అంటే.. ఏంటి నువ్వనేది: పఠాన్‌కు యువీ చురక

తాజా వార్తలు

Published : 23/07/2020 01:59 IST

అంటే.. ఏంటి నువ్వనేది: పఠాన్‌కు యువీ చురక

భయ్యా యువీ రిటైర్‌ అయ్యాడుగా.. నువ్వూ తక్కువేం కాదులే..

మ్యాచులు గెలిపించే ఆల్‌రౌండర్లపై సరదా సంభాషణ

ఎప్పుడైనా ఓ వ్యక్తి గుణగణాలను వర్ణించేటప్పుడు కొన్నిసార్లు అతిచేయడం చూస్తుంటాం. అంతకు మించిన వాడు లేడనో లేదా అలాంటి వ్యక్తి నాతో ఉంటే ప్రపంచాన్ని దున్నేస్తా అనో అంటుంటారు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ను ప్రశంసిస్తూ టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ సైతం ఇలాంటి‌ చిక్కుల్లోనే పడ్డాడు. అయితే సరదాగానే లెండీ!

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో వెస్టిండీస్‌ అద్భుత విజయం సాధించింది. దాంతో రెండో టెస్టులో ఆతిథ్య జట్టుకు గెలవక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచులో స్టోక్స్‌ అటు బ్యాటింగ్‌ ఇటు బౌలింగ్‌లో తన ప్రతాపం చూపించాడు. అద్భుత శతకం బాదేయడమే కాకుండా సమయోచితంగా వికెట్లు తీసి జట్టుకు విజయం అందించాడు. సిరీస్‌ను 1-1తో సమం చేశాడు. మూడో టెస్టును ఆసక్తికరంగా మార్చేశాడు.

అద్భుతంగా ఆడిన స్టోక్స్‌పై ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు కురిపించాడు. ‘మ్యాచులను గెలిపించగల బెన్‌స్టోక్స్‌ లాంటి ఆల్‌రౌండర్‌ ఉంటే టీమ్‌ఇండియా ప్రపంచంలో ఎక్కడైనా అజేయంగా మారగలదు’ అని ట్వీట్‌ చేశాడు. కానీ అంతలోనే టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ రంగంలోకి దిగాడు. ‘అంటే.. మ్యాచులు గెలిపించగల ఆల్‌రౌండర్‌ మనకు లేడనేనా నువ్వంటోంది?’ అని ప్రశ్నించాడు.

చిక్కుల్లో పడ్డట్టు కనిపించిన ఇర్ఫాన్‌ ఇక్కడే తెలివిగా ఆలోచించాడు. ‘సోదరా.. యువరాజ్‌ సింగ్‌ అధికారికంగా వీడ్కోలు పలికేశాడు’ అని చమత్కరించాడు. దాంతో యువీ ఊరుకుంటాడా ఏంటి. ‘నీ నుంచి ఇదే వస్తుందని నాకు తెలుసు (నవ్వుతున్న ఎమోజీ). నువ్వూ తక్కువేమీ కాదులే’ అని బదులిచ్చాడు. 2008 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లో యువరాజ్‌ ఎలాంటి పాత్ర పోషించాడో అందరికీ తెలిసిందే. ఇక ఇర్ఫాన్‌ సైతం అటు బ్యాటు, బంతితో దుమ్మురేపిన సందర్భాలెన్నో ఉన్నాయి.

-ఇంటర్‌నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని