close

తాజా వార్తలు

Updated : 30/10/2020 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెన్నై కొట్టింది దెబ్బ

కోల్‌కతాకు చెక్‌
ప్లేఆఫ్‌కు ముంబయి

ఇప్పటికే ఐపీఎల్‌-13 ప్లేఆఫ్‌ రేసుకు దూరమైన చెన్నై సూపర్‌కింగ్స్‌.. వెళ్తూ వెళ్తూ ప్లేఆఫ్‌ రేసులో ఉన్న జట్లకు షాకిస్తోంది. గత మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును అలవోకగా ఓడించిన సీఎస్‌కే.. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెక్‌ పెట్టింది. రుతురాజ్‌ మరోసారి చక్కటి ఇన్నింగ్స్‌ ఆడగా, ఆఖర్లో జడేజా మెరవడంతో ఆ జట్టు నైట్‌రైడర్స్‌పై గెలిచి వరుసగా రెండో విజయాన్ని దక్కించుకుంది. చెన్నై చేతిలో కోల్‌కతా ఓటమితో నాలుగు జట్లకు మించి ఎనిమిది విజయాలు సాధించే అవకాశాలు లేకపోవడంతో.. ఇప్పటికే 8 మ్యాచ్‌లు నెగ్గిన ముంబయి ఇండియన్స్‌ ప్లేఆఫ్‌ చేరింది. 6 విజయాలతో ఉన్న కోల్‌కతా.. చివరి మ్యాచ్‌లో నెగ్గినా, నెట్‌రన్‌రేట్‌లో బాగా వెనుకబడి ఉన్న నేపథ్యంలో ముందంజ వేయడం కష్టమే.

దుబాయ్‌

ఐపీఎల్‌ ప్లేఆఫ్‌కు దూరమయ్యాక, నామమాత్రపు మ్యాచ్‌ల్లో చెన్నై చెలరేగుతోంది. ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. గురువారం ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన చెన్నై.. 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. గురువారం మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (87; 61 బంతుల్లో 10×4, 4×6) టాప్‌ స్కోరర్‌. రుతురాజ్‌ గైక్వాడ్‌ (72; 53 బంతుల్లో 6×4, 2×6), రాయుడు (38; 20 బంతుల్లో 5×4, 1×6), జడేజా (31 నాటౌట్‌; 11 బంతుల్లో 2×4, 3×6) మెరుపులతో లక్ష్యాన్ని చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మొదట రుతురాజ్‌.. ఆఖర్లో జడేజా: ఛేదనలో చెన్నై ధాటిగా ఆడకపోయినా.. మరీ వెనకబడిపోలేదు. అందుక్కారణం ఓపెనర్‌ రుతురాజ్‌. డుప్లెసిస్‌ స్థానంలో ఈ మ్యాచ్‌ ఆడిన మరో ఓపెనర్‌ వాట్సన్‌ (14)తో కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించిన రుతురాజ్‌.. అతను ఔటయ్యాక రాయుడితో కలిసి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. వాట్సన్‌ ఔటయ్యేంత వరకు ఓ మోస్తరుగా ఉన్న స్కోరు వేగం ఆ తర్వాత పుంజుకుంది. ఈ జోడీ జోరుతో సీఎస్‌కే 13 ఓవర్లలో 109/1తో నిలిచింది. ఈ క్రమంలోనే రుతురాజ్‌ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ రెండు ఓవర్ల తేడాతో రాయుడు, కెప్టెన్‌ ధోని (1) వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. 15 ఓవర్లకు 121/3తో ఇబ్బందుల్లో పడిపోయింది. కానీ రుతురాజ్‌ క్రీజులో ఉండడంతో ఆ చెన్నై శిబిరంలో ఇంకా ఆశలు కనిపించాయి. 3 ఓవర్లలో 34 పరుగులు చేయాల్సిన స్థితిలో.. కమిన్స్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌ బౌల్డ్‌ కావడంతో చెన్నైకి కష్టమే అనిపించింది. కానీ 2 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో జడేజా అసాధారణంగా చెలరేగిపోయాడు. అతని ధాటికి 19వ ఓవర్లో 20 పరుగులు రావడంతో చివరి ఓవర్లో 10 పరుగులే చేయాల్సి వచ్చింది. నాగర్‌కోటి వేసిన ఆ ఓవర్లో.. తొలి నాలుగు బంతులకు మూడే పరుగులు రావడంతో మళ్లీ ఉత్కంఠ నెలకొన్నా.. ఆఖరి రెండు బంతులను సిక్స్‌లుగా బాదిన జడేజా.. చెన్నైకి విజయాన్ని అందించాడు.
నడిపించిన రాణా: కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఆటంతా ఓపెనర్‌ నితీశ్‌ రాణాదే. ఆరంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్‌ చేసిన ఈ లెఫ్ట్‌హ్యాండర్‌.. ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. అతనికి శుభ్‌మన్‌ (26; 17 బంతుల్లో 4×4) నుంచి చక్కని సహకారం లభించడంతో పవర్‌ ప్లే ఆఖరికి కోల్‌కతా 48/0తో నిలిచింది. శుభ్‌మన్‌ ఔటైనా నితీష్‌ జోరు మాత్రం తగ్గించలేదు. కట్‌ షాట్లు, స్లాగ్‌ స్వీప్‌లతో పరుగులు రాబట్టాడు. కానీ రాణా ఒకవైపు ధాటిగా ఆడుతున్నా మరోవైపు నుంచి వికెట్లు పడగొట్టిన చెన్నై.. పరుగుల వేగానికి అడ్డుకట్ట వేసింది. ఈ క్రమంలోనే నరైన్‌ (7), రింకూసింగ్‌ (11) వెనుదిరిగారు. 15 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 106 పరుగులే. ఈ స్థితిలో కర్ణ్‌శర్మ బౌలింగ్‌లో హ్యాటిక్‌ సిక్స్‌లు బాదిన రాణా.. స్కోరింగ్‌ రేటు పెంచాడు. సెంచరీ చేసేలా కనిపించిన అతను ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడే క్రమంలో ఔటయ్యాడు. అప్పటికి స్కోరు 17.1 ఓవర్లలో 137 పరుగులే. ఈ స్థితిలో కెప్టెన్‌ మోర్గాన్‌ (15) జతగా ధాటిగా ఆడిన కార్తీక్‌ (21 నాటౌట్‌; 10 బంతుల్లో 3×4) జట్టుకు పోరాడే స్కోరు సాధించిపెట్టాడు. చివరి అయిదు ఓవర్లలో కోల్‌కతా 66 పరుగులు రాబట్టింది. చెన్నై బౌలర్లలో ఎంగిడి (2/34) రాణించాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (బి) కర్ణ్‌శర్మ 26; నితీశ్‌ రాణా (సి) కర్ణ్‌శర్మ (బి) ఎంగిడి 87; నరైన్‌ (సి) జడేజా (బి) శాంట్నర్‌ 7; రింకూ సింగ్‌ (సి) రాయుడు (బి) జడేజా 11; మోర్గాన్‌ (సి) రుతురాజ్‌ (బి) ఎంగిడి 15; కార్తీక్‌ నాటౌట్‌ 21; త్రిపాఠి నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172; వికెట్ల పతనం: 1-53, 2-60, 3-93, 4-137, 5-167; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-31-0; కరన్‌ 3-0-21-0; ఎంగిడి 4-0-34-2; శాంట్నర్‌ 3-0-30-1; జడేజా 3-0-20-1; కర్ణ్‌శర్మ 4-0-35-1;
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (సి) రింకూ సింగ్‌ (బి) వరుణ్‌ 14; రుతురాజ్‌ (బి) కమిన్స్‌ 72; రాయుడు (సి) నరైన్‌ (బి) కమిన్స్‌ 38; ధోని (బి) వరుణ్‌ 1; కరన్‌ నాటౌట్‌ 13; జడేజా నాటౌట్‌ 31: ఎక్స్‌ట్రాలు 9 వికెట్ల పతనం: 1-50, 2-118, 3-121, 4-140; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-31-2; నాగర్‌కోటి 3-0-34-0; నరైన్‌ 4-0-23-0; ఫెర్గూసన్‌ 4-0-54-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-20-2; రాణా 1-0-16-0

ఇవీ చదవండి..

సూర్యకుమార్‌.. న్యూజిలాండ్‌ జట్టుకు ఆడు!

సూర్యకుమార్‌పై ముంబయి ట్వీట్‌.. వైరల్‌
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.