
తాజా వార్తలు
భారత ఆటగాళ్లకు ఐసీసీ జరిమానా
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకి ఐసీసీ జరిమానా విధించింది. ఇన్నింగ్స్ ముగించడానికి కోహ్లీసేన నాలుగు గంటల ఆరు నిమిషాల సమయాన్ని తీసుకోవడంతో మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు రాడ్ టకర్, సామ్, టీవీ అంపైర్ పాల్ రీఫెల్, ఫోర్త్ అంపైర్ గెరార్డ్ అబూద్ ఫిర్యాదు మేరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
‘‘ఐసీసీ ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దేశించిన సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ పొరపాటుని అంగీకరించడంతో దీనిపై విచారణ అవసరం లేదు’’ అని ఐసీసీ ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ కూడా మైదానంలో ఆట ఆలస్యంగా సాగిందని అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి ఇన్నింగ్స్లో మొదట కొంత మంది ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. దీనికి కొంత సమయం పట్టింది. నిర్దేశించిన సమయం కంటే భారత్ 45 నిమిషాలు ఎక్కువగా తీసుకుందనిపించింది’’ అని స్మిత్ అన్నాడు. కాగా, సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇదే మైదానంలో రెండో వన్డే ఆదివారం జరగనుంది.