close

తాజా వార్తలు

ఉతికారేసిన రాహుల్‌, కోహ్లీ, అయ్యర్‌

204 పరుగుల భారీ లక్ష్యం కరిగించిన టీమ్‌ ఇండియా

ఛేదనలో రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధశతకాలు

వారం వ్యవధిలోనే రెండో సిరీసు. ఒక రోజంతా ప్రయాణం. సాధన చేసేందుకు సమయమే దొరకలేదు. సరికొత్త వాతావరణ పరిస్థితులకు అలవాటు పడలేదు. ఐనా టీమ్‌ ఇండియా అద్భుతం చేసింది. తొలి టీ20లో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్‌ మిగిలుండగానే ఛేదించి ఔరా అనిపించింది.  కేఎల్‌ రాహుల్‌ (56; 27 బంతుల్లో 4×4, 3×6), శ్రేయస్‌ అయ్యర్‌ (58*; 29 బంతుల్లో 5×4, 3×6), విరాట్‌ కోహ్లీ (45; 32 బంతుల్లో 3×4, 1×6) అదరగొట్టారు. అంతకుముందు కివీస్‌లో కొలిన్‌ మన్రో (59; 42 బంతుల్లో 6×4, 2×6), కేన్‌ విలియమ్సన్‌ (51; 26 బంతుల్లో 4×4, 4×6), రాస్‌ టేలర్‌ (54*; 27 బంతుల్లో 3×4, 3×6) అర్ధశతకాలతో రాణించారు.


 

కోహ్లీ-రాహుల్‌ పునాది

ఛేదనలో ఏ ఒక్కరి ఆటనో అద్భుతం అని వర్ణించేందుకు వీల్లేదు. అందరూ సమయోచితంగా ఆడారు. రక్షణాత్మక ధోరణికి తావివ్వలేదు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (7) జట్టు స్కోరు 16 వద్దే శాంట్నర్‌ బౌలింగ్‌లో టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఎదురుగా కొండంత లక్ష్యం ఉన్నప్పటికీ కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ బెదరలేదు. వికెట్‌ కాపాడుకోవాలని భావించలేదు. దొరికిన బంతిని దొరికనట్టు బాదేశారు. వీరిద్దరూ 2 వికెట్‌కు 99 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. అర్ధశతకం తర్వాత రాహుల్‌ సోధి బౌలింగ్‌లో సౌథీకి దొరికిపోయాడు. అప్పుడు స్కోరు 115. మరో 6 పరుగులకే కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను గప్తిల్‌ గాల్లోకి ముందుకు దూకి అందుకొని షాకిచ్చాడు.


 

శ్రేయస్‌ దూకుడు

ఏం జరుగుతుందా అనుకున్న తరుణంలో శ్రేయస్‌ అయ్యర్‌కు జతకలిసిన శివమ్‌ దూబె (13; 9 బంతుల్లో 1×4, 1×6) ఒక భారీ సిక్సర్‌, బౌండరీ బాది ఆశలు రేపాడు. అంతలోనే సౌథీకి క్యాచ్‌ ఇచ్చాడు. చివరి 5 ఓవర్లలో విజయానికి 53 పరుగులు అవసరం కాగా శ్రేయస్‌ విజృంభించాడు. గేరు మార్చి ధనాధన్‌ బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. రన్‌రేట్‌ను అస్సలు తగ్గనివ్వలేదు. కివీస్‌ బౌలర్లపైనే ఒత్తిడి పెంచాడు. మనీశ్‌ పాండే (14*; 12 బంతుల్లో 1×6)తో కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 62 పరుగులు జోడించాడు. ఆఖరి రెండు ఓవర్లలో 18 పరుగులు అవసరం సిక్స్‌, బౌండరీ, సిక్స్‌ బాది మరో 6 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


 

ఆఖర్లో లయ

నిజానికి ఈ విజయం సునాయాసంగా దక్కిందంటే కారణం బౌలర్లే. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఆఖరి మూడు ఓవర్లను వారు అద్భుతంగా విసిరారు. ఎందుకంటే 17 ఓవర్లకు కివీస్‌ 178/4తో పటిష్ఠ స్థితిలో ఉంది. రాస్‌టేలర్‌ ఊపుమీదున్నాడు. అతడి ధాటికి స్కోరు 230 దాటాలి. కానీ బుమ్రా 18వ ఓవర్లో 4 పరుగులిచ్చి వికెట్ తీశాడు. 19వ ఓవర్లో షమి 9, ఆఖరి ఓవర్లో బుమ్రా 12 పరుగులే ఇచ్చి లక్ష్యం మరింత పెరగకుండా కాపాడారు. తొలుత కివీస్‌ ఓపెనింగ్‌ అదరింది. గప్తిల్‌ (30), మన్రో భారత పేసర్లకు చుక్కలు చూపించారు. 80 పరుగులకు కానీ తొలి వికెట్‌ లభించలేదు. ఆ తర్వాత కేన్‌ విలియమ్సన్‌, మన్రో అర్ధశతకాలు సాధించారు. ఆఖర్లో టేలర్ అజేయ అర్ధశతకం బాదేశాడు. 17 ఓవర్ల వరకు టీమిండియా అభిమానులు, ఆటగాళ్లకు ఆందోళన పడ్డారు. బుమ్రా, శార్దూల్‌, చాహల్‌, దూబె, జడేజాకు తలో వికెట్‌ దక్కింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.