close
Array ( ) 1

తాజా వార్తలు

సచిన్‌ కెరీర్‌ మలుపుతిప్పిన అజహరుద్దీన్‌

ఆ నిర్ణయంతో టీమ్‌ఇండియా రూపురేఖలు మారాయి

మహమ్మద్‌ అజహరుద్దీన్‌ .. అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కెప్టెన్‌గా రాణించి టీమ్‌ఇండియాకు ఎన్నో అధ్బుత విజయాలు అందించాడు. అలాంటి మేటి క్రికెటర్‌ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసినా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం.. టీమ్‌ఇండియా రూపురేఖలను మార్చడమే కాకుండా.. ఆల్‌టైమ్‌ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందూల్కర్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. 


తొలి ఐదేళ్లు ఒక్క శతకం బాదని సచిన్‌

అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో టీమ్‌ఇండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. తనదైన బ్యాటింగ్‌తో శతకాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా, అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాంటి దిగ్గజ బ్యాట్స్‌మన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి ఐదేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. అప్పట్లో లిటిల్‌ మాస్టర్‌ ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌ చేసేవాడు. 1994లో కెప్టెన్‌ అజహరుద్దీన్‌ తీసుకున్న నిర్ణయం సచిన్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటిదాకా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న సచిన్‌ను ఓపెనర్‌గా దింపాడు. ఆ తర్వాత లిటిల్‌ మాస్టర్‌ కాస్తా మాస్టర్‌ బ్లాస్టర్‌గా ఎదిగాడు. నాటి నుంచి వెనక్కి చూడని సచిన్‌ తన మాస్టర్‌ స్ట్రోక్‌తో ఆల్‌టైమ్‌ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు.


కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన మాస్టర్‌ బ్లాస్టర్‌

1994 మార్చి 27న న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో వన్డే మ్యాచ్‌. అప్పటి ఓపెనర్ నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ అనారోగ్యం పాలవ్వడంతో కెప్టెన్‌ అజహరుద్దీన్‌.. టీమ్‌ మేనేజర్‌ అజిత్‌ వాడేకర్‌తో చర్చించి సచిన్‌ను ఓపెనర్‌గా పంపాలని నిర్ణయించుకున్నాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిజం చేస్తూ తెందూల్కర్‌ ఓపెనర్‌గా దిగి చెలరేగిపోయాడు. ఆ మ్యాచ్‌లో 49 బంతుల్లోనే 82 పరుగులు చేసి అజహరుద్దీన్‌ నిర్ణయం తప్పుకాదని నిరూపించాడు. తర్వాత లిటిల్‌ మాస్టర్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నాటి నుంచి టీమ్‌ఇండియాతో పాటు ప్రపంచ క్రికెట్‌లో పరుగుల వరద ప్రారంభమైంది. కాగా, అజహరుద్దీన్‌ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే విషయాన్ని ఓ సందర్భంలో స్టార్‌స్పోర్ట్స్‌తో పంచుకున్నాడు. 


ఆ క్రెడిట్‌ నేను తీసుకోలేకపోయా 

‘సచిన్‌ మిడిల్‌ ఆర్డర్‌లో బాగా రాణిస్తున్నా పెద్ద స్కోర్లు చేయలేకపోవడం గ్రహించాను. ఇదే విషయమై వాడేకర్‌తో చర్చించాను. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు నాటి ఓపెనర్‌ నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు సచిన్‌ను ఓపెనర్‌గా పంపించాలని నిర్ణయించుకున్నాం. సచిన్‌కు కూడా అప్పట్లో ఓపెనింగ్‌ చేయాలని ఉండేది. అయితే, తను ఆ అవకాశం కోసం ఎదురుచూశాడు. అతడు ఓపెనింగ్‌ చేయడానికి ఒప్పుకోవడంలో నాకు ఆశర్చం కలగలేదు. ఎందుకంటే తెందూల్కర్‌కు ఆ టాలెంట్‌ ఉందని నాకు తెలుసు. తర్వాత లిటిల్‌ మాస్టర్‌ సాధించిన విజయాలకు నేను క్రెడిట్‌ తీసుకోలేకపోయా. నేనే కాదు ఎవరూ అలా చేయలేరు. సచిన్‌కు ఎక్కడికైనా వెళ్లే నైపుణ్యం ఉంది. ఆ నిర్ణయం లిటిల్‌ మాస్టర్‌ను ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దడం ఇప్పుడు మాకు సంతోషాన్ని కలిగిస్తుంది’ అని మాజీ సారథి చెప్పుకొచ్చాడు. 

 -ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.