
తాజా వార్తలు
మారడోనా మృతిపై దర్యాప్తు ముమ్మరం
వ్యక్తిగత వైద్యుడి ఇల్లు, క్లినిక్‌లో పోలీసుల సోదాలు
బ్యూనోస్ ఏరీస్: ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. అయితే, మారడోనా మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో అర్జెంటీనా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా మారడోనాకు చికిత్స అందించడంలో ఆయన వ్యక్తిగత వైద్యుడి నిర్లక్ష్యం ఉందంటూ పలు సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మారడోనా వైద్యుడి ఇల్లు, క్లినిక్‌లలో అర్జెంటీనా పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే, విచారణలో పోలీసులకు సహకరిస్తున్నానని, మారడోనా చికిత్సకు సంబంధించి తనవద్ద ఉన్న అన్ని వైద్య రికార్డులతో పాటు కంప్యూటర్, సెల్ఫోన్లను పోలీసులకు అందజేసినట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు, న్యూరాలజిస్ట్ లియోపొల్డో ల్యూక్ వెల్లడించారు. మారడోనాకు సాధ్యమైనంత మేర మెరుగైన చికిత్స అందించానని విలపించారు.
తొలినుంచి ఆయనపైనే అనుమానాలు..
మారడోనా ఆకస్మిక మరణంపై ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర కలత చెందుతున్న సమయంలో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చికిత్సతో పాటు అత్యవసర సమయంలోనూ వ్యక్తిగత వైద్యులు సరిగ్గా స్పందించలేదని మారడోనా కుమార్తెలు ఇదివరకే ఆరోపించారు. ముఖ్యంగా ఆయనను ఆసుపత్రికి తరలించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అంబులెన్సు చేరుకునేందుకు అరగంటకు పైగా సమయం పట్టిందని..ఇది కచ్చితంగా మూర్ఖత్వమేనని మారడోనా తరపు న్యాయవాది అన్నారు. ఇలా మారడోనా మరణంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అర్జెంటీనా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా, మారడోనా కుటుంబ సభ్యులు, బందువుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారు.