కోహ్లీ ‘అర్థరహితం’ × పైన్‌ ‘వెనకడుగు వేయం’

తాజా వార్తలు

Published : 17/12/2020 01:38 IST

కోహ్లీ ‘అర్థరహితం’ × పైన్‌ ‘వెనకడుగు వేయం’

స్లెడ్జింగ్‌పై రెండు జట్ల సారథుల అభిప్రాయాలు

అడిలైడ్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభించిన 2020 ఎంతో మందికి భిన్నమైన పాఠాలు నేర్పించింది. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. స్లెడ్జింగ్‌ చేయడంలో అర్థం లేదని తాను గ్రహించానని తెలిపాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసులో అనవసర విషయాల వడపోత జరుగుతుందని పేర్కొన్నాడు. ఆట పరిస్థితులు డిమాండ్‌ చేస్తే మాత్రం కవ్వింపులకు వెనకాడబోమని ఆసీస్‌ సారథి టిమ్‌పైన్‌ చెప్పడం గమనార్హం.

‘గతంలో ఎంతో అవసరం అనుకున్నవి అంతగా ముఖ్యమైనవి కావని మహమ్మారి వల్ల ప్రజలు ఈ ఏడాది గ్రహించారు. జట్లు, ఆటగాళ్ల మధ్య కోపతాపాలు, పట్టింపులు, ఉద్రికత్తలు నిజంగా అర్థంలేనివి’ అని విరాట్‌ అన్నాడు. అయితే ప్రతిసారీ దూకుడుతో పనిలేదని అవసరమైతే మాత్రం తమ ఆటగాళ్లు వెనకడుగు వేయరని పైన్‌ బదులిచ్చాడు. ‘ఆట పరంగా మైదానంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఆటగాళ్లకు ఎదురెళ్లడం, అతి దూకుడును ప్రదర్శించడం వంటివి ముందుగానే ప్లాన్‌ చేయరు. మొదట మా నైపుణ్యంతో బంతి, బ్యాటుతో ప్రణాళికలు అమలు చేస్తాం. అయితే మైదానంలో కొన్నిసార్లు పరిస్థితులు వేడెక్కుతాయి. అలాంటప్పుడు మాత్రం మేం వెనకడుగు వేయం’ అని పైన్‌ అన్నాడు.

ఒకవేళ మైదానంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారినా వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని కోహ్లీ అన్నాడు. ‘ఆటలో ఎప్పుడైనా హుందాగానే ప్రవర్తించాలి. అవసరమైతే మైదానంలో దేహభాష సైతం  సానుకూలంగా, దూకుడుగా ఉండేలా చూసుకోవాలి. గతంలో జరిగినవన్నీ వ్యక్తిగతంగా తీసుకుంటారని అనుకోను. ఎందుకంటే ఆటలో నాణ్యత, పోటీని నిలబెట్టేందుకే అలా చేస్తాం. ఏదేమైనా ఆఖరికి అనవసర విషయాలను వడపోయాలి’ అని అతడు చెప్పాడు.

‘ ఐపీఎల్‌  విపరీతంగా ఆడటం వల్లే వడపోత సాధ్యమవుతోంది. కంగారూ ఆటగాళ్లు వారి ప్రవర్తన, వ్యవహార శైలిని ఎంతగానో మార్చుకుంటున్నారు. ముందుగా నేను చెప్పినట్టు ఈ ఏడాది క్రికెట్‌ మైదానంలోకి తిరిగి అడుగు పెట్టినందుకే ఎంతో సంతోషిస్తున్నారు. క్రికెట్‌ ఇలాగే పోటాపోటీగా ఉండాలి. నాణ్యత విషయంలో సర్దుకుపోవద్దు. ఎలాంటి ఆందోళన, ఒత్తిడి అవసరం లేదు. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఇప్పుడెవరూ వ్యక్తిగతంగా తీసుకోవడం లేదు’ అని కోహ్లీ అన్నాడు.

ఇవీ చదవండి
అడిలైడ్‌లో గులాబి వేట.. విజయానికి బాట
ముళ్లను దాటి ‘గులాబీ’ని ముద్దాడేనా? 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని