
తాజా వార్తలు
రోహిత్ లేకుంటేనేం? మయాంక్ ఉన్నాడుగా!
నాణ్యమైన ఆటగాడే ఉన్నాడన్న ఫించ్
సిడ్నీ: ఓపెనర్ రోహిత్‌శర్మ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులు టీమ్ఇండియాలో ఉన్నారని ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ అన్నాడు. యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. తమ జట్టు అన్ని విభాగాల్లో బాగుందని వెల్లడించాడు.
శుక్రవారం సిడ్నీ వేదికగా భారత్, ఆసీస్ మొదటి వన్డేలో తలపడుతున్నాయి. తొడ కండరాల గాయం వల్ల రోహిత్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దాంతో అతడు ఎన్సీఏలో సాధన చేస్తున్నాడు. ఇప్పటికీ మ్యాచ్ ఫిట్నెస్ సాధించకపోవడంతో తొలి రెండు టెస్టుల్లో ఆడించడం లేదని బీసీసీఐ ప్రకటించింది. కాగా ఆసీస్‌పై శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేస్తారని సమాచారం.
‘మయాంక్ మంచి ఆటగాడు. గతంలో మాపై విజయవంతమయ్యాడు. రోహిత్ గాయపడటం దురదృష్టకరం. గొప్ప ఆటగాళ్లపై ఆడాలనే అందరూ అనుకుంటారు. బహుశా అతడి స్థానంలో మయాంక్ ఆడతాడని అనుకుంటున్నా. గతంలో అతడు మాపై మంచి ఫామ్ ప్రదర్శించాడు. అనుభవజ్ఞుడు లేనప్పటికీ మరో నాణ్యమైన ఆటగాడే వస్తున్నాడు’ అని ఫించ్ అన్నాడు.
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీలో ఎక్కువగా పొరపాట్లేమీ కనిపించలేదని ఫించ్ చెప్పాడు. ‘అతడి బ్యాటింగ్‌లో మరీ లోపాలేమీ లేవు. అతడి రికార్డులు పరిశీలిస్తే ఒకటి అరా మాత్రమే కనిపిస్తాయి. విరాట్‌ను ఔట్ చేయాలంటే మేం కష్టపడక తప్పదు. ఎందుకంటే అతడు వన్డేల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు’ అని అన్నాడు. కాగా తమ జట్టు అన్ని విభాగాల్లో బాగుందని ఫించ్ అన్నాడు. మిచెల్ మార్ష్, మాక్స్వెల్, స్టాయినిస్ రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉండటంతో జట్టు కూర్పు సులభంగా ఉంటోందని వెల్లడించాడు. ఫామ్‌లో లేకపోవడంతో ఐపీఎల్లో ఆశించిన మేరకు రాణించలేదన్నాడు. ఈ సీజన్లో అతడు కోహ్లీ సారథ్యంలోని బెంగళూరుకు ఆడిన సంగతి తెలిసిందే.