close

తాజా వార్తలు

మిగతా క్రీడల్నీ క్రికెట్‌స్థాయికి చేర్చేలా ‘ఈఎస్‌ఎల్‌’

అందరిలోనూ తగ్గుతున్న శారీరక శ్రమ: పుల్లెల గోపీచంద్‌

ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ ట్రోఫీల ఆవిష్కరణ

హైదరాబాద్‌: ‘ఈనాడు’ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌’ (ఈఎస్‌ఎల్‌) ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగింది. లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ట్రోఫీలను ఆవిష్కరించారు. 2006లో కేవలం క్రికెట్‌తో ఆరంభమై గిన్నిస్‌ రికార్డు సాధించిన లీగ్‌ నేడు బహుళ క్రీడల ‘ఈఎస్‌ఎల్‌గా రూపాంతరం చెందింది. ‘ఒట్టి మాటలు కట్టిపెటి గట్టిమేలు తలపెట్టవోయ్‌’ అనే గురజాడ స్ఫూర్తితో తాము ముందుకు సాగుతామని ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌ అన్నారు. దేశంలో నానాటికీ శారీరక అక్షరాస్యత (ఫిజికల్‌ లిటరసీ) తగ్గిపోవడం ఆందోళనకరమని గోపీచంద్‌ అన్నారు. పరిస్థితిలో మార్పు రాకుంటే భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా మారుతుందన్నారు.

‘పద్మభూషణ్‌, రాజీవ్‌ ఖేల్‌ రత్న పుల్లెల గోపీచంద్‌ ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌కు మార్గనిర్దేశకుడిగా ఉండటం సంతోషం. ఒక ఆటగాడిగా, కోచ్‌గా ఆయన దేశంలో బ్యాడ్మింటన్‌ సంస్కృతిని అభివృద్ధి చేశారు. మేమూ క్రీడాభివృద్ధికి ఎంతో కొంత కృషి చేస్తున్నాం. వార్తలను కేవలం ప్రజలకు చేరవేయడమే కాకుండా ప్రజలు, దేశ అభివృద్ధిలో భాగమయ్యేలా గౌరవనీయ ఛైర్మన్‌ రామోజీరావు మా వృత్తిధర్మాన్ని తీర్చిదిద్దారు. అదే స్ఫూర్తితో మేం ఈఎస్‌ఎల్‌ను ప్రారంభించాం. దేశంలో క్రికెట్‌ను ఒక మతంగా భావించేవారు. ఇప్పుడూ అలాగే ఉంది. అందుకే మేం క్రికెట్‌తో మా ప్రస్థానాన్ని ఆరంభించాం. అదే స్థాయిలో మిగతా క్రీడలూ ఎదగాలని కోరుకుంటున్నాం. రాబోయే సంవత్సరాల్లో మిగతా క్రీడలూ క్రికెట్‌ స్థాయికి చేరుకొనేందుకు మా వంతు కృషిచేస్తాం’ అని కిరణ్‌ అన్నారు. క్రీడల నిర్వహణలో తమ పొరపాట్లను గమనించి సరిదిద్దాలని గోపీచంద్‌ను కోరారు. ఫిలింసిటీ ఎండీ రామ్మోహన్‌రావు తమందరినీ తండ్రిలా క్రమశిక్షణతో ముందుకు నడిపించారని కిరణ్‌ అన్నారు.

గంటకు 10 కి.మీ పరుగెడితేనే..

‘ఈనాడు’ సంస్థ పదేళ్లుగా క్రీడా పోటీలను అద్భుతంగా నిర్వహిస్తుందని తనకు తెలుసని జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. ఇప్పుడు మరింత పెద్ద లీగ్‌ నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ‘గతంలో క్రీడలనేవి మన స్వభావంలోనే ఉండేవి. గ్రామాలు, నగరాల్లో నడవడం, ఆడటం సహజంగా ఉండేవి. ప్రస్తుతం అన్నింటిలోనూ సౌకర్యంగా ఉండటం అలవాటైంది. శారీరక శ్రమ తగ్గిపోయింది. దేశంలో విద్యపరంగా అక్షరాస్యత పెరిగితే అందుకు విరుద్ధంగా శారీరక అక్షరాస్యత తగ్గిపోయింది. ఓ సారి వేసవి శిబిరంలో ఓ పాపను షటిల్‌ పట్టుకోమంటే ఎలా పట్టుకోవాలో నేర్పించండని చెప్పడంతో అవాక్కయ్యాను. ఇలాంటి పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. పిల్లలు ఇప్పుడు దేహదారుఢ్యంపై కష్టపడకపోతే 30ఏళ్ల వయసులో వెన్నునొప్పితో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు వారిపై దాడిచేసే ప్రమాదముంది. వీటిని పరిష్కరించాలి’ అని గోపీచంద్‌ అన్నారు.

‘ప్రభుత్వాలు సమస్యలొచ్చాక పరిష్కారం కోసం వెదుకుతాయి. మనం ముందుగానే సమస్యను పసిగట్టి పిల్లలను ప్రోత్సహించాలి. క్రీడల్లో వైవిధ్యం (డైవర్సిఫికేషన్‌) అవసరం. శారీరక స్థితి, వయసును బట్టి వేర్వేరు వ్యక్తులు వేర్వేరు క్రీడలు ఆడాలి. మనం అందుకు మార్గనిర్దేశం చేయాలి. ఈనాడు నా వద్దకు వచ్చినప్పుడు సంతోషించా. ఎలాగైనా సరే సాయం చేయాలని భావించా. తరగతి గదిలో యాభై మంది ఉంటే ఐదుగురే అన్ని ఆటలు ఆడతారు. మరి మిగతా 45 మంది పరిస్థితి ఏంటి? ఈ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. నా చిన్నప్పుడు ఉదయం బాగా ఆడి తరగతిలో రెండుమూడు క్లాసులయ్యాక కునుకుతీసేవాడిని. అప్పుడు టీచర్లు నన్ను బయట నిలబెట్టేవారు. నాకిష్టంలేని విషయాలను తిరస్కరిస్తూ బయటకు వెళ్లేవాడిని. ఇప్పుడు విద్యార్థులు శారీరక అక్షరాస్యతను తిరస్కరిస్తున్నారు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. పతకాలు, విజయాలకు అతీతంగా ఆటలను చూడాలి. సమతా వ్యవస్థ ఉండాలి. తరగతిలో ప్రతి ఒక్కరు గంటలో 10 కి.మీ. పరుగెత్తినప్పుడు నా లక్ష్యం నెరవేరుతుంది. ఈఎస్‌ఎల్‌లో ఎంత మంది ఆడుతున్నారో కాకుండా ఎందరు ఆడటం లేదో గమనిస్తే మనం చేరుకోవాల్సిన లక్ష్యం స్పష్టమవుతుంది’ అని గోపీచంద్‌ అన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.