ఎంతెంత లాభం?
close

తాజా వార్తలు

Published : 14/12/2020 07:35 IST

ఎంతెంత లాభం?


విదేశాల్లో తొలిసారి డేనైట్‌ టెస్టుకు.. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై గులాబి బంతి పోరుకు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఆస్ట్రేలియా- ఎ జట్టుతో డేనైట్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఆడేసింది. ఈ మ్యాచ్‌లో విజయవకాశాలు సృష్టించుకున్న భారత్‌.. చివరకు డ్రాగా ముగించింది. పోరులో ఫలితం తేలకపోయినప్పటికీ జట్టు విషయంలో భారత్‌కు మంచి ఫలితాలే దక్కాయి. మరి ఆ సన్నాహక మ్యాచ్‌ ద్వారా జట్టుకు కలిగిన లాభమేంటి?

ఈనాడు క్రీడావిభాగం

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఓపెనింగ్‌పై ముందు నుంచి ప్రశ్నలు రేకెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే టెస్టుల్లో ఓపెనర్‌గా స్థిరపడ్డ మయాంక్‌కు జోడీగా ఎవరిని పంపాలనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఆ స్థానం కోసం పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌తో పాటు ఏడాది తర్వాత తిరిగి టెస్టుల్లో చోటు దక్కించుకున్న కేఎల్‌ రాహుల్‌ పోటీపడుతున్నారు. అయితే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాహుల్‌ ఆడలేదు. మిగతా ఇద్దరిలో చూసుకుంటే షా కంటే కూడా గిల్‌ ప్రభావవంతంగా కనిపిస్తున్నాడు. రెండో సన్నాహక మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను చక్కగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో షా (40)తో కలిసి మెరిసిన అతను (43).. రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేశాడు. షా కేవలం మూడు పరుగులకే వెనుదిరిగాడు. టెక్నిక్, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్‌ చేయడం, ఆడే షాట్లు.. ఇలా చూసుకుంటే షా కంటే గిల్‌ ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో మాయంక్‌తో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం ఉంది. అయితే 36 టెస్టుల అనుభవం ఉన్న రాహుల్‌ను పరిగణలోకి తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అతను ఓపెనర్‌గానూ, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గానూ జట్టుకు ఉపయోగపడగలడు. ఇక ఆరో స్థానంలో విహారి దాదాపుగా బరిలో దిగే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకంతో పాటు తన స్పిన్‌తోనూ అతను ఆకట్టుకున్నాడు. వికెట్‌ కీపర్‌ స్థానం కోసం పంత్, సాహా మధ్య మళ్లీ పోటీ మొదలైంది. రెండో సన్నాహక మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పంత్‌ విఫలమవడంతో.. తొలి వార్మప్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కఠిన పరిస్థితుల్లో అర్ధశతకంతో జట్టును గట్టెక్కించిన సాహాకు మొదటి టెస్టు ఆడే అవకాశం దక్కుతుందనిపించింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌ మెరుపు శతకంతో తిరిగి పోటీలోకి వచ్చాడు. గత ఆస్ట్రేలియా సిరీస్‌ (2018-19)లో మెరుగ్గా రాణించిన పంత్‌కు మరో అవకాశం దక్కే వీలుంది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. ప్రధాన పేసర్లయిన బుమ్రా, షమి తొలి ఇన్నింగ్స్‌లో గులాబి బంతితో ప్రత్యర్థి పని పట్టారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కొత్త బంతితో షమి ప్రభావవంతంగా కనిపించాడు. కానీ బంతి పాతబడ్డ తర్వాత వికెట్లు తీయలేకపోయారు. ఈ నేపథ్యంలో అసలు పోరాటంలో వీళ్ల ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక మూడో పేసర్‌ స్థానంపై సైని, ఉమేశ్‌ యాదవ్‌ ఆశతో ఉన్నారు. తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఉమేశ్‌ రాణించగా.. రెండో సన్నాహక మ్యాచ్‌లో సైని సత్తాచాటాడు. వీళ్లలో జట్టు మేనేజ్‌మెంట్‌ ఎవరికి ఓటు వేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌కు జట్టులో చోటు ఖాయమవగా.. మరో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ను తీసుకుంటారా? లేదా విహారితోనే బౌలింగ్‌ చేయిస్తారా? అన్నది చూడాలి. 

ఆస్ట్రేలియాకు నష్టమే: ఈ సన్నాహక మ్యాచ్‌లతో ఆస్ట్రేలియాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో సత్తాచాటి తొలిసారి ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు ఎంపికైన యువ ఓపెనర్‌ పకోస్కీ తొలి వార్మప్‌ మ్యాచ్‌లో కంకషన్‌కు గురై మొదటి టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పటికే వార్నర్‌ గాయంతో తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టుకు ఓపెనర్ల సమస్య వచ్చిపడింది. పకోస్కీ స్థానంలో జట్టులోకి ఎంపికైన హారిస్‌తో పాటు మరో ఓపెనర్‌ బర్న్స్‌.. సన్నాహక మ్యాచ్‌లో విఫలమయ్యారు. బర్న్స్‌ కొంతకాలంగా విఫలమవుతున్నాడు. మరోవైపు యువ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ కూడా కంకషన్‌ (రెండో వార్మప్‌ మ్యాచ్‌లో) బారిన పడడం ఆ జట్టును ఇబ్బంది పెట్టేదే!

ఇవీ చదవండి..

పంత్‌-సాహా స్థానంపై నిర్ణయం తలనొప్పే!

పడగొట్టలేక.. ఫలితం తేలక


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని