close

తాజా వార్తలు

Updated : 20/10/2020 06:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెన్నై ఇంటికే!

ఖాతాలో ఏడో పరాజయం
చెలరేగిన బట్లర్‌
రాజస్థాన్‌ విజయం

చెన్నై ఇక ఇంటికే..! ఐపీఎల్‌ ఆడిన ప్రతీసారి ప్లేఆఫ్స్‌/సెమీస్‌ చేరిన ఆ జట్టు.. ఈసారి కనీసం రేసులో కూడా లేనట్లే. లీగ్‌ దశలో ఇంకో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సివున్న చెన్నై మరో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సోమవారం రాజస్థాన్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.  చెత్త బ్యాటింగ్‌తో చేతులెత్తేసిన ఆ జట్టు టోర్నీలో ఏడో పరాజయాన్ని చవిచూసింది.  ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో రాజస్థాన్‌ నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

అబుదాబి

రాజస్థాన్‌ అదరగొట్టింది. సోమవారం 7 వికెట్ల తేడాతో చెన్నైని మట్టికరిపించింది. గోపాల్‌ (1/14), తెవాతియా (1/18), ఆర్చర్‌ (1/20) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట చెన్నై 5 వికెట్లకు 125 పరుగులే చేయగలిగింది. జడేజా (35 నాటౌట్‌; 30 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌. ఈ ఐపీఎల్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన జట్టు చేసిన అత్యల్ప స్కోరిదే. బట్లర్‌ (70 నాటౌట్‌; 48 బంతుల్లో 7×4, 2×6) చెలరేగడంతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

బట్లర్‌ దూకుడు: తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించినా ఆరంభంలో చెన్నై పోరాడింది. దీపక్‌ చాహర్‌ (2/18) చక్కని బౌలింగ్‌తో 5 ఓవర్లలో 28 పరుగులకే 3 వికెట్లు (స్టోక్స్‌, ఉతప్ప, శాంసన్‌) పడగొట్టి గట్టి పోటీ ఇస్తున్నట్లే కనిపించింది. 8 ఓవర్లకు స్కోరు 43/3. కానీ అప్పటి దాకా జాగ్రత్తగా ఆడిన బట్లర్‌ గేర్‌ మార్చి.. మ్యాచ్‌ గమనాన్నే మార్చేశాడు. స్మిత్‌ (26 నాటౌట్‌; 34 బంతుల్లో 2×4) అండగా నిలవగా ధనాధన్‌ షాట్లతో చెలరేగాడు. పదో ఓవర్లో శార్దూల్‌ బౌలింగ్‌కు దిగాక రాజస్థాన్‌పై ఉన్న కాస్త ఒత్తిడి తొలగింది. ఆ ఓవర్లో ఓ ఫోర్‌ కొట్టిన బట్లర్‌.. అతడి తర్వాతి ఓవర్లో వరుసగా 4, 6 సాధించాడు. రాజస్థాన్‌ స్పిన్నర్లు మాయ చేసిన అదే పిచ్‌పై చెన్నై స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 15వ ఓవర్లో పియూష్‌ చావ్లా బౌలింగ్‌లో బట్లర్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. చావ్లా తర్వాతి ఓవర్లో స్మిత్‌ ఓ ఫోర్‌, బట్లర్‌ ఓ సిక్స్‌ బాదడంతో రాజస్థాన్‌ 124/3తో నిలిచింది. ఆ తర్వాత ఆ జట్టు విజయం లాంఛనమే.
చెమటోడ్చిన చెన్నై:  మొదట ఇన్నింగ్స్‌ ఆసాంతం చెన్నైకి అవస్థలే. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు పరుగుల కోసం చెమటోడ్చింది. బౌండరీ అన్నది అరుదైన విషయమైపోయింది. ఏ దశలోనూ ఇన్నింగ్స్‌ ఊపందుకోలేదు. ఆద్యంతం చప్పగా సాగింది. ఏ ఒక్క బ్యాట్స్‌మనూ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయాడు. జడేజా కాస్త బ్యాట్‌ ఝుళిపించకుంటే ఆ మాత్రం స్కోరైనా సాధ్యమయ్యేది కాదు. చెన్నై ఆరంభమే పేలవం. డుప్లెసిస్‌, వాట్సన్‌లను కోల్పోయి 6 ఓవర్లకు 43 మాత్రమే చేసింది. కానీ స్పిన్నర్ల రాకతో ఆ ఆరంభమే మెరుగ్గా కనిపించింది. స్పిన్‌ బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం బ్యాట్స్‌మెన్‌కు గగనమే అయింది. ఏకబికిన ఏడు ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసిన గోపాల్‌, తెవాతియా బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం స్వేచ్ఛనివ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కళ్లెం వేశారు. ఏడు నుంచి 13 ఓవర్ల మధ్య కేవలం 28 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు. భారీ షాట్‌ ఆడే యత్నంలో కరన్‌ (22; 25 బంతుల్లో 1×4, 1×6) క్యాచ్‌ ఔట్‌ కాగా.. సాధికారికంగా ఆడలేకపోయిన రాయుడు (13; 19 బంతుల్లో 2×4) జీవనదానాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయాడు. జడేజాతో కలిసి ధోని (28; 28 బంతుల్లో 2×4) 51 పరుగులు జోడించాడు కానీ.. ఆ బ్యాటింగ్‌లో వేగం లేదు. భారీ షాట్లు లేవు. ధోని 18వ ఓవర్లో రనౌటయ్యాడు.
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సామ్‌ కరన్‌ (సి) బట్లర్‌ (బి) గోపాల్‌ 22; డుప్లెసిస్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 10; వాట్సన్‌ (సి) తెవాతియా (బి) కార్తీక్‌ త్యాగి 8; రాయుడు (సి) శాంసన్‌ (బి)  తెవాతియా 13; ధోని రనౌట్‌ 28; జడేజా నాటౌట్‌ 35; జాదవ్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 125; వికెట్ల పతనం: 1-13, 2-26, 3-53, 4-56, 5-107; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-20-1; రాజ్‌పుత్‌ 1-0-8-0; త్యాగి 4-0-35-1; స్టోక్స్‌ 3-0-27-0; శ్రేయస్‌ గోపాల్‌ 4-0-14-1; తెవాతియా 4-0-18-1
రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: స్టోక్స్‌ (బి) దీపక్‌ చాహర్‌ 19; ఉతప్ప (సి) ధోని (బి) హేజిల్‌వుడ్‌ 4; శాంసన్‌ (సి) ధోని (బి) చాహర్‌ 0; స్మిత్‌ నాటౌట్‌ 26; బట్లర్‌ నాటౌట్‌ 70; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 126; వికెట్ల పతనం: 1-26, 2-28, 3-28;    బౌలింగ్‌: దీపక్‌  4-1-18-2;  హేజిల్‌వుడ్‌  4-0-19-1; జడేజా  1.3-0-11-0; శార్దూల్‌ 4-0-34-0; కరన్‌ 1-0-6-0; చావ్లా 3-0-32-0

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.