
తాజా వార్తలు
ఆ ఐసీసీ నిబంధనను మార్చండి: సచిన్
మీ నిర్ణయాన్ని 1000శాతం ఏకీభవిస్తా పాజీ : హర్భజన్
ఇంటర్నెట్‌డెస్క్: క్రికెట్లో ఎల్బీడబ్ల్యూల విషయంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాలపై క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో ఐసీసీ నిబంధనల్లో మార్పులు చేయాలని చెప్పాడు. తాజాగా ఈ విషయంపై విండీస్ మాజీ క్రికెటర్ బ్రయన్ లారాతో మాట్లాడిన సచిన్ దాన్ని ట్విటర్లో పంచకున్నాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాల్లో బంతి ఎంత శాతం వికెట్లను తాకుతుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని, డీఆర్ఎస్లో అది వికెట్లను తాకుతున్నట్లు తేలితే.. అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఆ బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ప్రకటించాలని చెప్పాడు. ‘ఐసీసీలో నేనొక విషయాన్ని అంగీకరించను. అదేంటంటే కొన్నేళ్లుగా క్రికెట్లో డీఆర్ఎస్ పద్ధతిని అవలంభిస్తున్నారు. ఎల్బీడబ్ల్యూల విషయంలో 50శాతం మేర బంతి వికెట్లను తాకితేనే ఆన్‌ఫీల్డ్ అంపైర్ దాన్ని ఔట్‌గా ప్రకటిస్తున్నారు. లేకపోతే ఔట్‌గా పరిగణించడం లేదు’ అని సచిన్ పేర్కొన్నాడు.
బ్యాట్స్‌మన్ లేదా ఫీల్డర్లు ఎవరైనా డీఆర్ఎస్కు ఎందుకు వెళతారు? ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై సందేహం ఉంటేనే రివ్యూకు వెళతారని సచిన్ అన్నాడు. అలాంటప్పుడు సాంకేతిక విషయాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నాడు. టెన్నిస్‌లో పాటించే ఇన్ ఆర్ ఔట్ పద్ధతిని పాటించాలని సూచించాడు. అంతేకానీ రెండింటి మధ్యలో అంపైర్ నిర్ణయానికి వదిలేయొద్దని సచిన్ స్పష్టంచేశాడు. ఈ పోస్టుకు స్పందించిన వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ లిటిల్ మాస్టర్ అభిప్రాయంతో ఏకీభవించాడు. ‘మీతో వెయ్యి శాతం ఏకీభవిస్తున్నా పాజీ. ఎల్బీడబ్ల్యూల విషయంలో బంతి వికెట్లకు తాకుతున్నట్లు అనిపిస్తే దాన్ని ఔట్‌గా ప్రకటించాలి. అదెంత శాతం తాకుతుందనే విషయాన్ని పరిగణించాల్సిన అవసరం లేదు. ఆట మంచి కోసం కొన్ని నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉంది. అందులో ఇదీ ఒకటి’ అని కామెంట్ చేశాడు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్ నేపథ్యంలో ఐసీసీ ఇటీవల కొన్ని నిబంధనల్లో మార్పులు తెచ్చింది. అందులో భాగంగా స్వదేశంలో ఆడే టెస్టుల్లో స్థానిక అంపైర్లను ఉపయోగించుకోవచ్చని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో అన్ని జట్లకూ అదనంగా ఒక డీఆర్ఎస్ను వినియోగించుకునే అవకాశం కల్పించింది. దీంతో ఇప్పుడు ప్రతీ జట్టూ టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌కు మూడు రివ్యూలు తీసుకునే వీలు కలిగింది.