పరుగులు, వికెట్లు తీయడం సక్సెస్‌ కాదు 

తాజా వార్తలు

Published : 25/07/2020 17:16 IST

పరుగులు, వికెట్లు తీయడం సక్సెస్‌ కాదు 

దాని అర్థం చెప్పిన రాహుల్‌ ద్రవిడ్‌

 సక్సెస్‌ అంటే పరుగులు తీయడం వికెట్లు పడగొట్టడం కాదని, మనం చేసే పనిలో ఉత్తమంగా ఉండడమేనని టీమ్ఇండియా మాజీ సారథి, ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. తాజాగా భారత మహిళా జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌తో ఆన్‌లైన్‌లో ముచ్చటించిన అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన వ్యక్తిత్వం గురించి, పట్టుదల గురించి అనేక విషయాలు పంచుకున్నాడు. చిన్నప్పటి నుంచే తాను ఇంట్రోవర్ట్‌ అని, ఏది చేసినా అంకితభావంతో చేసేవాడినని చెప్పాడు. అలాగే తన అనుభవపూర్వకంగా చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు.  2000 సంవత్సరంలో తాను ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడానని, అక్కడి విషయాలు అర్థం చేసుకున్నాక తన కెరీర్‌ మరింత మెరుగైందని చెప్పాడు. తర్వాత ఏడెనిమిదేళ్లు టీమ్‌ఇండియాలో అత్యుత్తమంగా రాణించినట్లు చెప్పాడు. 

అనంతరం సక్సెస్‌ గురించి మాట్లాడిన ద్రవిడ్‌ మనం చేసే పనిలో ఉత్తమంగా ఉండడమే విజయమని స్పష్టం చేశాడు. ‘నా విషయంలో సక్సెస్‌ అంటే వికెట్లు తీయడం, పరుగులు చేయడం కాదు. కొద్ది కాలం గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే నేను మంచి షాట్‌ ఆడానా లేదా, నా శక్తివంచన లేకుండా కృషి చేశానా లేదా అనే విషయాలే గుర్తుకు రావాలి. ఒక ఆటగాడు ఒక్కోసారి ఎక్కువ మ్యాచ్‌లు ఆడొచ్చు. ఒక్కోసారి తక్కువ ఆడొచ్చు. అలా కాకపోయినా జీవితంలో ఏది చేస్తున్నా అదృష్టం ఉండాలి. అలా ఉంటే అన్నీ కలిసిసొస్తాయి. దాన్నెవరూ తప్పించుకోలేరు. అలాగే ఇతరులతో పోల్చుకోవడం సరికాదు. అంతిమంగా అది మన జీవితం, అందుకే ఉన్నదాంట్లో అత్యుత్తమంగా ఉండాలి’ అని పేర్కొన్నాడు.  

క్రికెట్‌లో ఎవరైనా విజయవంతం కావడం కంటే ఎక్కువ వైఫల్యం చెందుతారని, ముఖ్యంగా బ్యాటింగ్‌ విషయంలో చాలా సార్లు తక్కువ పరుగులకే ఔటౌతారని ద్రవిడ్‌ అన్నాడు. అలాగే 50 పరుగులను సక్సెస్‌ పాయింట్‌గా పెట్టుకుంటే ఏ క్రికెటర్‌ కూడా ఎక్కువ సార్లు అన్ని పరుగులు చేయలేడని చెప్పాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరైనా 50 సగటు కలిగి ఉంటే వారు అత్యధిక సార్లు విఫలమై ఉంటారని విశ్లేషించాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని