close

తాజా వార్తలు

Updated : 29/11/2020 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోరాడినా భారత్‌కు తప్పని ఓటమి

51 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం

అర్ధశతకాలతో పోరాడిన కోహ్లీ, కేఎల్ రాహుల్

మరో మ్యాచ్‌ మిగిలుండగానే వన్డే సిరీస్ ఆసీస్‌ కైవసం

ఇంటర్నెట్‌డెస్క్‌: మరోసారి భారత్‌కు పరాభవం తప్పలేదు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 51 పరుగులతో ఓటమిపాలై మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కోల్పోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాట్స్‌మన్‌ గొప్పగా శ్రమించినా.. పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్‌ భారత్‌ ఓటమికి కారణమయ్యాయి. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 389 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్ (104; 64 బంతుల్లో, 14×4, 2×6) వరుసగా మరో మెరుపు శతకం సాధించాడు. అనంతరం ఛేదనకు దిగిన టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోయి 338 పరుగులకు పరిమితమైంది. విరాట్ కోహ్లీ (89; 87 బంతుల్లో, 7×4, 2×6), కేఎల్ రాహుల్ (76; 66 బంతుల్లో, 4×4, 5×6) అర్ధశతకాలతో పోరాడారు. మూడు వన్డేల సిరీస్‌లో చివరి నామమాత్రపు మ్యాచ్‌ కాన్‌బెర్రా వేదికగా బుధవారం జరగనుంది.

పవర్‌ప్లేలోనే ఓపెనర్లు ఔట్..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పవర్‌ప్లేలోనే ఓపెనర్లను కోల్పోయింది. ధావన్‌ (30; 23 బంతుల్లో, 5×4)ను హేజిల్‌వుడ్‌ ఔట్ చేయగా మయాంక్‌ అగర్వాల్‌ (28; 26 బంతుల్లో, 4×4)ను కమిన్స్‌ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 60 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ (38; 36 బంతుల్లో, 5×4)తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. ఈ క్రమంలో విరాట్ 52 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే వీరిద్దరూ గేర్‌ మార్చే తరుణంలో శ్రేయస్‌ను హెన్రిక్స్‌ ఔట్ చేశాడు.

అనంతరం కేఎల్‌ రాహుల్‌తో కలిసి విరాట్‌ పోరాటాన్ని కొనసాగించాడు. మంచి బంతుల్ని గౌరవిస్తూనే వీరిద్దరూ బౌండరీలు సాధించారు. కోహ్లీ ఫ్లిక్‌ షాట్లతో అద్భుతంగా సిక్సర్లు బాదాడు. అయితే కావాల్సిన రన్‌రేట్‌ పెరుగుతుండటంతో కోహ్లీ మరింత దూకుడుగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. మరోవైపు రాహుల్ నిలకడగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. కాగా, లక్ష్యాన్ని కరిగిస్తున్న అతడిని జంపా పెవిలియన్‌కు చేర్చి భారత్‌ను దెబ్బతీశాడు. మరోవైపు సాధించాల్సిన లక్ష్యం భారీగా ఉన్నా క్రీజులో హిట్టర్లు హార్దిక్‌ పాండ్య (28; 31 బంతుల్లో, 1×4, 1×6), జడేజా (21; 11 బంతుల్లో, 1×4, 2×6) ఉండటంతో ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఆఖర్లో హార్దిక్‌కు లైఫ్ లభించడం, జడేజా సిక్సర్లు బాదడంతో భారత్ ఛేదిస్తుందనిపించింది. కానీ వరుస బంతుల్లో కమిన్స్‌ వీరిద్దరిని ఔట్‌ చేయడంతో కోహ్లీసేన ఓటమి ఖరారైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌ మూడు, హేజిల్‌వుడ్, జంపా తలో రెండు, హెన్రిక్స్‌, మాక్స్‌వెల్‌ చెరో వికెట్ తీశారు.


ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ వీరవిహారం..

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ఆద్యంతం భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది. టాప్‌-5 బ్యాట్స్‌మన్‌లో నలుగురు అర్ధశతకాలు బాదగా, స్టీవ్‌ స్మిత్ వరుసగా మరో శతకంతో సత్తాచాటాడు. ఓపెనర్లు వార్నర్‌ (83; 77 బంతుల్లో, 7×4, 3×6), ఫించ్‌ (60; 69 బంతుల్లో, 6×4, 1×6) తొలి వికెట్‌కు 142 పరుగుల ఘనమైన భాగస్వామ్యం నెలకొల్పారు. 23వ ఓవర్‌లో ఫించ్‌ను షమి ఔట్ చేయగా, కొద్దిసేపటికే వార్నర్‌ రనౌటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన లబుషేన్‌ (70; 61 బంతుల్లో, 5×4)తో కలిసి స్మిత్ టీమిండియాకు అవకాశం ఇవ్వకుండా ఇన్నింగ్స్‌ నిర్మించాడు. తొలుత నిదానంగా ఆడిన అతడు కుదురుకున్నాక బౌండరీల మోత మోగించాడు. ఫీల్డర్ల మధ్యలో నుంచి సొగసైన ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో 62 బంతుల్లో శతకం సాధించాడు.

తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో పాండ్య బౌలింగ్‌లో స్మిత్ ఔటయ్యాడు. ఆఖర్లో లబుషేన్‌తో కలిసి మాక్స్‌వెల్ (63*; 29 బంతుల్లో, 4×4, 4×6) విధ్వంసం సృష్టించడంతో ఆసీస్‌ భారీ స్కోరు సాధించింది. కాగా, తొలి వన్డేలో అయిదుగురు బౌలర్లే బౌలింగ్‌ చేయగా, ఈ మ్యాచ్‌లో ఏడుగురు బౌలింగ్ చేశారు. మయాంక్‌ (0/10) ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేయగా, హార్దిక్‌ (1/24) నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. సైని (0/70), చాహల్ (0/71) మరోసారి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జడేజా (0/60) నిరాశపరిచాడు. షమి (1/73), బుమ్రా (1/79) చెరో వికెట్ తీశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన