close
Array ( ) 1

తాజా వార్తలు

బాబోయ్‌.. టాస్‌ ఇంత పని చేస్తుందా??

టీమ్ఇండియా గెలుపోటములపై దాని పాత్ర ఎలా ఉందంటే..?

టీ20ల్లో సమీకరణాల్లో టాస్‌ లేకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే ఒక్క ఓవర్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తుంటుంది. ఇక వన్డేల్లోనూ దాదాపు అదే పరిస్థితి. కాస్త పోరాడితే సమీకరణాలు మారిపోతుంటాయి. కానీ, సుదీర్ఘ ఫార్మాట్‌లో టాసే అత్యంత కీలకం. అందులోనూ విదేశాల్లో పయనించే పర్యాటక జట్లకు టాస్‌ మీదే విజయాల అవకాశాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు! ఎందుకంటే టాస్‌ కోల్పోయి గెలవాలంటే వారికి కత్తి మీద సామే. అయితే ప్రస్తుతం కోహ్లీకి ఇదే పరిస్థితి ఎదురైతోంది. అతడి జైత్రయాత్రలో ప్రత్యర్థులపై గెలుపులన్నీ ఎక్కువగా టాస్‌తోనే ఆరంభమయ్యాయి. టాస్‌ కోల్పోయి మ్యాచ్‌ను చేజిక్కించుకున్నా అవి ఎక్కువగా భారత్‌లోనే. దీంతో ఒకవేళ రెండో టెస్టులోనూ టాస్ ఓడితే కివీస్‌ను టీమ్‌ఇండియా ఎలా ప్రతిఘటిస్తుంది? అసలు కివీస్‌లో విజయాలపై టాస్ ఎందుకు అంత ప్రభావం చూపిస్తుంది? అని అందరి మదిలోనూ ప్రశ్నలు మెదులుతున్నాయి.


మరోసారి రుజువైంది..
న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌కు ఊహించని పరాభవం. వన్డే సిరీస్‌లో ఒక్క గెలుపు లేకుండానే ముగించిన కోహ్లీసేన తొలి టెస్టులోనూ తేలిపోయింది. పోరాడేది ప్రపంచ నంబర్‌ వన్‌ టెస్టేనా అనిపించేలా చేతులెత్తేసింది. బ్యాట్స్‌మెన్‌ కనీసం రెండు ఇన్నింగ్స్‌లోనూ స్కోరుబోర్డును రెండు వందల మార్క్‌ను దాటించలేకపోయారు. కివీస్‌ టెయిలెండర్లను పెవిలియన్‌కు చేర్చడంలో బౌలర్లూ విఫలమయ్యారు. మొత్తంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్ఇండియా తొలి పరాజయాన్ని చవిచూసింది. అయితే మ్యాచ్‌ అనంతరం టాస్‌ ఎంతో కీలకమని కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆటగాళ్ల ప్రదర్శనను పక్కనబెడితే విదేశాల్లో టాస్‌ అనేది ఎంత కీలకమో మరోసారి రుజువైంది. గత పర్యటనల గణాంకాలను పరిశీలించినా పర్యాటక జట్లకు.. టాసే గెలుపులో ప్రధాన ఆయుధమని చెబుతున్నాయి.


టాస్ గెలిచాక సాధించిన విజయాలు.. 
సొంత మైదానాల్లో ఏ జట్టు అయినా ఎంతో ప్రమాదకరమే. అందులో భారత్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు అత్యంత ప్రమాదకరం. వాళ్ల ఇలాఖాలో వారిని ఓడించాలంటే పర్యాటక జట్లు చెమటోడ్చాల్సిందే. ఇక టాస్‌ ఓడి గెలవాలంటే అది దాదాపు భగీరథ ప్రయత్నమే. గణాంకాలు చూస్తే ఇది నిజమే అనక తప్పదు. స్వదేశంలో 2010 నుంచి ఆడిన టెస్టులను చూస్తే.. న్యూజిలాండ్‌ 17 మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచింది. దీనిలో 10 విజయాలు సాధించగా మిగిలినవన్నీ డ్రా చేసుకుంది. ఇక భారత్‌ 23 టెస్టుల్లో టాస్ గెలిచి 18 విజయాలు, రెండు ఓటములు సాధించాయి. అలానే ఆస్ట్రేలియా 29 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచి 21 విజయాలు, మూడు పరాజయాలను చవిచూశాయి. 


టాస్‌ ఓడినా..
న్యూజిలాండ్ వారి సొంతగడ్డపై టాస్‌ గెలిచిన తర్వాత పరాజయం పాలై దాదాపు దశాబ్దం దాటింది. చివరగా 2009లో ఓటమి చవిచూసింది. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అందులో ఆసీస్ గెలిచిన ఒక్క టెస్టులో కంగారూలదే టాస్‌. దీన్ని చూస్తేనే అర్థమై ఉంటుంది.. టాస్‌ ఎంత పనిచేస్తుందో. అయితే బలమైన భారత్, ఆసీస్‌, కివీస్‌ సొంతమైదానాల్లో టాస్ ఓడినా విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2010 నుంచి భారత్‌ 27 టెస్టుల్లో టాస్ ఓడినా 19 విజయాలు సాధించింది. కేవలం 2 మ్యాచ్‌లే ఓడింది. ఆసీస్‌ 27 మ్యాచ్‌ల్లో టాస్ కోల్పోయి 17 విజయాలు, ఆరు పరాజయాలు నమోదు చేసుకుంది. ఇక కివీస్‌ 24 టెస్టుల్లో టాస్‌ ఓడి 11 విజయాలు, 7 ఓటములు చవిచూసింది. ఇటీవల మౌంట్ మాంగనుయ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో కివీస్‌ టాస్ ఓడి కూడా విజయం సాధించింది. 


టాస్‌ ఎందుకు కీలకం?
అన్ని దేశాల్లో మైదానాలు ఒకలా ఉంటే, కివీస్‌లో భిన్నంగా ఉంటాయి. అంతేకాక అక్కడ వాతావరణ పరిస్థితులు పూర్తిగా భిన్నం. ఉదయం వేళలో గాలులు ఎక్కువగా వీస్తాయి. చలితో వీచే గాలులు ఆటగాళ్లను ఇబ్బంది పెడుతుంటాయి. దానితో పాటు నీలిమబ్బులు కమ్ముకుంటుంటాయి. ఆపైగా పిచ్‌ పచ్చికతో ఉంటుంది. దీంతో పేసర్లు సీమ్‌, స్వింగ్‌ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడతారు. ఎప్పటినుంచో అక్కడే ఆడుతున్న అనుభవంతో కివీస్‌ బౌలర్లు పర్యాటక జట్లపై ఆధిపత్యం చెలాయిస్తుంటారు. కానీ పర్యాటక బౌలర్లు అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకొని బంతుల్ని తెలివిగా సంధించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. దీంతో ఒత్తిడి అంతా పర్యాటక జట్టుపైనే ఉంటుంది. అందుకే విదేశాల్లో రాణించాలంటే టాస్ ఎంతో కీలకం. ముఖ్యంగా కివీస్‌లో అత్యంత కీలకం. ప్రతికూల పరిస్థితులను అధిగమించి నిలబడాలంటే పర్యాటక జట్లకు టాసే ఉపశమనం.


భారత్‌కు సారథిగా బాధ్యతలు వహించిన 54 టెస్టుల్లో కోహ్లీ 33 విజయాలు సాధించాడు. అందులో 21 మ్యాచ్‌లు టాస్‌ గెలిచినవే. విదేశాల్లో 10 టెస్టుల్లో టాస్‌ గెలవగా 8 విజయాలు అందుకున్నాడు. టాస్‌ గెలిచిన తర్వాత కోహ్లీ ఒక్క టెస్టు కూడా పరాజయాన్ని చవిచూడలేదు.

గతంలో డుప్లెసిస్‌ది అదే వేదన..!
2019, అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఆడిన మూడు టెస్టుల్లోనూ ఓటమి చవిచూసి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ పర్యటనలో సఫారీలు టీమ్‌ఇండియాకు అసలు పోటీయే ఇవ్వలేకపోయారు. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కోహ్లీసేన ఎంతో పటిష్ఠంగా ఉంటే, సఫారీ సేనకు అనుభవం కరవైంది. అంతేకాక అన్ని టెస్టుల్లో కోహ్లీనే టాస్‌ గెలిచాడు. దీంతో డుప్లెసిస్‌ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘టాస్​ అనేది లేకపోతే పర్యాటక జట్లకే విజయావకాశాలు ఎక్కువ. దక్షిణాఫ్రికాలో అయితే ఇరుజట్లకు పిచ్ ఒకేలా ఉంటుంది. కానీ భారత్‌లో ఆ పరిస్థితి లేదు. గొప్పగా ప్రారంభించినా తర్వాత కూడా ఒత్తిడికి లోనవుతున్నాం" అని అన్నాడు. 
ఇప్పడు అదే పరిస్థితి కోహ్లీకి ఎదురైతుందేమోనని భావిస్తున్నారంతా. అయితే రెండో టెస్టులో కోహ్లీ టాస్‌ గెలిస్తే భారత్‌ ఓటమి చవిచూడదని రికార్డులు చెబుతున్నాయి. కోహ్లీ సారథి బాధ్యతలు అందుకున్నాక టాస్‌ గెలిచిన ఒక్క టెస్టులోనూ టీమ్‌ఇండియా ఓటమి రుచిని చూడలేదు.  అంతేకాకుండా టాస్‌ ఓడినా ప్రతికూల పరిస్థితుల్లోనూ పుంజుకొని అద్భుతాలు సృష్టించడం కోహ్లీసేనకు అలవాటే. ఇక క్రెస్ట్‌చర్చ్‌లో భారత్‌ ఎలా పోరాడుతుందో తెలియాలంటే శనివారం వరకు ఎదురుచూడాల్సిందే!!

 - ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.