సింధు.. చిన్నపాటి షాకిచ్చావ్‌: రిజిజు
close

తాజా వార్తలు

Published : 03/11/2020 10:01 IST

సింధు.. చిన్నపాటి షాకిచ్చావ్‌: రిజిజు

నీ సంకల్ప బలంపై అమితమైన నమ్మకం ఉంది

(Photo: Kiren Rijiju Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పీవీ సింధు రిటైరౌతున్నట్లు సోమవారం సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అటు నెటిజన్లు, ఇటు వార్తా ప్రసార మాధ్యమాలు అసలు సంగతి తెలుసుకోకుండా ఆమె రిటైరౌతున్నట్లు పేర్కొన్నారు. దీంతో అనేక మందికి తప్పుడు సమాచారం చేరింది. ఇదే విషయంపై స్పందించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు.. సింధు ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. ఆమె పోస్టుతో చిన్నపాటి షాకిచ్చారని చెప్పారు. అయితే, సింధు సంకల్ప బలంపై తనకు అమితమైన నమ్మకం ఉందని, భారత దేశానికి మరిన్ని కీర్తి ప్రతిష్ఠలు సాధించే శక్తి సామర్థ్యాలు ఆమెకు ఉన్నాయని రిజిజు పేర్కొన్నారు. 

అంతకుముందు సింధు తన ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు అందరినీ అయోమయానికి గురిచేసింది. ‘‘కరోనా మహమ్మారి నా కళ్లు తెరిపించింది. మ్యాచ్‌లో చివరి షాట్‌ వరకు ప్రత్యర్థులతో హోరాహోరీగా పోరాడేలా శిక్షణ పొందగలను. ఇంతకుముందు ఆ పని చేశా. ఇకమీదట కూడా చేస్తా. అయితే ప్రపంచాన్ని ఆపేసిన ఈ కంటికి కనిపించని వైరస్‌తో పోరాడటం ఎలా? ఎన్నో నెలలుగా ఇంట్లోనే ఉంటూ బయట అడుగుపెడుతున్న ప్రతిసారి ఇదే ప్రశ్న వేసుకుంటున్నాం. కరోనా మిగిల్చిన హృదయ విదారక కథనాలు నన్ను ప్రశ్నించుకునేలా చేశాయి. డెన్మార్క్‌ ఓపెన్‌లో పాల్గొనకపోవడం కరోనా విషాదాల్లో చివరిది కావాలి. అశాంతి, ప్రతికూలతలు, భయాందోళనలు, అనిశ్చితి నుంచి ఈ రోజు రిటైరవ్వాలని అనుకుంటున్నా. మరీ ముఖ్యంగా అపరిశుభ్ర ప్రమాణాలు, వైరస్‌ పట్ల జాగ్రత్తలేని మన వైఖరి నుంచి రిటైరవ్వాలని భావిస్తున్నా. మనమంతా ఈ వైరస్‌ను ఓడించాలి. రిటైర్మెంట్‌ అంటూ మీ అందరికీ చిన్నపాటి గుండెపోటు తెప్పించి ఉంటా! అందరినీ ఆలోచింపజేయాలన్నదే నా ప్రయత్నం. డెన్మార్క్‌ ఓపెన్‌లో పాల్గొనలేకపోయివుండొచ్చు. కానీ ప్రాక్టీస్‌ చేయకుండా ఆగలేదు. ఆసియా ఓపెన్‌కు సిద్ధంగా ఉన్నా. పోరాడకుండా మధ్యలో వదిలేయడం నాకిష్టం ఉండదు’’ అని అసలు విషయం చెప్పింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని