
తాజా వార్తలు
రాహుల్‌కు క్షమాపణలు చెప్పా: మాక్స్వెల్
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియాతో ఆడిన తొలి వన్డేలో కేఎల్ రాహుల్‌కు క్షమాపణలు చెప్పానని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పేర్కొన్నాడు. ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో మాక్సీ పంజాబ్ తరఫున ఆడగా పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులే చేశాడు. టోర్నీ మొత్తంలో ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్, బెంగళూరు బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ సైతం ఆ టీ20లీగ్‌లో ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కోహ్లీసేనతో ఆడిన మ్యాచ్‌లో ఈ ముగ్గురూ రెచ్చిపోయారు. ఫించ్(114; 124 బంతుల్లో 9x4, 2x6), స్టీవ్‌స్మిత్(105; 66 బంతుల్లో 11x4, 4x6) శతకాలకు తోడు మాక్స్వెల్ (45; 19 బంతుల్లలో 5x4, 3x6) మెరుపు బ్యాటింగ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 374/6 భారీ స్కోర్ చేసింది.
ఇక శుక్రవారమే న్యూజిలాండ్.. వెస్టిండీస్‌తో ఆడిన తొలి టీ20లో జేమ్స్ నీషమ్(48; 24 బంతుల్లో 5x4, 3x6) సైతం మెరుపు బ్యాటింగ్ చేశాడు. అతడు కూడా ఐపీఎల్లో పంజాబ్ తరఫున పేలవ ప్రదర్శన చేశాడు. ఇప్పుడు ఒకేరోజు మాక్సీ, నీషమ్ దంచికొట్టడంతో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. వీళ్ల బ్యాటింగ్ చూశాక అతడెలా ఉంటాడనే దానిపై సరదాగా మీమ్స్ రూపొందించారు. ఈ క్రమంలోనే అలాంటి ఒక ట్వీట్‌ను చూసిన జిమ్మీ దాన్ని షేర్ చేస్తూ మాక్స్‌వెల్‌ను కూడా ట్యాగ్ చేశాడు. అందులో రాహుల్ కోపంగా చూస్తున్నట్లు ఉంది. దానికి స్పందించిన మాక్సీ.. తాను టీమ్ఇండియాపై బ్యాటింగ్ చేసేటప్పుడు వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్న రాహుల్‌కు క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నాడు.