
తాజా వార్తలు
క్లీన్‌స్వీప్ తప్పించుకుంటుందా?
కాన్బెర్రా వేదికగా రేపు భారత్×ఆసీస్ చివరి వన్డే
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా చేతిలో క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలన్నా, టీ20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమవ్వాలన్నా రేపటి వన్డేలో భారత్‌కు విజయం తప్పనిసరి. పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్, నాయకత్వంలో తడబాటుతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న టీమిండియా కాన్బెర్రా వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండా, మరోవైపు క్లీన్‌స్వీప్ చేయాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో నామమాత్రపు మ్యాచ్ అయినా రేపటి పోరుపై ఆసక్తి నెలకొంది.
వరుసగా 5 వన్డేల్లో ఓటమి
ఈ ఏడాది న్యూజిలాండ్ పర్యటనలో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. కరోనా కారణంగా తర్వాత జరగాల్సిన దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దైంది. ప్రస్తుత్తం జరగనున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2తో చేజార్చుకుంది. అయితే వరుసగా రెండు వన్డే సిరీస్‌లు క్లీన్‌స్వీప్ అయిన ఘోరపరాభవాన్ని తప్పించుకోవాలంటే రేపటి మ్యాచ్‌లో కోహ్లీసేన కచ్చితంగా గెలవాలి. కాగా, భారీ లక్ష్యాలతో బరిలోకి దిగిన టీమిండియా 66, 51 పరుగుల ఓటమి అంతరం కాస్త ఊరట కలిగిస్తున్నా బౌలింగ్, ఫీల్డింగ్ తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమి సత్తాచాటలేకపోవడం.. ఫీల్డర్లు మైదానంలో చురుకుగా కదలలేకపోవడం ప్రతికూలాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడి చేస్తారనేది ఆసక్తికరం!
నటరాజన్ రాకతో..
ప్రపంచ క్రికెట్లోనే మేటిగా నిలిచిన భారత బౌలింగ్ దళం గత రెండు వన్డేల్లో వరుసగా 374, 389 పరుగులు సమర్పించుకుంది. పేసర్ నవదీప్ సైని, స్పిన్నర్ చాహల్ ప్రదర్శన తీసికట్టుగా మారింది. సైని 17 ఓవర్లలో 153 పరుగులు ఇవ్వగా, చాహల్ 19 ఓవర్లలో 160 పరుగులతో ఒక్క వికెట్ సాధించాడు. దీంతో రేపటి మ్యాచ్‌లో సైని స్థానంలో నటరాజన్ జట్టులోకి రావడం ఖాయమనిపిస్తోంది. ఐపీఎల్లో యార్కర్లతో గొప్ప ప్రదర్శన చేసిన అతడు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. కట్టర్లతో పాటు పిచ్ అనుకూలిస్తే బంతిని స్వింగ్ చేస్తూ సవాళ్లు విసురుతాడు. అతడి రాకతో ఆసీస్ స్కోరును భారత్ కట్టడి చేయొచ్చు. షమి, బుమ్రా..ఇద్దరిలో ఒక్కరికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటే శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చాహల్×జంపా
అయితే ఆస్ట్రేలియా జట్టులో లెగ్ స్పిన్నర్ జంపా సిరీస్‌లో ఆరు వికెట్లతో సత్తా చాటుతుండగా చాహల్ మాత్రం విఫలమవుతున్నాడు. ధారాళంగా పరుగులు ఇవ్వడమేగాక వికెట్లు తీయలేకపోతున్నాడు. దీంతో చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి వస్తాడని అంచనా. అయితే వికెట్ టేకర్ అయిన చాహల్‌ను తుదిజట్టులో కొనసాగించే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు జడేజా ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నా వికెట్లు సాధించలేకపోతున్నాడు. ఇక ఆరో బౌలర్‌గా హార్దిక్ అందుబాటులో ఉండటంతో బౌలింగ్ వనరులు మెరుగయ్యాయి. అయితే హార్దిక్ బౌలింగ్ ఫిట్‌నెస్‌పై ఇంకా గందరగోళ పరిస్థితే నెలకొంది. బౌలింగ్ కోటా పూర్తిచేయలేని స్థితిలో అతడు ఉన్నాడు.
కోహ్లీపై ఒత్తిడి
బుమ్రాకు కొత్తబంతిని రెండు ఓవర్లకే పరిమితం చేయడం, సైనీని తుదిజట్టులో కొనసాగించడంపై కోహ్లీ కోప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. అంతేగాక స్మిత్, మాక్స్‌వెల్‌ను ఔట్ చేయడానికి ప్రత్యేక వ్యూహాలు రచించకపోవడం, వారికి తగ్గట్లుగా ఫీల్డర్లను మోహరించడంలో విరాట్ విజయవంతం కాలేకపోతున్నాడు. బ్యాటింగ్ పరంగానూ కోహ్లీపై ఒత్తిడి నెలకొంది. ఈ ఏడాది అతడు మూడంకెల స్కోరును ఒక్కసారి కూడా అందుకోలేకపోయాడు. ఛేదన రారాజుగా జట్టుకు ఎన్నో విజయాలు అందించిన అతడు భారీ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను గెలిపించాల్సి ఉంది. అతడితో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్ కూడా సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడితే టీమిండియా తిరిగి గెలుపుబాట పడుతుంది.
వార్నర్ దూరమవ్వడం సానుకూలాంశమే
ఫామ్‌లో ఉన్న వార్నర్ గాయంతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమవ్వడం టీమిండియాకు సానుకూలాంశం. ఫించ్‌తో కలిసి అతడు రెండు మ్యాచ్‌ల్లోనూ శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. కాగా, వార్నర్ స్థానంలో లబుషేన్ ఓపెనర్‌గా బరిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదిలోనే భారత్ వికెట్లు సాధిస్తే ఆసీస్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అయితే స్మిత్‌ను త్వరగా పెవిలియన్‌కు చేర్చితేనే ఆస్ట్రేలియా ఆత్మరక్షణ ధోరణీలో ఆడుతుంది. లేనిపక్షంలో మరోసారి పరుగుల వరద ఖాయం. అలాగే మాక్స్వెల్ దూకుడును అడ్డుకుంటే భారత్ పోటీలో నిలుస్తుంది. గత మ్యాచ్‌ల్లో మాక్స్వెల్ ఆడిన ఇన్నింగ్సే ఓటమి అంతరంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మిత్, మాక్స్‌వెల్‌ను తొందరగా పెవిలియన్‌కు చేర్చితే క్లీన్‌స్వీప్ నుంచి టీమిండియా తప్పించుకుంటుంది.
జట్ల వివరాలు
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, లబుషేన్, మాక్స్వెల్, స్టాయినిస్, అలెక్స్ కేరీ, కమిన్స్, మిచెల్ స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కామెరన్ గ్రీన్, హెన్రిక్స్, ఆండ్రూ టై, డేనియల్ సామ్స్, మాథ్యూ వేడ్