
తాజా వార్తలు
భారత్‌లో అభిమానులున్నారు: బాబర్ అజాం
ఇంటర్నెట్‌డెస్క్: తన బ్యాటింగ్‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించానని, భారత్‌లోనూ తనకు స్నేహితులు, అభిమానులు ఉన్నారని పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ బాబర్ అజామ్ పేర్కొన్నాడు. అజామ్ ప్రస్తుతం టాప్ ఐదు బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇటీవలే పాక్ టెస్టు జట్టుకు నూతన కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన బ్యాటింగ్ విషయంపై స్పందించాడు. ప్రపంచంలో గొప్ప బ్యాట్స్‌మెన్‌తో తనని పోల్చడం బాగుందని చెప్పాడు. తనకు సవాళ్లను ఎదుర్కోవాలంటే ఇష్టమని తెలిపాడు.
‘క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లతో నన్ను పోలుస్తున్నారని తెలుసు. అదో మంచి అనుభూతి . స్వతహాగా సవాళ్లను స్వీకరించే విధంగా నా ఆలోచనా దృక్పథాన్ని అలవర్చుకున్నా. స్వయంగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నా. దాంతో పాకిస్థాన్‌కు విజయాలు అందించాలి. జట్టుకు ఉపయోగపడేలా పరుగులు చేయాలి. నా ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నా. భారత్‌లోనూ నాకు మిత్రులు, అభిమానులున్నారు. వారిని నాకు మద్దతివ్వాలని కోరుతా’ అని బాబర్ పేర్కొన్నాడు. అలాగే ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ పాక్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన అతడు టెస్టు క్రికెట్లోనూ ఆ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు.