close

తాజా వార్తలు

Published : 02/12/2020 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రికెట్‌ ఆస్ట్రేలియాకు అండగా నిలిచిన బీసీసీఐ

ఛానెల్‌ సెవెన్‌ ఆరోపణలు బాధాకరం: సీఏ

మెల్‌బోర్న్‌: కొవిడ్‌-19 ముప్పు ఉన్నప్పటికీ ప్రస్తుత సిరీస్‌ సురక్షితంగా సాగేలా కృషి చేసిన బీసీసీఐకి క్రికెట్‌ ఆస్ట్రేలియా కృతజ్ఞతలు తెలియజేసింది. పోటాపోటీ నెలకొన్న ఈ సిరీస్‌ నిర్వహణకు కారకులైన బీసీసీఐలోని మిత్రులకు ధన్యవాదాలని సీఏ తాత్కాలిక సీఈవో నిక్‌ హాక్లీ అన్నాడు. బీసీసీఐకి భయపడి సీఏ షెడ్యూలు మార్చిందన్న ఛానెల్‌ 7 ఆరోపణలను ఈ సందర్భంగా హాక్లీ ఖండించాడు.

ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ బీసీసీఐకి లబ్ధి కలిగేలా షెడ్యూల్‌లో సీఏ మార్పులు చేసిందని.. ఈ రెండు బోర్డుల మధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయో తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతూ ఛానెల్‌ 7 సంస్థ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. భారత్‌తో పర్యటనను డే/నైట్‌ టెస్టుతో ఆరంభించాల్సిందని, కానీ ఆ మ్యాచ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా డిసెంబర్‌ 17కు మార్చిందని.. వన్డే, టీ20లను ముందుగా నిర్వహిస్తోందని సెవన్‌ వెస్ట్‌ మీడియా సీఈవో వార్‌బర్టన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే.

‘‘ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌ సానుకూలంగా ఉంది. ఇలాంటి సమయంలో మా ఆటను దెబ్బతీసేలా సెవెన్‌ వెస్ట్‌ మీడియా మాట్లాడటం నిరాశ కలిగిస్తోంది. సమ్మర్‌ క్రికెట్‌ ఆనందాన్ని అందించేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంతో అంకితభావం ప్రదర్శించింది. ప్రసారదారుతో ఒప్పంద స్థితిపై మేం విశ్వాసంతోనే ఉన్నాం. ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నా టీమ్‌ఇండియాతో ఈ సిరీస్‌ జరిగేందుకు బీసీసీఐలోని మా మిత్రులు ఎంతో మద్దతుగా నిలిచారు. తొలి రెండు వన్డేలకు వ్యూయర్‌షిప్‌ రికార్డులు బద్దలయ్యాయి. రాబోయే టెస్టు సిరీసుపై ఆసక్తికి ఇదో గొప్ప సూచిక. కరోనా సమయంలోనూ భారత్‌×ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం పనిచేస్తున్న ఛానెల్‌ 7 సిబ్బందికి అభినందనలు’’ అని హాక్లీ అన్నాడు.


Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని