కోహ్లీసేన జోరు కొనసాగించేనా?

తాజా వార్తలు

Updated : 05/12/2020 21:48 IST

కోహ్లీసేన జోరు కొనసాగించేనా?

రేపటి మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌దే టీ20 సిరీస్‌

ఇంటర్నెట్‌డెస్క్: అంతలోనే ఎంత మార్పు! వన్డే సిరీస్‌ కోల్పోయిన తర్వాత ఆస్ట్రేలియాపై కోహ్లీసేన బెబ్బులిలా చెలరేగుతోంది. మూడో వన్డే గెలిచి క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకొని తొలి టీ20లో విజయ ఢంకా మోగించింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లోనూ గెలిచి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్‌ చేజార్చుకోవద్దని, రేసులో నిలవాలని ఆసీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.

టెస్టు సిరీస్‌లో రెట్టింపు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలంటే టీమిండియాకు టీ20 సిరీస్‌ విజయం తప్పనిసరి. ప్రస్తుతం కోహ్లీసేన ప్రదర్శన గొప్పగానే సాగుతోంది. కాబట్టి పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ సొంతం చేసుకోవడం కష్టతరం కాదు. అంతేగాక గత పది టీ20ల్లో టీమిండియా ఆటతీరు బాగుంది. కానీ సూపర్‌ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరమవ్వడం, ఆటగాళ్లందరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం కాస్త కలవరపెడుతోంది.

కోహ్లీ చెలరేగితే..

కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన చాహల్ తొలి టీ20లో మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. జడేజా 23 బంతుల్లో సాధించిన 44 పరుగులు.. విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. అయితే జడ్డూ స్థానంలో చాహల్ తుదిజట్టులోకి వస్తే భారత్‌ ఓ బ్యాట్స్‌మన్‌ను కోల్పోతుంది. టాప్‌-5 బ్యాట్స్‌మన్‌ గొప్పగా రాణించి ప్రత్యర్థికి సవాలు విసిరితే మరో బ్యాట్స్‌మన్‌ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు. కానీ తొలి వన్డేలో అర్ధశతకం అనంతరం శిఖర్‌ ధావన్‌ సత్తాచాటలేకపోతున్నాడు. కోహ్లీ పరుగులు చేస్తున్నా అతడి నుంచి జట్టు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. విరాట్ విజృంభిస్తే జట్టుకు ఉన్న సగం కష్టాలు తొలగిపోతాయి.

అయితే రేపటి మ్యాచ్‌లో మనీష్‌ పాండే చోటుపై స్పష్టత లేదు. జంపా బౌలింగ్‌లో అతడు బంతులు ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. శ్రేయస్‌ అయ్యర్‌ కూడా కుదురుకోవడానికి సమయం తీసుకుంటాడు కాబట్టి పాండేకు మరో అవకాశం లభించవచ్చు. కాగా, చివరి ఆరు ఓవర్లలో సంజు శాంసన్‌, హార్దిక్‌ పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగడమే జట్టు వ్యూహం. కానీ గత అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో లభించిన అవకాశాల్ని శాంసన్‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే అతడు మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాలి.


షమి/బుమ్రా/శార్దూల్‌..?

ఇక నటరాజన్‌, చాహల్‌తో కూడిన బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. రొటేషన్‌ పద్ధతిలో షమికి విశ్రాంతినిచ్చి బుమ్రా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇద్దరికీ విశ్రాంతినివ్వాలని యాజమాన్యం యోచిస్తే శార్దూల్‌ ఠాకూర్‌ తుదిజట్టులోకి వస్తాడు. శార్దూల్‌ బ్యాట్‌తోనూ రాణించగలడు. దీపక్ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్ పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ‌ తమ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు.


మరోవైపు ఆస్ట్రేలియాలో కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తొలి టీ20లో మిగిలిన బ్యాట్స్‌మెన్‌ నుంచి సహకారం లభించలేదు. ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ మాక్స్‌వెల్‌ను ఆదిలోనే నటరాజన్ ఔట్‌ చేయడంతో ఆసీస్‌ ఛేదనలో చతికిలపడింది. కానీ ఆ జట్టులో విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌కు కొదవలేదు. ఇక బౌలింగ్‌లో జంపా సత్తా చాటుతున్నాడు. కాగా, స్వెప్సన్‌ స్థానంలో నాథన్ లైయన్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుందర్‌తో కోహ్లీ పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయించినట్లుగా లైయన్‌తో వేయించాలని ఆసీస్‌ భావిస్తోంది. అయితే ఫించ్‌ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. ఇప్పటికే వార్నర్ పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు దూరమయ్యాడు.


ఫామ్‌ పరంగా చూస్తే ఆడిన గత అయిదు టీ20ల్లోనూ భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచి మూడింట్లో ఓటమిపాలైంది.

పిచ్‌: బ్యాటింగ్‌కు అనుకూలం. తొలి రెండు వన్డేలు సిడ్నీ వేదికగానే జరిగాయి. ఆ మ్యాచ్‌ల్లో పరుగులు వరద పారింది.

తుదిజట్టు (అంచనా)

భారత్‌: శిఖర్‌ ధావన్‌, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సంజు శాంసన్‌, మనీష్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, బుమ్రా, చాహల్‌

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), మాథ్యూ వేడ్‌, స్టీవ్‌ స్మిత్‌, మాక్స్‌వెల్, హెన్రిక్స్‌, అలెక్స్‌ కేరీ, అబాట్‌, స్టార్క్‌, నాథన్‌ లైయన్‌, జంపా, హేజిల్‌వుడ్‌

ఇదీ చదవండి

గబ్బర్‌ చెలరేగాల్సిన సమయం ఇది

నాటి ఆసీస్‌ లాభం.. కోహ్లీసేనతో నష్టమైందా?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని