
తాజా వార్తలు
ఫీల్డింగ్ చేస్తూ బుట్టబొమ్మా పాటకు స్టెప్పులు
టీమ్ఇండియాతో తొలి వన్డేలో డేవిడ్ వార్నర్
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పట్లో ‘బుట్టబొమ్మా’ పాటను మర్చిపోయేలా లేడు. అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ఈ పాట ఇప్పటికే విశేష ఆదరణ సంపాదించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో ఆ పాట నచ్చడంతో వార్నర్ కుటుంబంతో సహా ‘బుట్టబొమ్మా’ స్టెప్పులేసి టిక్‌టాక్ వీడియో రూపొందించాడు. దీంతో అది వైరల్‌గా మారడమే కాకుండా ఈ ఆస్ట్రేలియా ఓపెనర్‌ను తెలుగు అభిమానులకు మరింత చేరువచేసింది. అయితే, శుక్రవారం టీమ్ఇండియాతో తలపడిన తొలి వన్డేలోనూ ఈ విధ్వంసక ఓపెనర్ మరోసారి ఆ పాటకు స్టెప్పులేశాడు. భారత్ బ్యాటింగ్ చేస్తుండగా రెండో ఇన్నింగ్స్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అతడు బుట్టబొమ్మా బుట్టబొమ్మా అంటూ డ్యాన్స్ చేశాడు. స్టేడియంలోని ప్రేక్షకులు దాన్ని వీడియో తీయడంతో అదిప్పుడు వైరల్‌గా మారింది. నెటిజన్లు దాన్ని షేర్ చేస్తూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగులు చేయగా ఛేదనలో భారత్ 308/8కే పరిమితమైంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆరోన్ ఫించ్(114; 124 బంతుల్లో 9x4, 2x6), స్టీవ్‌స్మిత్(105; 66 బంతుల్లో 11x4, 4x6) శతకాలతో మెరవగా వార్నర్ (69; 76 బంతుల్లో 6x4) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇక భారత ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్య(90; 76 బంతుల్లో 7x4, 4x6), శిఖర్ ధావన్(74; 86 బంతుల్లో 10x4) పోరాడారు. ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో టీమ్ఇండియా ఈ సుదీర్ఘ పర్యటనను ఓటమితో ఆరంభించింది. ఆదివారం కోహ్లీసేన రెండో వన్డే ఆడనుంది.