పంజాబ్‌కు కఠిన పరీక్ష..!
close

తాజా వార్తలు

Published : 18/10/2020 15:24 IST

పంజాబ్‌కు కఠిన పరీక్ష..!

నేడు ముంబయితో రాహుల్‌ సేన ఢీ

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబయిని ఢీకొట్టేందుకు పంజాబ్‌ సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం దిల్లీతో రోహిత్‌సేన దాగుడుమూతలు ఆడుతోంది. మరోసారి పంజాబ్‌ను చిత్తుచేసి అగ్రస్థానానికి ఎగబాకాలని చూస్తోంది. మరోవైపు చివరి స్థానంలో ఉన్న పంజాబ్‌ గత మ్యాచ్‌ గెలుపుతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను కాపాడుకుంది. ఈ రెండు జట్లు నేడు రాత్రి దుబాయ్‌ వేదికగా పోరుకు సిద్ధమయ్యాయి. రాత్రి 7.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాలు, బలహీనతలేంటో చూసేద్దాం.

రికార్డుల్లో ఎవరిది పైచేయి..?

ఇప్పటి వరకూ ఈ రెండు జట్ల మధ్య జరిగిన 25 మ్యాచుల్లో ముంబయి 14 విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ పంజాబ్‌ మీద రోహిత్‌సేనదే పైచేయి. దబాయ్‌ వేదికగా ముంబయి జట్టు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచింది. ఒకదాంట్లో ఓడింది. పంజాబ్‌ ఐదు మ్యాచ్‌లాడి రెండింట్లో గెలిచి మూడింట్లో ఓటమిపాలైంది.

తీరిక లేని ముంబయి ఆటగాళ్లు..
ఎప్పటిలాగే ముంబయి ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్నారు. గత మ్యాచ్‌లో ప్యాటిన్సన్‌కు విశ్రాంతి ఇచ్చి కౌల్టర్‌నైల్‌ను తీసుకొచ్చాడు రోహిత్‌. ఈ మ్యాచ్‌లోను ముంబయి జట్టు మార్పులు చేయవచ్చు. జట్టులో తీరిక లేకుండా వరుస మ్యాచ్‌లాడుతున్న ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ముంబయి జట్టులో ఇంతవరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాని ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ముంబయి ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించింది. రన్‌రేట్‌ అన్ని జట్లకంటే మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే దిల్లీని వెనక్కి నెట్టి మరోసారి అగ్రస్థానానికి ఎగబాకుతుంది. పంజాబ్‌ ఓపెనర్లపై దృష్టి పెట్టి త్వరగా వాళ్లను పెవిలియన్‌కు పంపిస్తే ముంబయికి మరో విజయం కష్టమేం కాదు. అయితే.. ఏమాత్రం అజాగ్రత్తగా ఆడినా పంజాబ్‌ చేతిలో ఓటమి పాలయ్యే అవకాశాలూ లేకపోలేదు.

గేల్‌ మరోసారి..
పంజాబ్‌ జట్టు గేల్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. వరుస ఓటములతో ఢీలాపడ్డ ఆ జట్టును వచ్చీరావడంతోనే ఓ భారీ ఇన్నింగ్స్‌ ఆడి విజయం అందించాడు. బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ ఒక్కడు తన ఫామ్‌ అందుకుంటే పంజాబ్‌కు భారీ స్కోరు సులభమే. రాహుల్‌ సేనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య బౌలింగ్‌. షమికి తోడు నాణ్యమైన ఫాస్ట్‌బౌలర్‌ లేకపోవడం ఆ జట్టు నుంచి విజయాలను దూరం చేస్తోంది. గెలుపు కీలకమైన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ముంబయిని చిత్తు చేయాలంటే సమష్టిగా రాణించడం అత్యవసరం. అయితే.. ముంబయి పాయింట్ల పట్టికలోపై స్థానంలో ఉండటం పంజాబ్‌కు కలిసొచ్చే అంశం. ఒకవేళ టాస్‌ గెలిస్తే పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ ఛేదనకు మొగ్గు చూపే అవకాశం ఉంది.

జట్లు (అంచనా)
ముంబయి: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కృనాల్ పాండ్యా, కౌల్టర్ నైల్‌, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా.

పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్‌ గేల్, పూరన్, మ్యాక్స్‌వెల్‌, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, క్రిష్ణప్ప గౌతమ్‌, షమి, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని