close
Array ( ) 1

తాజా వార్తలు

ఐసీసీ టోర్నీల్లో భారత్‌కు దడపుట్టిస్తున్న కివీస్‌

2007 నుంచి 2020 దాకా..

ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్‌ఇండియా వరుస విజయాలకు ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతున్న జట్టు న్యూజిలాండ్‌. 2007 టీ20 ప్రపంచకప్‌ నుంచి తాజా వెల్లింగ్టన్‌ టెస్టు వరకు భారత్‌తో తలపడిన నాలుగు ఐసీసీ ఈవెంట్‌లలో కివీస్‌దే పైచేయి. ఈ నేపథ్యంలోనే భారత్‌.. రెండు టీ20 ప్రపంచకప్‌లలో ఓటమి పాలవ్వడంతోపాటు, 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఓటమి చవిచూసింది. దీంతో న్యూజిలాండ్‌ గత నాలుగు మెగా ఈవెంట్లలో భారత్‌ను మట్టికరిపించి ప్రధాన శత్రువుగా మారింది. చివరిసారి ఐసీసీ ఈవెంట్‌లో భారత్‌.. కివీస్‌ను ఓడించింది అంటే.. అది 2003 ప్రపంచకప్‌లోనే.


సెహ్వాగ్‌, గంభీర్‌ శుభారంభం చేసినా..

2007 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను ఓడించిన ఒకే ఒక జట్టు న్యూజిలాండ్‌. లీగ్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 190 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం టీమ్‌ఇండియా ఓపెనర్లు సెహ్వాగ్‌(40), గంభీర్‌(51) శుభారంభం చేసినా తర్వాతి బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. డానియల్‌ వెటోరీ 4 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయడంతో భారత్‌ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.  


79 పరుగులకే ఆలౌటైన టీమ్‌ఇండియా

2016 టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా కొనసాగుతున్న వేళ కివీస్‌తో తలపడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ఆ జట్టును 126/7 స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. ఈ స్కోరు చూసి భారత్‌ సునాయాస విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. అయితే, కివీస్‌ బౌలర్లు మాయ చేయడంతో టీమ్‌ఇండియా మరీ దారుణంగా 79 పరుగులకే ఆలౌటైంది. మిచెల్‌ శాంట్నర్‌(4), ఇష్‌ సోది(3), నాథన్‌ మెక్‌కలమ్‌(2) అద్భుతంగా రాణించారు. 


జడేజా, ధోనీ గెలిపించినంత పనిచేశారు..

ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా టైటిల్‌ ఫేవరెట్‌ జట్లలో ఒకటి. వరుస విజయాలతో దూసుకుపోయిన కోహ్లీసేన చాలా తేలికగా ఫైనల్‌ చేరుకునేలా కనిపించింది. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. అప్పటికే రోహిత్‌, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ అద్భుత ఫామ్‌లో ఉండడంతో భారత విజయం లాంఛనమే అనుకున్నారు. అనూహ్యంగా వర్షం కురిసి మ్యాచ్‌ రెండో రోజుకు వాయిదా పడింది. అనంతరం న్యూజిలాండ్‌ బౌలర్లు సమష్టిగా రాణించి భారత టాప్‌ ఆర్డర్‌ను కకావికలం చేశారు. తర్వాత జడేజా(77), ధోనీ(50) మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేసినా.. చివర్లో కివీస్‌ పుంజుకొని విజయం సాధించింది.


టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొలి ఓటమి..

తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఆది నుంచే తడబడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 165 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్‌ 348 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 191 పరుగులకు ఆలౌటవ్వడంతో కివీస్‌ విజయానికి తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఆ జట్టు పది వికెట్ల తేడాతో గెలుపొంది టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి ఓటమి రుచి చూపించింది. ఇలా ఐసీసీ టోర్నీ అంటే చాలు.. న్యూజిలాండ్‌ భారత్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది. 

-ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.