close

తాజా వార్తలు

Updated : 29/09/2020 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పడి..పడి.. దంచికొట్టే పడిక్కల్‌

బౌన్స్‌కు భయపడడు.. టర్న్‌కు వెనుకాడడు

భాగ్యనగరంతో విడదీయరాని అనుబంధం

వయసు 20 ఏళ్లు.. ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు.. ఎడమచేతివాటం.. బంతిని బౌండరీ సరిహద్దులు దాటించగల భుజ బలం.. పరుగుల వరద పారించాలన్న మనస్తత్వం.. బౌన్సర్లకు భయపడని ఆత్మవిశ్వాసం.. కెరీర్‌లో నిలదొక్కుకోవాలన్న కసి.. అన్నీ కలిస్తే యువ క్రికెటర్‌ ‘దేవదత్‌ పడిక్కల్‌’. హైదరాబాద్‌ బౌలింగ్‌లో భారీ షాట్లతో యువరాజ్‌ సింగ్‌ను గుర్తుకుతెచ్చిన అతడి విశేషాలు మీ కోసం.


హైదరాబాద్‌లో ఓనమాలు

(Twitter/Devdutt Padikkal)

చెబితే నమ్మరు కానీ దేవదత్‌ పడిక్కల్‌ పుట్టకతోనే క్రికెటర్‌! తమకు కలిగే రెండో సంతానం మగ బిడ్డయితే క్రికెటర్‌ను చేయాలని పడిక్కల్‌ తల్లిదండ్రులు అంబిలి పడిక్కల్‌, బాబున్‌ కున్నత్‌ నిర్ణయించుకున్నారు. 2000, జులై 7న కేరళలోని మలప్పురం జిల్లాలోని ఇడప్పల్‌లో అతడు జన్మించాడు. వృత్తిరీత్యా తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఆర్కేపురంలో ఉండేవారు. అందుకే అతడి బాల్యస్మృతులన్నీ భాగ్యనగరంతోనే ముడిపడ్డాయి. క్రికెటర్‌గా మార్చాలనే ఉద్దేశంతో దేవదత్‌ను.. అంబటి రాయుడి బంధువొకరు నడిపే క్రికెట్‌ శిబిరంలో చేర్చారు. అక్కడ వందల మంది ఉండటంతో సరైన శిక్షణ లభిస్తుందో లేదోనని ఇక్కడ సొంతింటిని వదిలిపెట్టేసి ఆ కుటుంబం బెంగళూరుకు మకాం మార్చింది. 2014లో కర్ణాటక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రికెట్‌లో చేరిన పడిక్కల్‌ కొన్నేళ్లలోనే మంచి క్రికెటర్‌గా ఎదిగాడు.


అమ్మ సాయంతో..

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు మారాక పడిక్కల్‌ ఇబ్బందులు పడ్డాడు. నగరం కొత్త కావడం, బాష రాకపోవడంతో అకాడమీలో సరిగ్గా శిక్షణ పొందేవాడు కాదు. సమస్యను గమనించిన అంబిలి కొన్నిరోజులు అతడితో పాటు రోజూ వెళ్లి శిబిరంలోనే ఉండి ఆటను గమనించేది. క్రికెట్‌కు అతడిని అలవాటు పడేలా చేసింది. ఆ క్షణం నుంచి పడిక్కల్‌ ఎక్కడా ఆగలేదు. ఆయా వయసు విభాగాల్లో రాణించి సత్తాచాటాడు. అప్పుడే అతడు కోచ్‌ మహ్మద్‌ నసీరుద్దీన్‌ కళ్లల్లో పడ్డాడు. ఆ క్షణం నుంచి ఆయన అతడికి శిక్షణనిచ్చాడు. మార్గనిర్దేశకుడిగా మారారు. ‘దేవదత్‌ బ్యాటింగ్‌ చూసే ఎవరైనా తప్పక ఆత్రుత చెందుతారు’ అన్నది కోచ్‌ మాట. అతడు ఎత్తు పెరగడంతో బౌలర్లు షార్ట్‌బంతులు వేసినా ఇబ్బంది పడేవాడు కాదన్నారు. ఇక స్పిన్‌లోనూ దంచికొట్టేవాడట.


ఒక ఏడాది పరుగుల్లేవ్‌

(Twitter/Devdutt Padikkal)

కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌-2017లో దేవ్‌దత్‌ అందరి దృష్టిలో పడ్డాడు. 17ఏళ్ల వయసులో బెంగళూరు బ్లాస్టర్స్‌పై 53 బంతుల్లోనే 72 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే అండర్‌-19లో కర్ణాటకకు ఆడుతూ హఠాత్తుగా ఫామ్‌ కోల్పోయాడు. అండర్‌-14 నుంచి అండర్‌-16 వరకు అతనెప్పుడూ చెత్తగా ఆడలేదు. ఎప్పుడూ చలాకీగా పరుగులు చేసేవాడు. అలాంటిది ఏడాది పాటు ఇబ్బంది పడటంతో మళ్లీ అతడి బుగ్గలు గిల్లాల్సి వచ్చిందని నసీరుద్దీన్‌ చెప్పారు. ‘ఒక్క మ్యాచ్‌లో రాణిస్తే మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటావు. అందుకోసం ప్రయత్నం చేయ్‌’ అని తన శిష్యుడికి ఆదేశించారు. అండర్‌-19 క్లబ్‌ క్రికెట్లో ఓ సారి ఎంతో కష్టపడి.. ఓపికతో శతకం బాదాడు. ఇక ఆ తర్వాత అతడు వెనక్కి చూడాల్సిన పరిస్థితి రాలేదు. బీసీసీఐ టోర్నీల్లో చెలరేగాడు.


దేశవాళీలో దంచికొట్టాడు

ఫామ్‌ అందుకున్న దేవదత్‌ 2018లో అండర్‌-19 జట్టు తరఫున శ్రీలంకలో ఆడాడు. ఆ తర్వాత కూచ్‌బెహార్‌ ట్రోఫీలో ఏకంగా 829 పరుగులు సాధించాడు. దాంతో కర్ణాటక తరఫున రంజీలకు ఎంపికయ్యాడు. మైసూర్‌లో మహారాష్ట్రతో మ్యాచ్‌లో అరంగేట్రం చేసి 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ దృష్టిని ఆకర్షించాడు. విజయ్‌ హజారే వన్డే టోర్నీలో 67.66 సగటుతో 609, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో 175.75 స్ట్రైక్‌రేట్‌తో 580 పరుగులు చేశాడు. దాంతో ఆ రెండు టోర్నీలను కర్ణాటక కైవసం చేసుకుంది. రంజీల్లో సెమీస్‌ చేరింది. కర్ణాటక సీనియర్‌ ఆటగాళ్లైన మనీశ్‌ పాండే, కేఎల్‌ రాహుల్‌ అతడిని ప్రశంసించి ప్రోత్సహించారు. కేపీఎల్‌-19లో దుమ్మురేపి ఎమర్జింగ్‌ ఆటగాడిగా పురస్కారం అందుకొని బెంగళూరుకు ఎంపికయ్యాడు.


బెంగళూరు గూటికి

(Twitter/Devdutt Padikkal)

గతేడాది బెంగళూరు శిబిరంలో చేరిన దేవదత్‌కు ఒక్క మ్యాచులోనూ అవకాశం రాలేదు. ఎందుకంటే ఆ ఏడాది బెంగళూరు ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. 14 మ్యాచుల్లో గెలిచింది ఐదే. అందుకే కొత్తవారికి అవకాశం ఇవ్వలేదు. అయితే మైక్‌ హెసన్‌, విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ సహా జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్ల సాంగత్యం అతడికి దొరికింది. వారి ఆటను గమనించాడు. వారితో డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉంటూ మెలకువలు నేర్చుకున్నాడు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఈ ఏడాది కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా సాధన చేసి త్వరగానే ఫిట్‌నెస్‌ సాధించాడు. తల్లిదండ్రులు సైతం అతడి కోసం క్వారంటైన్‌లో ఉండి దుబాయ్‌ విమానం ఎక్కించారు. అనుకున్నట్టుగానే ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే అరంగేట్రం చేసి హైదరాబాద్‌పై అర్ధశతకం (56) సాధించాడు. తొలి మ్యాచుల్లోనే భారీ స్కోర్లు చేయడం పడిక్కల్‌కు కొత్తేమీ కాదు. 2018లో రంజీల్లో మహారాష్ట్రపై 7; 77, లిస్ట్‌-ఏలో ఝార్ఖండ్‌పై 58, టీ20ల్లో ఉత్తరాఖండ్‌పై 53*తో నిలిచాడు. ధాటిగా ఆడుతున్న అతడు ఈ ఏడాది ఎమర్జింగ్‌ ప్లేయర్‌ పురస్కారం అందుకున్నా ఆశ్చర్యమేమీ లేదు.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.