రోహిత్, బుమ్రా లేకుండా సిరీస్‌ గెలిచాం: కోహ్లీ

తాజా వార్తలు

Published : 07/12/2020 01:05 IST

రోహిత్, బుమ్రా లేకుండా సిరీస్‌ గెలిచాం: కోహ్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లేకుండానే కంగారూల గడ్డపై టీ20 సిరీస్‌ గెలవడం సంతోషంగా ఉందని టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడాడు.

‘‘టీ20 క్రికెట్‌లో సమష్టిగా ఆడాం. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో మా ప్రధాన ఆటగాళ్లు రోహిత్‌, బుమ్రా లేకుండానే విజయం సాధించాం. ఇది సంతోషమైన విషయం. గొప్పగా ఆడుతున్న మా జట్టు పట్ల ఎంతో గర్వంగా ఉంది’’ అని కోహ్లీ తెలిపాడు. తొడకండరాల గాయం కారణంగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆసీస్‌ సుదీర్ఘ పర్యటనలో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉండటంతో బుమ్రాకు టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. గత కొన్నేళ్లుగా టీమిండియా సాధించిన విజయాల్లో రోహిత్, బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం విధితమే.

ఛేదనలో అజేయంగా 22 బంతుల్లో 42 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించిన హార్దిక్‌ పాండ్యను కోహ్లీ కొనియాడాడు. ‘‘ఎంతో శ్రమించి తన సామర్థ్యంతో హార్దిక్‌ 2016లో జట్టులోకి వచ్చాడు. అతడికి అపారమైన ప్రతిభ సొంతం. ఈ సమయం అతడిదేనని భావిస్తున్నాడు. వచ్చే 4-5 ఏళ్లలో అత్యంత విలువైన ప్లేయర్‌గా నిలుస్తాడు. ఏ స్థానంలో దిగినా జట్టును గెలిపిస్తాడు. అతడి ప్రణాళికలు గొప్పగా ఉన్నాయి. మ్యాచ్‌ ఫినిషర్‌గా జట్టుకు విజయాలు అందించాలనుకుంటున్నాడు. మనసు పెట్టి ఆడుతూ, పోటీలో నిలబడేలా, తన నైపుణ్యాన్ని పతాకస్థాయిలో ప్రదర్శిస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాపై సమష్టిగా పోరాడి విజయం సాధించామని కోహ్లీ తెలిపాడు. ‘‘ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో ప్రతిఒక్కరు 14 మ్యాచ్‌లు ఆడారు. కాబట్టి తమ ప్రణాళికలు ఏంటో వాళ్లకి తెలుసు. నటరాజన్‌ అద్భుతమైన బౌలర్‌. శార్దూల్ చక్కగా బౌలింగ్‌ చేస్తున్నాడు. హార్దిక్‌ గొప్పగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. శిఖర్‌ ధావన్‌ అర్ధశతకం సాధించాడు. ఇది జట్టు విజయం. ఒకవైపు తక్కువ బౌండరీ సరిహద్దు ఉన్న ఈ మైదానంలో భారీ లక్ష్యాన్ని ఛేదిస్తామని ముందే భావించాం. యువ ఆటగాళ్లు తమ అవకాశాలు సద్వినియోగం చేసుకున్నారు’’ అని విరాట్ వెల్లడించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా అయిదు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చదవండి

ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం

బంతి బంతికి ఉత్కంఠ.. మ్యాచ్ సాగిందిలా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని