణలు చెప్పా: రహానె

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ రనౌటవ్వడం మ్యాచ్ గమనాన్నే మార్చేసింది. తొలి రోజు ఆటలో కోహ్లీ-రహానె భాగస్వామ్యంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ కోహ్లీని రహానె పరుగుకు పిలిచి, తర్వాత వద్దనడంతో.. విరాట్ రనౌటయ్యాడు. అనంతరం టీమిండియా పేకమేడలా కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమై భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదుచేసింది.

అయితే కోహ్లీ రనౌట్‌కు కారణమైన అజింక్య రహానె తన తప్పిదంపై స్పందించాడు. తొలి రోజు ఆట ముగిసిన అనంతరం కోహ్లీ వద్దకు వెళ్లి రనౌట్‌ విషయమై క్షమాపణలు చెప్పానని తెలిపాడు. ‘‘ఆ రోజు ఆట ముగిసిన అనంతరం కోహ్లీ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పాను. రనౌటైన పరిస్థితిని అతడు అర్థం చేసుకున్నాడు. క్రికెట్‌లో ఇలాంటివి సహజం. వాటిని గౌరవిస్తూ ముందుకు సాగాలి. అయితే ఆ రనౌట్‌ కఠినమైన విషయం. ఆ సమయంలో మేం గొప్పగా ముందుకు సాగుతున్నాం. మా భాగస్వామ్యం బాగుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పైచేయి సాధించింది’’ అని రహానె అన్నాడు.

పితృత్వ సెలవులపై కోహ్లీ స్వదేశానికి తిరిగి రావడంతో సిరీస్‌లోని చివరి మూడు టెస్టులకు రహానె కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. కాగా, ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు పయనమయ్యే ముందు కోహ్లీ జట్టుతో మాట్లాడాడని రహానె తెలిపాడు. ప్రతిఒక్కరు సహకరించుకుంటూ జట్టుగా పోరాడాలని, సమష్టిగా రాణించాలని కోహ్లీ చెప్పాడని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌ రేపటి నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా రెండో టెస్టు ఆడనుంది.

ఇదీ చదవండి

టీమ్‌ఇండియా రెండో టెస్టు జట్టు ఇదే..

ధోనీ చెప్పినట్లే చేశాడు.. ఆశ్చర్యపోయా 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని