
తాజా వార్తలు
టీమ్ఇండియాను హడలెత్తించారు..
భారత్‌పై అత్యధిక వన్డే స్కోర్లు ఎవరు చేశారంటే..
తొమ్మిది నెలల తర్వాత ప్రారంభమైన అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. అటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైన కోహ్లీసేన ఛేదనలో మరింత వెనుకపడింది. ధాటిగా ఆడే శక్తి సామర్థ్యాలున్నా కీలక బ్యాట్స్‌మెన్ మైదానంలో నిలువలేకపోయారు. ఎప్పటిలాగే బౌన్సీ పిచ్‌ను ఎదుర్కోవడంలో చిత్తయ్యారు. దీంతో కంగారూలు సంపూర్ణ ఆధిపత్యం చలాయించి ఈ సీజన్లో బోణీ కొట్టారు. ఈ క్రమంలోనే వారు టీమ్ఇండియాపై మునుపెన్నడూ లేని విధంగా వన్డేల్లో అత్యధిక స్కోర్ సాధించారు. అయితే, భారత జట్టుపై ఇతర జట్లు ఇంతకన్నా ఎక్కువ పరుగులే చేశాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
దంచికొట్టిన దక్షిణాఫ్రికా..
వన్డే చరిత్రలో భారత జట్టుపై అత్యధిక స్కోర్ సాధించిన జట్టు దక్షిణాఫ్రికా. 2015 భారత పర్యటన సందర్భంగా ముంబయి వాంఖడేలో జరిగిన ఐదో వన్డేలో డివిలియర్స్ టీమ్ దంచికొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు 50 ఓవర్లకు 438/4 భారీ స్కోర్ సాధించింది. క్వింటన్ డికాక్(109), డుప్లెసిస్(133), ఏబీ డివిలియర్స్(119) భారత్‌కు చుక్కలు చూపించారు. ముగ్గురూ మెరుపు బ్యాటింగ్‌తో శతకాలు బాది టీమ్ఇండియా బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 224 పరుగులకే ఆలౌటైంది. అజింక్య రహానె(87), శిఖర్ ధావన్(60) పోరాడినా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ధోనీసేన 214 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
హడలెత్తించిన శ్రీలంక..
ఇక టీమ్ఇండియాపై రెండో అత్యధిక స్కోర్ చేసింది శ్రీలంక. 2009 భారత పర్యటన సందర్భంగా రాజ్‌కోట్‌లో జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు 411 పరుగులు చేసింది. తొలుత సెహ్వాగ్(146), సచిన్(69), ధోనీ(72) రెచ్చిపోడంతో భారత్ వన్డే క్రికెట్లో తన అత్యధిక స్కోరు 414/7 నమోదు చేసింది. దీంతో 2007 ప్రపంచకప్‌లో బెర్ముడాపై సాధించిన 413 /5 రికార్డును తిరగరాసింది. ఛేదనలో లంక బ్యాట్స్‌మెన్ తిలకరత్నె దిల్షాన్(160), సంగక్కర (90) విరోచిత బ్యాటింగ్ చేయడంతో ఆ జట్టు 411/8 పరుగులు చేసి భారత్ గుండెల్లో గుబులు పుట్టించింది. ఆఖరిదాకా ఉత్కంఠభరింతంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 3 పరుగుల స్వల్ప తేడాలోనే అద్భుత విజయం సాధించింది.
ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శన..
టీమ్ఇండియాపై మూడో అత్యధిక స్కోర్ సాధించింది ఆస్ట్రేలియా. సిడ్నీ వేదికగా శుక్రవారం(నవంబరు 27) జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 374/6 పరుగులు చేసింది. ఈ స్కోర్‌తో 2003 ప్రపంచకప్ ఫైనల్లో రికీ పాంటింగ్ టీమ్ సాధించిన 359/2 రికార్డును అధిగమించింది. ఇప్పుడిదే భారత జట్టుపై కంగారూలకు అత్యుత్తమ వన్డే స్కోర్‌గా నమోదైంది. ఛేదనలో శిఖర్ ధావన్(74), హార్దిక్ పాండ్య(90) పోరాడినా ఫలితం లేకపోయింది. కోహ్లీ, రాహుల్, మయాంక్, శ్రేయస్ విఫలమవడంతో టీమ్ఇండియా 308/8కే పరిమితమైంది. దాంతో 66 పరుగుల తేడాతో ఓటమిపాలై ఈ సీజన్‌ను పేలవంగా ఆరంభించింది.
భయపెట్టిన ఇంగ్లాండ్..
భారత్‌పై నాలుగో అత్యధిక స్కోర్ చేసింది ఇంగ్లాండ్. 2016-17 సీజన్లో భారత పర్యటన సందర్భంగా కటక్‌లో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు హడలెత్తించింది. తొలుత యువరాజ్ సింగ్(150), మహేంద్ర సింగ్ ధోనీ(134) దంచికొట్టడంతో టీమ్ఇండియా 50 ఓవర్లలో 381/6 భారీ స్కోర్ సాధించింది. ఆపై ఇయాన్ మోర్గాన్(102), జేసన్ రాయ్(82), రూట్(54), మోయిన్ అలీ(55) ధాటిగా ఆడి కోహ్లీసేను ఓడించినంత పనిచేశారు. చివరికి ఆ జట్టు 366/8కి పరిమితమవడంతో భారత్ 15 పరుగులతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.
-ఇంటర్నెట్ డెస్క్