పరువు కోసం ఒకరు.. ప్రతీకారానికి ఒకరు
close

తాజా వార్తలు

Published : 27/10/2020 16:04 IST

పరువు కోసం ఒకరు.. ప్రతీకారానికి ఒకరు

నేడు దిల్లీతో తలపడనున్న వార్నర్‌ సేన

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 క్రికెట్‌ లీగ్‌ మరింత ఆసక్తికరంగా మారింది. పాయింట్ల పట్టికలో అడుగున పడిపోయిన జట్లు అదే పాయింట్ల పట్టికలో టాప్‌గేర్‌లో దూసుకెళుతున్న జట్లను కంగుతినిపిస్తుస్తున్నాయి. ఈరోజు కూడా అచ్చం అలాంటి మ్యాచ్‌ ఒకటి అభిమానులకు కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ఆడిన 11 మ్యాచుల్లో 7 గెలిచిన దిల్లీ.. 7మ్యాచులు ఓడిన హైదరాబాద్‌ మరోసారి తలపడనున్నాయి. దాదాపు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి వైదొలిగిన వార్నర్‌ సేన.. రేసులో ముందున్న దిల్లీని ఢీకొట్టనుంది. గత మ్యాచ్‌లో ఓడిన దిల్లీ వార్నర్‌ సేనపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుండగా.. హైదరాబాద్‌ మాత్రం మిగిలిన మ్యాచుల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. దుబాయ్‌ వేదికగా ఈ రోజు రాత్రి 7.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో దిల్లీ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో బెర్తు ఖరారు చేసుకున్నట్లే..

రికార్డులు..
ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 16 మ్యాచుల్లో తలపడ్డాయి.. అందులో హైదరాబాద్‌ 10 మ్యాచుల్లో విజయం సాధించింది. దిల్లీ కేవలం ఆరింట్లో గెలిచి వెనకబడిపోయింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌లోనూ దిల్లీ ఓడింది. 
ఈ మైదానంలో హైదరాబాద్‌ జట్టు 9 మ్యాచులాడింది. అందులో 5 విజయాలు 4 ఓటములు నమోదు చేసింది. 7 మ్యాచ్‌లాడిన దిల్లీ ఐదింట్లో గెలిచింది. రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. 

రహానే, పంత్‌.. ఇకనైనా..
దిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే కావాల్సి కేవలం 2 పాయింట్లే. ఈ మ్యాచ్‌లో గెలిస్తే దిల్లీకి ఒక బెర్తు ఖరారు అయినట్టే. అయితే.. సీజన్‌ ప్రారంభం నుంచి జైత్రయాత్ర చేసుకుంటూ వచ్చిన దిల్లీకి గత రెండు మ్యాచుల్లో ఓటమితో బ్రేక్‌ పడింది. బ్యాటింగ్‌లో ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. వాళ్లిద్దరిపైనే దిల్లీ బ్యాటింగ్‌ ఎక్కువగా ఆధారపడుతోంది. రహానే, రిషభ్‌ పంత్‌ తమ మార్క్‌ ఇన్నింగ్స్‌ ఆడలేకపోతున్నారు. వాళ్లిద్దరూ ఈ మ్యాచ్‌లోనైనా నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది. హెట్‌మెయిర్‌కు బ్యాటింగ్‌ అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో అతని మెరుపులు కనిపించడం లేదు. పేస్‌ దళంలో రబాడ, నోర్జ్‌ ప్రత్యర్థిని తిప్పలు పెడుతున్నారు. స్పిన్‌ విభాగంలో అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ గత మ్యాచుల్లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వాళ్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేయాల్సిన అవసరం ఉంది.

బ్యాటింగ్‌ వైఫల్యంతోనే ప్లేఆఫ్స్‌కు దూరం..
హైదరాబాద్‌ జట్టు ఈసారి అస్థిరత్వానికి మారుపేరుగా కనిపిస్తోంది. సులువుగా గెలవాల్సిన మ్యాచులను సైతం ప్రత్యర్థులకు అప్పగిస్తోంది. వెరసి ప్లేఆఫ్స్‌కు దాదాపుగా దూరమైంది. జట్టులో నిలకడగా రాణించే ఆటగాడు కనిపించడం లేదు. గత సీజన్లలో ప్రత్యర్థిని హడలెత్తించిన బెయిర్‌స్టో, వార్నర్‌ ఓపెనింగ్ జోడీ ఈసారి తేలిపోయిందనే చెప్పాలి. విలియమ్సన్‌ జట్టులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ మంచి ప్రదర్శన ఇస్తున్నప్పటికీ మ్యాచ్‌ ఫలితాన్ని మార్చలేకపోతున్నాడు. విజయ్‌శంకర్‌ సైతం మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. బౌలింగ్‌లోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పే ప్రదర్శన ఇంతవరకూ కనిపించలేదు. దిల్లీపై గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది వార్నర్‌సేనలో ఆత్మవిశ్వాసం నింపేదే. ప్లేఆఫ్స్‌కు చేరడం ఎలాగూ కష్టమే కాబట్టి. వార్నర్‌సేన స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచులో గెలిచి తమ పరువు నిలుపుకుంటారో లేదో వేచి చూడాలి. 

జట్లు (అంచనా)
హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్​), బెయిర్​స్టో, మనీశ్ పాండే, జేసన్ హోల్డర్, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, రషీద్‌ఖాన్, ఖలీల్ అహ్మద్, సందీప్‌శర్మ, నటరాజన్

దిల్లీ: శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్‌ పంత్, స్టాయినిస్, హెట్‌మెయిర్, అక్షర్ పటేల్, ఆర్‌.అశ్విన్, రబాడ, తుషార్ దేశ్ పాండే, నోర్జ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని