వచ్చీ రాగానే చెన్నైని గెలిపించిన ధోనీ
close

తాజా వార్తలు

Published : 20/09/2020 00:43 IST

వచ్చీ రాగానే చెన్నైని గెలిపించిన ధోనీ

అంబటి రాయుడు, డుప్లెసిస్‌ అర్ధశతకాలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా ఆరు నెలలుగా అసలైన క్రికెట్‌ మజా లేని అభిమానులకు టీ20 క్రికెట్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌లో అది పుష్కలంగా దొరికింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ వచ్చీ రాగానే చెన్నైని గెలుపుబాటలో నడిపించాడు. యూఏఈలో ఆ జట్టుకు సరైన ప్రాక్టీస్‌ సమయం లేకున్నా తొలిపోరులో శుభారంభం చేశాడు. రోహిత్‌ సేన నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంబటి రాయుడు(71; 48 బంతుల్లో 6x4, 3x6), డుప్లెసిస్‌(58; 44 బంతుల్లో 6x4) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో సామ్‌కరన్‌(18; 6బంతుల్లో 1x4, 2x6) మెరుపు బ్యాటింగ్‌ చేయడంతో ఆ జట్టు సునాయాస విజయం సాధించింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 

కాగా, ఛేదనకు దిగిన చెన్నై జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 6 పరుగులకే షేన్‌ వాట్సన్‌(4), మురళీ విజయ్‌(1) ఔటయ్యారు. వీరిద్దరూ తొలి రెండు ఓవర్లలోనే ఎల్బీగా వెనుతిరిగారు. దీంతో చెన్నై విజయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సమయంలోనే క్రీజులోకి వచ్చిన రాయుడు, డుప్లెసిస్‌ బాధ్యతాయుతంగా ఆడి జట్టు స్కోరును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే రాయుడు క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతడికి డుప్లెసిస్‌ చక్కటి సహకారం అందించాడు. ఇక లక్ష్యానికి చేరువవుతున్న సమయంలో ఓ అనవసరపు షాట్‌ ఆడి రాహుల్‌ చాహర్‌ చేతికి చిక్కాడు. అప్పటికే చెన్నై విజయం లాంఛనమైంది. ఇక అప్పుడు క్రీజులోకి వచ్చిన కరన్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే అతడు భారీ షాట్‌ ఆడి బుమ్రా బౌలింగ్‌లో పాటిన్‌సన్‌ చేతికి చిక్కాడు. చివరికి ధోనీ క్రీజులోకి రావడంతో డుప్లెసిస్‌ మిగతా పని పూర్తి చేశాడు. ముంబయి బౌలర్లలో ట్రెంట్‌బౌల్ట్‌, బుమ్రా, పాటిన్‌సన్‌, కృనాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

ఇక అంతకుముందు ముంబయి జట్టును సౌరభ్‌ తివారి(42; 31 బంతుల్లో 3x4, 1x6), క్వింటన్‌ డికాక్‌(33; 20 బంతుల్లో 5x4) ఆదుకున్నారు. తొలి వికెట్‌కు డికాక్‌తో కలిసి రోహిత్‌(12) 46 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ వెనువెంటనే ఔటయ్యారు. అనంతరం సూర్యకుమార్‌(17)తో కలిసిన తివారి బాధ్యతాయుతంగా ఆడాడు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు మంచి స్కోర్‌ సాధించారు. ఆపై ముంబయి వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్‌ చేసే అవకాశం కోల్పోయింది. హార్దిక్‌ పాండ్య(14) వచ్చీ రాగానే రెండు సిక్సులతో అలరించినా కొద్దిసేపే క్రీజులో ఉన్నాడు. ఆపై కీరన్‌ పొలార్డ్‌(18) సైతం నిరాశపరిచారు. దాంతో ముంబయి 162 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా జడేజా, దీపక్‌ చాహర్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. సామ్‌కరన్‌, పీయుష్‌ చావ్లా చెరో వికెట్‌ తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని