లంక ప్రీమియర్‌ లీగ్‌పై మునాఫ్‌ మనసు
close

తాజా వార్తలు

Published : 12/09/2020 13:16 IST

లంక ప్రీమియర్‌ లీగ్‌పై మునాఫ్‌ మనసు

ఇదివరకే టీ10 లీగ్‌ ఆడిన మాజీ పేసర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: నవంబర్‌లో నిర్వహించ తలపెట్టిన లంక ప్రీమియర్‌ లీగ్‌పై టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ మునాఫ్‌ పటేల్‌ మనసుపడినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్‌ బోర్డు తొలిసారి నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్‌ వేలంలో అతడు పాల్గొనబోతున్నాడు. అక్టోబర్‌ 1న నిర్వహిస్తున్న ఈ వేలంలో సుమారు 150 మంది విదేశీ ఆటగాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఉన్నాడు. ఇక విదేశాల నుంచి పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది, ఇంగ్లాండ్‌ ఆటగాడు రవి బొపారా, బంగ్లాదేశ్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌, వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ బ్రావో, దక్షిణఫ్రికా స్టార్‌ కొలిన్‌ మన్రో తదితరులు ఉన్నారు. 

నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 6 వరకు శ్రీలంకలో ఐదు ఫ్రాంఛైజీలతో ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించాలని ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతీ జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు, 13 మంది స్వదేశీయులతో మొత్తం 19 మంది చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. దీంతో మొత్తంగా చూస్తే 30 మంది విదేశీయులు ఈ వేలంలో ఎంపికయ్యే అవకాశం ఉంది. కాగా, తొలుత ఈ టోర్నీని ఆగస్టులోనే నిర్వహించాలని చూసినా కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడిక అన్ని క్రీడలూ జరుగుతున్న నేపథ్యంలో లంక బోర్డు సైతం ముందడుగు వేసింది. 

మరోవైపు ఈ టోర్నీ కోసం శ్రీలంకకు వచ్చే ఆటగాళ్లకు క్వారంటైన్‌ సమయాన్ని 14 రోజులకు బదులు 7 రోజులకు కుదించాలని ఆ క్రికెట్‌ బోర్డు ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే, లంక ప్రభుత్వం మాత్రం క్వారంటైన్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తోంది. అక్కడ వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా గట్టి చర్యలు తీసుకుంటోంది. కాగా, 2006లో టీమ్‌ఇండియాకు ఎంపికైన మునాఫ్‌ పటేల్‌ 2018లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడికి విదేశీ లీగుల్లో ఆడే అవకాశం లభించింది. ఇదివరకు యూఏఈలో నిర్వహించిన టీ10 లీగ్‌లోనూ ఆడాడు. ఇక టీమ్‌ఇండియా తరఫున మొత్తం 13 టెస్టులు, 70 వన్డేలు ఆడిన అతడు టీ20ల్లో కేవలం మూడు మ్యాచ్‌లే ఆడాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని