close

తాజా వార్తలు

Updated : 29/09/2020 19:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిక్సర్ల మోత మోగించిన రాజస్థాన్‌

లీగ్‌ చరిత్రలోనే అత్యధిక లక్ష్య ఛేదన
పంజాబ్‌పై రాజస్థాన్‌ ఘన విజయం..
ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు బాదిన రాహుల్‌ తివాతియా

షార్జా: పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ 6 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టోర్నీ చరిత్రలోనే ఈ జట్టు అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కొత్త రికార్డు నెలకొల్పింది. ఆదిలోనే బట్లర్‌(4) విఫలమైనా సంజూ శాంసన్‌(85; 42 బంతుల్లో 4x4, 7x6), స్టీవ్‌స్మిత్‌(50; 27 బంతుల్లో 7x4, 2x6) చెలరేగి ఆడారు. వీరిద్దరూ పంజాబ్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసి ఓవర్‌కు పది పరుగుల చొప్పున రాబట్టారు. దీంతో రాజస్థాన్‌ 9 ఓవర్లకే 100 పరుగులు చేరింది. అయితే, నీషమ్‌ వేసిన అదే ఓవర్‌ చివరి బంతికి అప్పుడే అర్ధశతకం సాధించిన స్మిత్‌ భారీషాట్‌ ఆడబోయి షమి చేతికి చిక్కాడు. దీంతో రాజస్థాన్‌ కీలక సమయంలో ప్రధాన వికెట్‌ కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్‌ తివాతియా(53; 31 బంతుల్లో 7x6) తొలుత పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. తాను ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేశాడు. ఇక పరిస్థితి చేయి దాటిపోతున్న వేళ సంజూ విజృంభించి ఆడాడు. ఈ క్రమంలోనే అతడు శతకానికి చేరువైన సమయంలో షమి వేసిన 17వ ఓవర్‌ తొలి బంతికి ఓ భారీ షాట్‌ ఆడి ఔటయ్యాడు. దీంతో పంజాబ్‌ గెలుపు ఖాయమని అంతా భావించారు. 

ఇక రాజస్థాన్‌ విజయానికి 3 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సిన స్థితిలో తివాతియా అనూహ్యంగా చెలరేగిపోయాడు. అప్పటివరకు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన తివాతియా..  షెల్డన్‌ కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్‌లో మొత్తం 5 సిక్సులు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. తర్వాతి ఓవర్‌లోనూ జోఫ్రా ఆర్చర్‌(13; 3 బంతుల్లో 2x6), రాహుల్‌ మూడు సిక్సర్లు బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. అలా రాజస్థాన్‌ ఆ రెండు ఓవర్లలోనే 49 పరుగులు సాధించి విజయానికి చేరువైంది. చివరి ఓవర్‌లో తివాతియా ఔటైనా టామ్‌ కరన్‌(4) వచ్చీరాగానే బౌండరీ బాది అతిగొప్ప విజయాన్ని అందించాడు. పంజాబ్‌ బౌలర్లలో షమి మూడు వికెట్లు తీయగా.. కాట్రెల్‌, నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. కాగా, రాజస్థాన్‌ చివరి 27 బంతుల్లో 86 పరుగులు చేసింది. ఇది కూడా టోర్నీ చరిత్రలో ఒక రికార్డు కావడం విశేషం.
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌(106; 50 బంతుల్లో 10x4, 7x6), కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(69; 54 బంతుల్లో 7x4, 1x6) ఆది నుంచీ బౌండరీలతో అలరించారు. దీంతో వీరిద్దరూ తొలి వికెట్‌కు పంజాబ్‌ తరఫున అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యంగా 183 పరుగులు జోడించారు. శతకం బాది జోరు మీదున్న మయాంక్‌ 16.3 ఓవర్‌లో టామ్‌కరన్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి కీపర్‌ సంజూ శాంసన్‌ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్‌ చివరి బంతికి రాహుల్‌.. అంకిత్‌ రాజ్‌పుత్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి బౌండరీ వద్ద శ్రేయస్‌ గోపాల్‌ చేతికి చిక్కాడు. దీంతో పంజాబ్‌ 194 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఇక చివర్లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌(13; 9 బంతుల్లో 2x4), నికోలస్‌ పూరన్‌(25; 8 బంతుల్లో 1x4, 3x6) మెరుపు బ్యాటింగ్‌ చేయడంతో పంజాబ్‌.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.